బీజేపీ వల్ల మజ్లిస్ బలపడుతుందా?
బరిలో నలుగురు వున్నారు. అయినా ఇద్దరే కొట్టుకుంటున్నారు. ‘బస్తీ’ మే సవాల్ అంటున్నారు. వాళ్ళనే యోధానుయోధులుగా, గ్రేటాదిగ్రేటులుగా జనం చూస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జి.హెచ్. ఎం.సి) ఎన్నికల బరిలో కనిపిస్తున్న చిత్రమిది. రెండే రెండు పక్షాల వారి గొంతులే పెద్దగా వినిపిస్తున్నాయి. ఒకటి: టీఆర్‌ఎస్. రెండు: బీజేపీ. రెండూఅధికారంలో వున్న పక్షాలే: ఒకటి రాష్ట్రంలో, మరొకటి కేంద్రంలో. ఈ రెండే బాహాబాహీ తలపడుతున్నట్లున్నాయి.
కానీ మరో రెండు కీలక పక్షాలు వున్నాయి. అవే మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు. ప్రధాన పక్షాల మధ్య పోటీవల్ల, ఈరెండు పార్టీల్లో ఒకటి ఎంత తీవ్రంగా లాభపడుతుందో, ఇంకొక పార్టీ అంతే తీవ్రంగా నష్టపోతోంది. లాభపడేది మజ్లిస్, నష్టపోయేది కాంగ్రెస్.
జిహెచ్‌ఎంసి కున్న 150 వార్డుల్లో టీఆర్‌ఎస్, బీజేపీలు అన్ని చోట్లా పోటీలో వున్నాయి. ఇందులో 50కి పైగా పాత బస్తీలో వున్నాయి. నగరంలో అన్ని చోట్లా ‘మైనారిటీ’లుగా వుండే ముస్లింలు, పాత బస్తీలో మెజారిటీగా వుంటారు.
ఇతరేతర వ్యతిరకేతలు పెద్దగా లేకుండా వుంటే, ఎప్పుడూ ఇక్కడే మజ్లిస్ లబ్ధి పొందుతూ వుంటుంది. ఈ సారి ఈ లబ్ధి ఎక్కువగా వుండేటట్లుగా వుంది. ఈ లబ్ధిని ఆ పార్టీకి సైధ్ధాంతికంగా బధ్ధ విరోధి అయిన, బీజేపీ యే ఎక్కువగా కలిగిస్తోంది.
హిందూత్వకు హిందూత్వమే విరుగుడు?
సరిగ్గా ఇన్నాళ్ళూ ‘మిత్రులు’ గా వుంటూ, ఈ ఎన్నికలప్పుడే విడివిడిగా పోటీ చేయాలనుకుని నిర్ణయించేసుకున్నది టీఆర్‌ఎస్. ఇది ఊహించిందే. లేకుంటే టీఆర్‌ఎస్‌ను ‘ముస్లింల అనుకూల పార్టీ గానూ, హిందువుల వ్యతిరేక పార్టీగానూ’ చిత్రించి బీజేపీ బలపడుతుంది. ఆ అవకాశం పొరపాటున కూడా కేసీఆర్ బీజేపీకి ఇవ్వరు. ఇవ్వలేదు కూడా. తద్భిన్నంగా టీఆర్‌ఎస్ ‘హిందూ అనుకూల పార్టీ’ గా ముందు చూపించుకోవాలి. ఈ విద్య ఆయనకు కొత్తది కాదు. అందుకో ఆయన ఎప్పుడొ చేసిన చండీ యాగమే కాదు, ఇటీవల ‘కాళేశ్వర ఎత్తి పోతల’ తొలి జలాల విడుదలను సాక్షాత్తూ త్రిదండి చిన జియ్యర్ స్వామి ద్వారా చేయించారు. (ఆ మధ్య ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ‘రామ’ జపం చేస్తే, విరుగుడుగా కేజ్రీవాల్ ‘హనుమాన్ చాలీసా’ చదివారే అలాగన్నమాట.) పూర్వం ఏ మతతత్వానికయినా విరుగుడు సెక్యులరిజం వుండేది. ఇప్పుడలా కాదు. హిందూత్వానికి మందు హిందూత్వమే. కాకుంటే ఈ మందును ‘సాత్విక హిందూత్వం’ (సాఫ్ట్ హిందూత్వ) అంటున్నారు. బీజేపీని ఢీకొనాలనుకున్న వారంతా, ఇదే అనుసరిస్తున్నారు. ఈ తరహా ‘జపం’ చెయ్యాలంటే, కేసీఆర్ జి.హెచ్.ఎం.సి ఎన్నికలప్పుడయినా మజ్లిస్ ను దూరం పెట్టాలి. ఈ సాత్విక హిందూత్వంలో మరోకోణం కూడా వుంది. ‘సాత్విక హిందూత్వమంటే’ హిందూ అనుకూలతతో పాటు, ముస్లింల పై సానుభూతి కూడా, అని చెప్పాలని కేసీఆర్ పలుసందర్భాల్లో ప్రయత్నించారు. అందుకే తాము సైతం పాత బస్తీలోటీఆర్ ఎస్ అభ్యర్థులను పెడుతున్నామని ఆయనే కాదు, టీఆర్‌ఎస్ నేతలందరూ చెబుతున్నారు.

మజ్లిస్ కు రెండు కాషాయ బహుమతులు?
ఈ నేపథ్యంలో బీజేపీ టీఆర్‌ఎస్‌ను ఢీకొనటం కోసం, తనకు ఇష్టం లేకున్నా, మజ్లిస్‌కు రెండు మేళ్ళు చేసి పెడుతోంది. పాత బస్లీలోని అన్ని సీట్లలోనూ బీజేపీ పోటీ చెయ్యటం మొదటిది. అప్పుడు అక్కడ వున్న కొద్ది పాటి హిందూ వోట్లూ, బీజేపీ, టీఆర్‌ఎస్, (ఎంతో కొంత) కాంగ్రెస్ ల మధ్య చీలిపోతాయి. అలాగే, ముస్లింలను ఇరుకున పెట్టే ప్రకటనలు చెయ్యటమూ, వాటిని తమ మేనిఫెస్టోలో చేర్చటమూ బీజేపీ మజ్లిస్‌కు చేసి పెడుతున్న రెండో మేలు. తెలంగాణ విమోచనం దినంగా 17 సెప్టెంబరు వ తేదీని ఘనంగా జరుపుతామనటం, మేనిఫెస్టోలో ప్రధానాంశం అయి కూర్చుంది. అంతే కాదు, రోహింగ్యా ముస్లింలకు వోటు హక్కు కల్పించారని కేసీఆర్ సర్కారును నిందించినా, లేక ఆ పార్టీ నేతలు ‘సర్జికల్ స్ట్రయిక్స్’ గురించి ప్రస్తావించినా, అది మజ్లిస్ కు మేలు చేస్తుంది. మజ్లిస్ మీద కాస్తో కూస్తో వ్యతిరేకత వున్న ముస్లింలు సైతం. బీజేపీ ప్రచారం వల్ల మజ్లిస్ శక్తిని పెంచుతున్నారు. అంటే అక్కడ మజ్లిస్ 40 సీట్లు తెచ్చుకున్నా మేయర్ ఎన్నికలో నిర్ణాయక శక్తిగా వుంటుంది.
ఆంధ్ర పార్టీల ఖాళీల్లోకి..!
అలాగే బీజేపీను కాంగ్రెస్‌ను బలహీన పరచింది. ఈ స్థానిక ఎన్నికలలో పాల్గొంటున్న రెండు జాతీయ పార్టీలలోనూ, బీజేపీ దేశమంతటా ముందంజలో వుండటమే కాకుండా, కేంద్రంలో అధికారంలో వుంది. చేసామని కానీ, చెయ్యగలమని కానీ చెప్పాల్సి వస్తే, రాష్ట్రంలో అధికారంలోవున్న టీఆర్‌ఎస్‌కు దీటుగా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ మాత్రమే చెప్పగలదు. అదీకాక, ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో, బీజేపీ విజయం బీజేపీకి కొత్త ఊపు నిచ్చింది. అలాగే గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుచుకున్న నాలుగు ఎం.పి సీట్లు, ఒక సీటు జి.హెచ్.ఎం.సి పరిధిలోనిదే. (కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.) దానికి తోడు తెలంగాణలో ఆంధ్ర పార్టీలు ఒక్కొక్కటీ అంతరించి పోతున్నాయి, లేదా బలహీన పడిపోతున్నాయి.( వైసీపీ సరేసరి. తెలుగుదేశం వున్నా లేనట్లే. జనసేన బీజేపీతో పెట్టుకున్నా, తెగించి ఒక్క సీటు కూడా అడగలేక పోయింది.) దాంతో బరిలో టీఆర్‌ఎస్ తో ఢీకొనే అవకాశం బీజేపీకి వచ్చింది. దీని వల్ల తీవ్రంగా నష్టపోయింది కాంగ్రెస్.
ఉద్వేగాలా? ఉచితాలా?
ఈ సారి నగర వాసులకు కోవిద్ కష్టాలకు తోడు, వరద ముంపు తోడయింది. కోవిద్ లాక్ డౌన్ పొట్ట కొడితే, వరద కొంప ముంచేసింది.
ఈ నేపథ్యంలో, మతం, ప్రాంతం వంటి ఉద్వేగ పరమైన అంశాలకన్నా, దైనందిన అవసరాలే కీలకమవుతాయి. అందుకే అన్నీ పార్టీల మానిఫెస్టోల్లోనూ ‘ఉచితాలు’ ప్రధానభాగంగా వున్నాయి. నీళ్ళు, విద్యుత్, ప్రయాణం- వీటి మీద రాయితీలే రాయితీలు.
ఈ రాయితీలను ఇవ్వటంలోనూ టీఆర్‌ఎస్ ఇంకాస్త వ్యూహాత్మంగా వ్యవహరించింది. మహిళల వోటు బ్యాంకు మీద కన్ను వేసింది. కోటా (75) ను మించి 85 సీట్లను ప్రకటించటంతో పాటు, నీళ్ళ సరఫరా రాయితీలను వుంచింది. అలాగే బీసీలకు ( బార్బర్ షాపులకూ, దోబీ ఘాట్‌లకూ) ఉచిత విద్యుత్తును ప్రకటించింది.
మొత్తానికి జిహెచ్‌ఎంసి ఎన్నికలకు వచ్చేసరికి టీఆర్‌ఎస్ టీఆర్‌ఎస్ లాగాన వుంది కానీ, ప్రధాన ప్రత్యర్థి స్థానం మారినట్లుగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ బదులు బీజేపీ వచ్చింది!?
–సతీష్ చందర్