FeaturedFilmsNewsips

కౌన్‌ బనేగా ‘మృత్యుంజయ’…?

ముంబయి: వృధ్ధుడే. 77యేళ్ళ వాడే. నిన్నకాక మొన్న మృత్యువును పకరించి వచ్చినవాడు. అయినా ‘లైట్స్‌, కెమెరా, యాక్షన్‌’ అంటే.. ‘త్రీపీస్‌’ కోటు సరిచేసుకుని కూర్చున్నాడు. ఎవరో వేరే చెప్పాలా? బిగ్‌ ‘బి’ అమితాబ్‌ బచ్చన్‌.
కోవిద్‌`19తో పోరాడి, జయించి వచ్చిన అగ్రనటుడు తన ‘కౌన్‌ బనేగా కరోర్‌ పతి’(కెబిసి) గేమ్‌షో 12 వ సీజన్‌ షూటింగ్‌ లో పాల్గొన్నాడు. ఏమీ మారలేదు. అదే ఉత్సాహం. కానీ కొత్త ఉత్కంఠ. ఈ అనుభవాన్ని తన అభిమానుతో బ్లాగు ద్వారా పంచుకున్నారు.


షూటింగ్‌ లో అందరూ తెలిసినవారే. కానీ అపరిచితుల్లా వున్నారు. కారణం ‘పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌’ (పిపిఈ) కిట్లు. బహుశా ఇక మీదట షూటింగున్నీ ఇలాగే వుంటాయి కాబోలు. ప్రతీ అంశాన్నీ ట్వీట్లలో నాటకీయంగా చెప్పే నటుడు ఈ కొత్త అనుభవాన్ని కూడా అంతే నాటకీయంగా చెప్పారు. అది షూటింగ్‌ జరిగే సెట్‌ లాగా లేదు. శాస్త్రజ్జులు వున్న ప్రయోగశాలలా వుంది. వాతావరణం అంతా గంభీరం. నిశ్శబ్దం. ప్రతీ కదలికా జాగ్రత్తగా వుంది. అంతా శానిటైజర్ల సుగంధంతో నిండిపోయింది.
అలసట యెరుగని ఈ నటుణ్ణి  వెండితెర మీద చూసి అభిమానులకు చాలా కాలమయ్యింది. అయితే ‘ఇంటి తెర’(హోమ్‌ థియేటర్‌)లో ‘గులాబో సితాబో’ లో చూసిన అనుభవం మాత్రం వారికి తాజాగానే వుంది.
ఇరవయ్యేళ్ళ బుల్లితెర ప్రేక్షకులను కెబీసీలో తన కంచు కంఠంతో సమ్మోహితుల్ని చేసిన బిగ్‌బీ, మళ్ళీ ఆరోగ్యంగా, తాజాగా ‘కంప్యూటర్‌ జీ లాక్‌ కరో’ అంటూ రాబోతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *