FeaturedPolitics

నిన్న పల్లకీ మోస్తే, నేడు భుజం లాగిందా?

నాటి ‘గులాము’లే నేటి తీర్పరులా..?


రోగం కుదరాలంటే ఆపరేషన్‌ చెయ్యాల్సిందే; ఆపరేషన్‌ చేస్తే రోగి బతకడు. ప్రేమిస్తే కానీ పెళ్ళి కాదు; పెళ్ళయితే ప్రేమ నిలవదు. నెహ్రా కుటుంబాన్ని తప్పిస్తే కానీ, కాంగ్రెస్‌ బాగు పడదు; కానీ ఆకుటుంబం లేకుండా కాంగ్రెస్‌ బతకలేదు.
అంటే, రోగి రోగిలాగే వుండాలి, బ్రహ్మచారి బ్రహ్మచారిలాగే వుండాలి, కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ లాగే వుండాలి.
ఈ మాత్రం దానికి సమావేశాలూ, చర్చలూ, మేధోమధనాలూ. దానికి తోడు అసహనశీలుర ‘బహిరంగ ప్రేమ లేఖలు’. (‘ ఈ లేఖ నీ కోసమే, ఎవరికీ చూపించకే’ అని చెప్పి, పేపర్లో అచ్చెయ్యించిన దుందుడుకు ప్రేమికుడులాంటి నేతలే ఈ లేఖలు రాశారు.) మళ్ళీ వాటి మీద పంచాయితీలూ. అదేదో ‘రాజద్రోహానికి’ పాల్పడినట్లు వారి మీద విసుర్లూ.
ఇదే కదా, తాజాగా (24 ఆగస్టు 2020 నాడు) జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ( సీడబ్ల్యూసీ) తేల్చిందీ? ‘నన్ను అధ్యక్షత బాధ్యతలనుంచి తప్పించండీ’ అనీ సోనియాగాంధీ అడగటమూ, తిరిగి ఆమెనే ‘అధ్యక్షురాలి’గా ( కాకుంటే తాత్కాలిక అధ్యక్షురాలిగా) చేసి పంపటమూ- ఇంతకు మించి ఏమి జరిగింది?
నిజమే. ఇప్పటికీ బీజేపీకి జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే. అదే పెద్ద విషాదం. ఎందుకంటే కాంగ్రెస్‌ ఎదగదు. ఆ స్థానంలోకి మరో ప్రత్యామ్నాయాన్ని రానివ్వదు. ఫలితంగా దేశంలో బీజేపీ- దినదిన ప్రవర్థమానం కాదు- క్షణక్షణ ప్రవర్థమానం చెందుతోంది. అంతకు ముందు (2004 నుంచి 2014 వరకూ) ఈ దుస్థితి బీజేపీకి వుండేది. కానీ గత ‘ఆరేళ్ళలో’ వీరు వారయ్యారు.

సరిగ్గా సీడబ్ల్యూసీ సమావేశం జరగటానికి ముందే 23 మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు, కాంగ్రెస్‌ లోని వారి కోసం ఈ లేఖ రాశారు. వాళ్ళ బాధంతే ఇదే. రాసిన వాళ్ళలో ఏకంగా రాజ్యసభలో ప్రతిపక్షనేత గా కాంగ్రెస్‌ స్వరాన్ని వినిపించే గులావ్‌ు నబీ ఆజాద్‌ తో పాటు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులూ, పార్లమెంటు సభ్యులూ వున్నారు. వీరంతా ఒకప్పుడు సోనియాకూ, సోనియా కుటుంబ సభ్యులకూ అత్యంత సన్నిహితులే.
వీళ్లు లేఖలో ఎవరిని గురిపెట్టారు? పేరంటే చెప్పలేదు కానీ, సోనియా గాంధీనే. కాంగ్రెస్‌కు ‘పూర్తి కాలపు సమర్థవంతమైన నాయకత్వం’ కావాలన్నారు. నిజమే కదా? ఆమె అనారోగ్య కారణాల వల్ల పూర్తి కాలాన్ని వెచ్చించటం లేదు. కాంగ్రెస్‌ పతనాన్ని నిలువరించ లేక పోతున్నారు. రాష్ట్రాల్లో వున్న కాంగ్రెస్‌ సర్కారులు కళ్ళ ముందు బలహీనపడిపోతున్నాయి. మధ్యప్రదేశ్‌ లో అయితే ఏకంగా కూలిపోయింది. రాజస్థాన్‌ లో చావు తప్పి కన్ను లొట్ట బోయింది. పంజాబ్‌ లో కూడా స్వల ప్రకంపనాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్‌కు చిరునామా గల్లంతయి చాలా కాలమయ్యింది. తెలంగాణ వంటి రాష్ట్రాలలో ప్రతిపక్షంగా ఉందంటే ఉంది; లేదంటే లేదు.
పార్టీ బలహీనంగా వున్నప్పుడు కూడా బయిటవాళ్ళే కాదు, లోపలి వాళ్ళు కూడా రాళ్ళు వేస్తారు. పూలు దొరక్క కాదు. మళ్ళీ ఈ అవకాశం రాదని. ఎప్పటి నుంచో ‘పార్టీ హైకమాండ్‌’ ని అనాలకున్న మాటలన్నీ అనేశారు. ‘పూర్తి కాలపు సమర్థవంతమైన నాయకత్వం’ నేడు పార్టీకి అవసరమన్నారు. చూడ్డానికి ఇదే గంభీరమైన సూచనలా వుంది కదా! కాదు. అదో పెద్ద తిట్టు. బండరాయి. అంటే ఆమె నాయకత్వం ‘ఫుల్‌ టైవ్‌ు’ లాగా లేదు అని. కేవలం ‘పార్ట్‌ టైవ్‌ు’ ఉద్యోగం లాగా చేస్తున్నారన్న అభియోగం. దానికి తోడు సమర్థవంతంగానూ, ప్రభావం కలిగించేది గానూ లేదూ అని మరో ఎత్తి పొడుపు కూడా.

దూసిన ’త్రీడీ‘ ఖడ్గం!
ఈ మాటతో పాటు ఫిర్యాదులూ, పరిశీలనలూ, సూచనలూ వుండే ‘త్రీడీ’ (మూడంచుల) ఖడ్గాన్ని తీసారు. (రెండంచుల కత్తి తీస్తేనే, తీసిన వాడు కూడా గాయపడతాడు. మూడంచెలంటే చెప్పనవసరంలేదు.), వరుసగా రెండుసార్లు (2014, 2019) సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ పరాజయం పాలయ్యింది కదా! మొదట 44 స్థానాలూ, రెండోసారి 52 సీట్లూ గెలుచుకుంది. మొదటిది అతిఘోర పరాజయమయితే, రెండోది ఘోర పరాజయం. మరీ వీటి మీద పార్టీ నిజాయితీతో కూడిన సమీక్ష చేసిందా- అన్నది లేఖారచయితల ప్రధానమైన ఫిర్యాదు.
సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా పార్ట్‌ టైవ్‌ు సేవలందిస్తున్నారా, లేక పూర్తికాలపు సేవలందిస్తున్నారా, అన్న అంశం పక్కన పడితే, అసలు కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ పోస్టు అన్నది పర్మనెంటు పోస్టా? టెంపరరీయా? అవుట్‌సోర్సింగా? ఇంత తీవ్రంగా అయితే మాట్లడలేదు కానీ, దాదాపు ఇదే అర్థం వచ్చేటట్టు ‘నాయకత్వం లో అనిశ్చితి’ వుందీ, అని అనేశారు. ఇది వారి పరిశీలన.
ఒక వ్యక్తో, కుటుంబమో నాయకత్వం చేపట్టకూడదు. అంటే నాయకత్వమంటే, సోనియా గాంధీయో లేక రాహుల్‌ గాంధీయో గుర్తుకు రాకూడదు. నెహ్రూ కు టుంబం అస్సలు మదిలో మెదలకూడదు. మరి? నాయకత్వమంటే, ఒక వ్యవస్థ కనిపించాలి. ఉమ్మడి నాయకత్వం వుండాలి. దానికి ‘వ్యవస్థాగత నాయకత్వ’మని పేరు పెట్టారు. ఇది వారి సూచన.
ఇంకా, కాంగ్రెస్‌ నేతలు అలవాటుగా మాట్లాడే, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం , సరిహద్దుల్లో ఉత్రిక్తత, బీజేపీ- ఆరెస్సెస్‌ల మతతత్వం ఇత్యాది విషయాలు కూడా ప్రస్తావించారు. ఇవి అంత కీలకమైనవి కావు.

అధ్యక్షపదవికి జరిగిన ఎన్నికల్లో సోనియాకు వ్యతిరేకంగా పోటీచేసి అతి తక్కువ వోట్లతో అభాసు పాలయిన జితేంద్ర ప్రసాద వైనం కూడా జ్ఞాపకం వుండే వుంటుంది.


ఈ లేఖారచయితల్లోని కురువృధ్ధులకు నెహ్రూ కుటుంబం నాయకత్వం పక్కకు తప్పుకున్నప్పటి కాంగ్రెస్‌ స్థితి కూడా గుర్తుండే వుంటుంది. పీవీ నరసింహారావు, సీతారావ్‌ు కేసరిల నాయకత్వంలో అధికారంలోనుంచి, అధఃపాతాళంలోకి కాంగ్రెస్‌ పడిపోయిన చరిత్ర స్పుÛరణకు వచ్చే వుంటుంది. అధ్యక్షపదవికి జరిగిన ఎన్నికల్లో సోనియాకు వ్యతిరేకంగా పోటీచేసి అతి తక్కువ వోట్లతో అభాసు పాలయిన జితేంద్ర ప్రసాద వైనం కూడా జ్ఞాపకం వుండే వుంటుంది. తిరిగి సోనియా పగ్గాలు చేపట్టి, తిరిగి పూర్వస్థితికి తీసుకొచ్చాకనే, కాంగ్రెస్‌ తిరిగి మరో పదేళ్ళు పాటు (2004 నుంచి 2014 వరకూ) దేశాన్ని నిరంతరాయంగా పరిపాలించింది. అలాగే తర్వాత వరుస పరాజయాలకు బాధ్యత వహించి రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారంటే, తానే కారకుణ్ణని ఒప్పుకున్నట్లే కదా! ఇది సమీక్షను మించిన సమీక్ష.
పైపెచ్చు బీజేపీ నాయకత్వంగా వ్యక్తి( మోడీ)నే చూపిస్తోంది. ఇప్పటికిప్పుడు సోనియా స్థానంలో జనాకర్షణలేని ఓ పదిమందికి అప్పగిస్తే, మోడీని ఢీకొనగలరా? ఈ లేఖారచయితలు కడుపులో మంటను చల్లార్చుకున్నారు తప్ప, కాంగ్రెస్‌ భవిష్యత్తుకు ఏం దోహద పడ్డారు? పైపెచ్చు, గత రెండు మూడు దశాబ్దాలుగా ఈ లేఖారచయితలే, ‘నెహ్రా కుటుంబాని’కి ప్రధాన బోయీలు. ఎప్పుడో మోసిన మోతకు, ఇప్పుడు భుజం లాగిందంటే ఎలా?

సతీష్ చందర్ (సతీష్ చందర్ ఇతర రచనలకు www.satishchandar.com విజిట్ చెయ్యండి.)

One thought on “నిన్న పల్లకీ మోస్తే, నేడు భుజం లాగిందా?

  • Dr Bandi

    A deep analysis.
    Jai bheem.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *