Bathuku (Life)

పరువు అంటే కులమా..? పెంపకమా..?

బలహీనులపై బలవంతులదే అదిపత్యం. ఎప్పుడు చూసినా, ఎక్కడైనా జరిగేది, జరుగుతున్నది ఇదే కదా. అది ఒక ఆచారమైపోయింది వీరికి. ఒకప్పుడు అనేవారు  (ఏవరు ఉపయోగించారో గానీ ఈ వ్యాక్యాన్నీ.)  అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అని.  (అసలు ఈ వాక్య ప్రయోగం ఏంటో మరీ..?)  ఈ కాలంలో ఆడపిల్లలు పుడితే వాళ్ళతో పాటు పరువు హత్యలు, అత్యాచారాలు కూడా పుడతాయి అని చెప్పాలేమో.!?            

2018లో అమృత ప్రణయ్ ల పరువు హత్య మరువకముందే, హేమంత్-అవంతీల ఘటన మన పాలకుల అసమర్ధతకు అద్దం పట్టేలా కనిపిస్తుంది. (మధ్యలో చాలా జరిగాయి.)  పరువు హత్యలో ప్రాణం కన్నా పరువు ముఖ్యం అని అంటారు. మరీ., అత్యాచారం విషయంలో  ఆ పెద్దలే ఒక  అమ్మాయికి జరిగింది అన్యాయం అని ఒక్కరూ అనరే. ఆ అమ్మాయిదే తప్పు అన్నట్లు ఏకవాక్య తీర్మానం చేస్తారు.

ప్రధానంగా పరువు హత్యలు జరగడానికి మూలం కులం. సామాజిక వర్గ పరంగా అగ్రకులానికి చెందిన అమ్మాయిని,  శూద్ర కులాలకు చెందిన అబ్బాయితో వివాహం జరిగిన సందర్భాలలో ఇలాంటివి జరుగుతాయి. ( ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి విషయంలో కూడా జరిగిన సందర్భాలు లేకపోలేదు.) అయితే హేమంత్-అవంతీ విషయంలో అబ్బాయి వైశ్య, అమ్మాయి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. అంటే ఈ ఇద్దరు అగ్రకులాలకీ చెందినవారే.  అయినప్పటికీ, ఇలాంటి దుర్ఘటన చూడాల్సి వచ్చింది. మరీ.., దీనికి ముగింపు లేదా..?

ఇలాంటి నేరాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. వీటికి కారణం తల్లిదండ్రుల పెంపకంలో ఉందా..? కనిపించని కులంలో ఉందా..? అవంతీ ఒక సందర్భంలో మేము ఎనిమిది ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పారు. కానీ పెళ్లి చేసుకున్న తరువాత వాళ్ళ జీవితం మున్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది. కొన్ని సంవత్సరాలుగా వారిద్దరూ కలసి బతకాలని కలలుకన్నారు. చుట్టు ప్రక్కల ఉన్న వారందరికీ తెలుసు వీరిద్దరీ సాన్నిహిత్యం. అన్ని సంవత్సరాలుగా వాళ్ళు  కలిస్తే పోని పరువు, పెళ్లి చేసుకుంటే పోయిందా! ఇక్కడ అమ్మాయి వెళ్లిపోయింది అని మాట్లాడతారు, కానీ వారి తల్లిదండ్రుల పెంపకం గురించి మాట్లాడరు. అలాని తల్లి తండ్రుల పెంపకాన్ని తప్పు పడుతున్నట్టు కాదు. అ ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే పరువు పోయిందని వాపోయే సమాజం… పెళ్ళి జరిగిన తర్వాత నరకాన్ని అనుభవించే అమ్మాయిల విషయంలో ఎందుకు అలోచించదు..?  పరువు పోతుందని లేదా ఒకే కులంమని వదిలేస్తారా..? అమ్మాయి సంతోషాన్ని చూస్తారా..?  లేక కులాన్ని చూసి సర్థుకుపోతారా..?  పిల్లల పెంపకంలో వారి ఇష్టాయిష్టాల గురించి తెలుకోలేరా..?                         

వీరి విషయంలో చిన్నప్పటి నుంచి  ప్రేమగా పెంచుకున్న నాన్నకు ఎదురు చెప్పోద్దు అని ఆ అమ్మాయి అనుకోలేదు. అంత ప్రేమగా పెంచుకున్న కూతురు ఇష్టాన్ని గౌరవిద్దామని తండ్రి అనుకోలేదు. ఎందుకు… తండ్రీ, కూతురి కోసం సమాజాన్ని ఎదురించాలని అనుకోరు..? సమాజం కన్నా, ముందు తండ్రే ద్రోహం చేస్తున్నారా?

ఇలా పరువు కోసం పాకులాడి  ప్రాణాలు  తీసుకుంటూ పోతే, పంతం నిలుస్తుందని అనుకోవడం ఎంత మూర్ఖత్వం. ఒక రకంగా చూస్తే నిలబెట్టల్సిన జీవితాన్ని ముగించేస్తున్నారు. దీనికీ ఒక చట్టం రావాలా లేదా మనుషుల మనస్తత్వం మారాలా..?

-సుమాంజలి.కె, విద్యార్థిని.

ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అప్ జర్నలిజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *