చచ్చి బతికేద్దామని, చంపుకొని తినేస్తారా?
తలిదండ్రులున్నదెందుకు? పిల్లలకు చేసిపెట్టటానికే. ఎదగాలని వండి పెడతారు. చదవాలని హోవ్‌ు వర్క్ చేసిపెడతారు. అడిగిందెల్లా కొనిపెడతారు. కావలసినవన్నీ అమర్చిపెడతారు. ఉద్యోగం చూసిపెడతారు. ఇల్లు కట్టి పెడతారు. ఈడొచ్చాక తోడును కూడా చూపిపెడతారు. ‘ఇన్ని చేసినవాళ్ళం చంపిపెట్టాలేమా?’ అనుకున్నారు ఇద్దరు దంపతులు. చంపేశారంతే.
ఈడొచ్చిన ఇద్దరు కూతుళ్ళను కొన్ని గంటల వ్యవధిలో తల్లిదండ్రులే హతమార్చారు. కోపంతో కాదు, చీకాకుతో కాదు, ఆవేశం ఆపుకోలేక కాదు. భక్తిని తాళలేక. ఎందరికో భక్తి వుంటుంది. ఆ భక్తిలో పిల్లల క్షేమం వుంటుంది. తమ బిడ్డల్ని చల్లగా చూడమనటమే వాళ్ళు దేవుడికి చేసే విన్నపం. మరి ఈ తల్లి దండ్రులు? ‘నువ్వే చూసుకో చల్లగా’ అంటూ ‘దేవుడి దగ్గర’కు పంపించేద్దామనుకున్నారా?
మదనపల్లి (చిత్తూరు జిల్లా) లో జనవరి 24 న జరిగిన ఘటన తెలుగు రాష్ట్ర ప్రజలనే కాదు, దేశ ప్రజలను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. వెల్లూరు పురుషోత్తమ నాయుడు, పద్మజ. వీరద్దరూ దంపతులు. బాగా చదువుకున్నారు. ఒకరు కెమెస్ట్రీలో పి.హెచ్.డి చేస్తే, ఇంకొకరు మేథమెటిక్స్ పీజీలో గోల్ట్‌మెడలిస్టు. పైపెచ్చు ఇద్దరూ అధ్యాపకులే. చిత్తూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలో పనిచేస్తుంటే, భార్య గత పాతికేళ్ళుగా, సొంత కోచింగ్ ఇస్పిట్యూట్‌లో బోధిస్తోంది. ఈ మధ్యనే మూడంతస్తుల మేడ కట్టుకుని, అందులోకి దిగారు.
ఇంత బాగా చదివిన వాళ్ళు, పిల్లల్ని బాగా చదివించకుండా వుంటారా? ఉన్న ఇద్దరు ఆడపిల్లల్నీ గొప్పగానే చదివించారు. పెద్ద అమ్మాయి అలేఖ్య(27) భూపాల్‌లో డిప్లమా ఇన్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్ చదివింది. ఇక చిన్నమ్మాయి సాయి దివ్య (22) బెంగుళూరులో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తోంది. అంతేకాదు. ఏ కలెక్టరు కావాలనుకుందో, సివిల్ సర్వీసెస్ కు కూడా ప్రిపేర్ అవుతోంది. కోవిద్ వల్ల ఇద్దరూ తమ తల్లి దండ్రులతో కలసివుండే అవకాశం వుంది. అన్నట్టు వీరికి ఒక కుక్కపిల్ల కూడా వుంది. అదే మలుపు తిప్పింది. కథను కాదు. ఈ ఆడపిల్లలనిద్దరినీ. వీరిద్దరూ ఆ కుక్కను వ్యాహ్యాళికి తీసుకు వెళ్ళినప్పుడు, ఓ టర్నింగ్ దగ్గర జరిగిన చిన్న అనుభవం, పెెద్ద అనుమానానికి దారి తీసింది. అక్కడ ఇద్దరిలో ఒకర నిమ్మకాయ తొక్కేశారు. దాంతో మిరపకాయలున్నాయి. అవి కూడా పొందిగ్గా ఒక ముగ్గులో వున్నాయి. తమ వెంట ఏ ‘క్షుద్రశక్తి వస్తుందో’నన్న అనుమానంతో ఇంటికి వచ్చారు. ‘అనుమానం పెనుభూతం’ అని పెద్దలు ఎందుకన్నారో పాపం వాళ్ళకు తెలీదు. భూతం పెద్దదా, చిన్నదా- అన్న అంచనాకు రాలేక పోయారు కానీ, మొత్తానికి, భూతం వచ్చిందని ఖరారు చేసుకున్నారు. అతిథుల్ని పిలిచినట్లు భూతాలను పిలవరు కానీ, రావటం మాత్రం సపరివారంగానే వస్తాయని కూడా నమ్మేసినట్టున్నారు. ఇల్లు ఇల్లు అంతా భూతాలయంలా మారిందనుకున్నారు. విషయాన్ని మెల్లగా తల్లిదండ్రులకు చెప్పేశారు. వాళ్ళు మరీను. ఈ విషయాలను విని, నమ్మటం కాదు, నమ్మటానికి సిధ్ధంగా వున్నారేమో నమ్ముతూ వినేశారు; వింటూనే నమ్మేశారు.
ఈ సంసిధ్ధత వాళ్ళకిప్పటిది కాదు. మరీ ముఖ్యంగా పద్మజ బోధించటం లెక్కలు బోధిస్తారు కానీ, చదవటం మాత్రం, తాంత్రిక గ్రంథాలనే తెప్పించుకుని, గత కొన్నేళ్ళుగా చదువుతున్నారు. నమ్మక చస్తారా? ‘చచ్చినట్టు’ నమ్మేసారు. కాదు, కాదు, ‘చస్తే బతుకుతామని’ నమ్మేశాను. అలాంటి బతుకే, సిసలైన బతుకు, అధికారికమైన బతుకు, సర్వశక్తులు వున్న బతుకు అని కూడా నమ్మేశారు. ఈ నమ్మకాన్ని ఓ మంత్రగాడు కలిగించి వుంటాడని అంటున్నారు.. భూతవైద్యుణ్ణి పట్టుకుంటే, దయ్యాన్ని దించేస్తాడంటారు. మరి భూతవైద్యుణ్ణి దించాలంటే? దయ్యాన్ని పట్టుకోవాలి. దయ్యం పోలీసులకు దొరకదు కదా! సీసీ ఫుటేజ్‌లకు చిక్కితే, అది దయ్యం ఎందుకు అవుతుంది. అసలు వుంటే కదా- చిక్కటానికి?
మధ్యలోనే ‘అశుభం’ కార్డు!
మంత్రగాడు రాగానే, ఒక కూతరు దేహంలో ‘క్షుద్రశక్తి’ వుందని చెప్పేశాడు.(ఇంతకీ మంత్రగాడు ఒకడేనా? తాను ఇంకో మంత్రగాడు వాళ్ళ ఇంటి దగ్గర ముందే చూశానని చెబుతున్నాడు!) అతను అంతవరకే చెప్పాడా? ఇంకా చెప్పాడా? తెలీదు కానీ, తల్లి పద్మజ, తండ్రి నాయుడు ఓ భారీ ‘హారర్’ చిత్రానికి సరిపడా స్క్రీన్‌ప్లే రాసిపెట్టేసుకున్నారు. ( ఆనక ఈ విషయం పోలీసులుతో చెప్పారు లెండి!). ఇది కలియుగం కదా! కాని క్లయిమాక్సుకొచ్చేసింది. అందుకే అన్నీ దుర్మార్గాలు జరిగిపోతున్నాయి… ఆగండాగండి.. ఈ మాత్రం ఉపన్యాసం ఏ ఆధ్యాత్మిక గురువయినా చెప్పేస్తాడు కదా- అని అనేసుకోకూడదు. ఆతర్వాత వచ్చేది సత్యయుగం. ఈ లోకంలోకి ప్రవేశపెట్టటానికి ఒక మంచి కుటుంబం కావాల్సివచ్చింది. ఆ కుటుంబమే ఈ కుటుంబం. సత్యయుగారంభానికి వాళ్ళు చెయ్యాల్సిందెల్లా చనిపోవటమే. అందులో భాగంగా ఒకరినొకరు చంపుకుంటూ వెళ్ళానుకున్నారు. ఇద్దరు పిల్లలు చనిపోయాక, తండ్రికి ఎందుకో ఈ స్క్రిప్టు నచ్చలేదు. మిత్రుడికి ఫోన్ చేశాడు. దాంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. హంతకుల్ని హతుల్ని కాక ముందే రక్షించామంటున్నారు. అంటే వాళ్ళ కౌటుంబిక ఒప్పందం ప్రకారం, భార్య, భర్తలు కూడా ఒకరి నొకరు హత మార్చుకోవాలి. ఇంటర్‌వెల్ బ్రేక్ లోనే రెండు కార్డులు పడ్డాయి. ఒకటి ‘అశుభం’ కారు. ఇంకొకటి ‘శుభం’ కార్డు. ఎందుకంటే పిల్లలు పోయారు. తల్లి దండ్రులు బతికారు.
రెండు రోజుల పాటు పోలీసులు వారిని ఇంట్లోనే వుంచి విచారించి, కొన్ని విషయాలు రాబట్టి, కోర్టుకు హాజరు పరచాలనుకున్నారు. కోవిద్ పరీక్షలు నిర్వహించటానికి భర్త నాయుడు సహకరించాడు కానీ, భార్య ఒప్పుకోలేదు. ఎక్కడయినా శివుడికి కోవిద్ పరీక్షలు నిర్వహిస్తారా? శివుడు గొంతులోనే గరళం వుంటుంది కదా! అది ఆమె లాజిక్కు. తానే శివుడయిపోయాక ఈ పరీక్షలేమిటని, ఆమె చికాకు.
విచారణయితే వాళ్ళ ఇంట్లోనే చేపట్టారు. కానీ కోర్టు ఆదేశం మేరకు జైలుకు పంపాలి కదా! పంపారు. కానీ వీళ్ళని ఎక్కడ వుంచాలి. పద్మజను మహిళల బరాక్ లో వుంచటానికి తటపటాయించినట్టున్నారు. కానీ ఆమే భరోసా ఇచ్చింది, తన వల్ల ఇతర ఖైదీలకు నష్టం వుండదని. అక్కడ నుంచి వాళ్ళను మానసిక వైద్యులకు పంపిస్తే, వీళ్ళని నిర్బంధంలో వుంచే విచారించాలని వైద్యులు చెప్పారు. అప్పుడు విశాఖలోని మానసిక చికిత్సాలయానికి తరలించారు. ఈ లోగా వాళ్ళనుంచి రోజుకో రహస్యం బయిటపడుతోంది. తన పెద్ద కూతుర్ని చంపాక, ఏకంగా ఆమెనాలుక కోసి తల్లి పద్మజ తినేసిందని తండ్రి నాయుడు చెప్పినట్లు బయిటకు పొక్కింది.
ముగ్గూ రేఖాగణితమేనేమో!
ఇలాంటి ఘటన ఇది ఒక్కటే అయితే కొంత బాగుండేది. ఇక ముందు ఇలాంటివి జరగవని ఎవరన్నా హామీ ఇచ్చినా బాగుండేది. ఇప్పటికే ఈ ‘ఉపాధ్యాయ’ దంపతులు కొన్ని వేల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేశారు. నాయుడు ‘కెమిస్త్రీ’ పేరు మీద ‘పసుపు- కుంకుమ’ ల మిశ్రమాన్ని ఏ క్షుద్ర పూజలో ఎలా వాడారో చెప్పలేదన్న హమీ లేదు. పద్మజ ‘రేఖా గణితం’ పేరు మీద, ‘ఏ ముగ్గు వేసి, ఏక్షుద్ర శక్తి’ని ఎలా దించాలో చెప్పలేదు కదా!? ఎందుకంటే, సొంత పిల్లలకే వీరు ఈ తరహా సమాచారం వుండే గ్రంథాలను సమకూరుస్తూ వచ్చారు. పెద్ద కూతురు అలేఖ్య సోషల్ మీడియా పోస్టులే అందుకు తార్కాణం. కలియుగాంతానికి శివుడే కోవిద్ ను సృష్టించాడని నమ్మించే ప్రయత్నం ఆమె చేసింది.
ఇదేదో, ఈ నలుగురిలో ఎవరికో ఒకరికి వచ్చిన మానసిక రోగమయి వున్నా బాగుండేది. సమాజం దాచుకున్న ఉన్నాదం మీదా, మౌఢ్యం మీదా ఈగ వాలేది కాదు! ఈ మానసిక దౌర్బల్యం కూడా ఏ ఒక్కరికో జన్యుపరంగా మేనమామలనుంచో, తాతలనుంచో సంక్రమించినా బాగుండేది! ఆ కోణం నుంచి కొందరు వైద్యులు తరపున ఆలోచించి పెడుతున్నారు. భార్య, భర్తలు ఒకే ‘జన్యు’ కుటుంబంలో నుంచి వచ్చారా? వచ్చినట్లు లేరే!?
ఇదే జిల్లాలో ఇలాంటిదే!
దురదృష్ట వశాత్తూ, ఇలాంటి ఘటనలు ఈ దేశంలో ఇవి కొత్త కాదు. ఇంకా మాట్లాడితే ఈ రాష్ట్రంలోనే కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే, అసలు ఈ జిల్లాలోనే కొత్త కాదు.
ఈ విడ్డూరం జరగటానికి కొన్ని నెలల ముందే (15 మే 2020), ఇదే చిత్తూరు జిల్లా వడ్డికాండ్రిగ గ్రామంలో మాట, వినికిడి లేని సరోజమ్మ అనే 58 యేళ్ళ వృద్ధురాలిని, ఇదే పధ్ధతిలో, నగ్నపరచి, పసుపు రాసి, చంపెయ్యాలనుకున్నారు. ఎవరూ? వెలుపలి వారు కారు. బంధువులే, సొంత మరదలు సుబ్బమ్మా అతని భర్త శేషాద్రి. ఆ వృధ్ధురాలు ‘స్పృహ’లోకి వచ్చి, శేషాద్రి చేతిలో కత్తి చూసి పారిపోయింది. తన కొడుక్కి చెబితే, ఇద్దరూ కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం మీడియాలో వచ్చింది. కానీ ఎక్కువమంది ఈ విషయాన్ని ‘సౌకర్యవంతం’గా మరచిపోయినట్టున్నారు. మరి శేషాద్రి దంపతులు ఇలా చెయ్యటానికి కారణమేమిటో? మానసిక దౌర్బల్యమా?
పూజా? ‘బడితె’ పూజా?
ఏడాది క్రితమే, పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని కల్యాణ్ సమీపంలోని, అటలి గ్రామంలో 50 యేళ్ళ పండరి నాథ్ తారే అనే వ్యక్తినీ అతని తల్లి 72యేళ్ళ చందూభాయ్ తారే అనే వృధ్ధురాలినీ సొంత రక్త బంధువులే హతమార్చారు. వాళ్ళవరో అతని మేన కోడలు కవిత తారె(27), మేనల్లుడు వినాయక్ తారె(22), మరో 17 యేళ్ళ సమీప బంధువూ కలిసి ఈ పనిచేశారు. ఇక్కడ కవితకు కూడా ‘మదనపల్లి’ కథలోని పెద్దమ్మాయి ‘అలేఖ్య’ లాగా, తనకీ ‘దైవశక్తి’ వుందని అనుమానం వచ్చేసింది. మంత్రగాడు సురేంద్ర పాటిల్ వచ్చి ఆ అనుమానం నిజం చేసేశాడు. అంతే కాదు ఈ ‘దైవశక్తి’ పూర్తిగా పనిచెయ్యాలంటే ‘ముసలాళ్ళ’లో వున్న ‘క్షుద్రశక్తి’ని తీసివెయ్యాలన్నారు. అందుకు పూజ, ‘ముసలాళ్ళ’ కు ‘బడితె’ పూజ ఏకకాలంలో చెయ్యాలన్నాడు. అంతే ఆ వృధ్ధుల్ని ఇలాగే నగ్న పరచి, పసుపు రాసి, వెదురు బద్దలతో చచ్చే వరకూ కొట్టారు. వాళ్ళు చచ్చి పోయారు. అక్కడి పోలీసులు మంత్రగాడితో పాటు ముగ్గుర్నీ అరెస్టు చేశారు.
మదనపల్లి ‘హారర్’ ఢిల్లీలో కూడా!
ఇంకో ఏడాది వెనక్కి వెళ్ళితే (2018లో) దేశ రాజధాని నగరం ఢిల్లీలోని బురారిలో అచ్చం మదనపల్లి ఘటన లాంటిదే జరిగింది. భాటియా పేరు గల కుటుంబ సభ్యులు మొత్తం 11 మంది వృధ్ధులూ, పాపలతో పాటు ఉరివేసుకుని చనిపోయారు. ఈ కేసు దర్యాప్తు కోసం వారు పోలీసులకు పెద్ద పనిపెట్టలేదు. ఎందుకు ఇలా సామూహిక ఆత్మహత్య చేసుకుంటున్నారో, పూర్తిగా పుస్తకంలో నోట్సు రాసి మరీ చనిపోయారు. ‘ఇలా చనిపోయి వెంటనే పునర్జన్మ ఎత్తుతున్నామని’ వారు సంకోచానికి తావులేకుండా వివరించిపోయారు. ‘మానసిక దౌర్బల్యం’ కోణం జోలికి పోకుండా, మౌఢ్యం తలకెక్కిందనే పోలీసుల తెంపు చేసుకున్నారు.
‘భూత’ బహుమతి!
అంత వెనక్కి ఎందుగ్గాని, ఒక్క మూడు నెలలు వెనకనే (నవంబరు 2020), దీపావళి సందర్భంగా కాన్పూరులో తన పిన్నీ, బాబాయిలకు ఒక యువకుడు ‘గిఫ్ట్’ ఇచ్చాడు. అది ఒళ్ళు గగుర్పొడిచే ‘గిఫ్ట్’. ఏడేళ్ళ బాలికను కొట్టి, చంపి, ఆమె శరీరాన్ని చీల్చి కాలేయాన్ని, కొన్ని ఇతర అవయాలను మూటగట్టిన‘గిఫ్ట్’. అవి తింటే తాంత్రిక శక్తులు వస్తాయని మంత్రగాడు చెప్పింది, తు.చ తప్పకుండా అమలు జరిపారు. చూశారా మదనపల్లి కేసులో కూడా తల్లి పద్మజ కూతురు నాలుకను కోసి తినేసిందని తెలిసిందన్నారు. ఇదీ ‘మానసిక దౌర్బల్యమే’నా? ఈ పిచ్చి జన్యుపరంగానో, వంశపారంపర్యంగానో సంక్రమిస్తూనే వుందీ అనాలంటే అనేసుకోవచ్చు. కానీ పాపం. ఒకరికొకరికి సంబంధంలేదు.
ముఖమాటం వదిలేస్తే, ఇది పిచ్చి కాదు కానీ, మౌఢ్యం. ఇది ఉంటే పాత కాలంవాళ్ళలోనూ,చదువుకోని వాళ్ళలోనో వుండాలి.
కానీ అన్నింటిలోనూ కొత్త తరం వారే, పడుచు వారే చేస్తున్నారు. పాపం పలుచోట్ల వృధ్ధ తరం బలవుతున్నారు.
అలాగే చదువులేని వారికే మూఢనమ్మకాలు వుండేవి. ఇప్పుడలాకాదు. చదవేస్తే, నిజంగానే వున్న ‘మతి’ పోయి, ‘బాణా మతి’ వస్తోంది. నరబలులు, చేతబడుల మీదకు మనసుపోతోంది.
ఎక్కడో మారు మూల పల్లెల్లో ఈ తరహా ఘటనలు జరగుతుండేవి. ఇప్పుడు ఏకంగా, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ జరిగిపోతున్నాయి.
న ‘భూతో’ న భవిష్యత్!
మితంగా వుంటేనే మతం. అతిగా మరితే మౌఢ్యమే.
ఏదైనాసరే, అంచెల వారీగా అందుకోవాలనుకోవటం ఆశ. ఎకాఎకిన పొందెయ్యాలనుకోవటం అత్యాశ. ఈ అత్యాశకు మౌఢ్యం తోడయితే జరిగేవి ఇలాంటి ఘోరాలే. తెల్లవారేసరికి శతకోటీశ్వరుణ్ణయిపోవాలి. గుప్త నిధి దొరకాలి. ఎలా? ఆర్థిక సలహాదారు కాదు, పారమార్థిక సలహాదారో, ఆధ్యాత్మిక సలహాదారో, భూతవైద్యనిపుణుడో ఎవడో దిగుతాడు. నీ సొంతమనుషులకే పసుపు రాయంచేస్తాడు. లేక పోతే ‘చచ్చిబతికెయ్య’మంటాడు.
ఇందుకు తగ్గట్టుగానే చదువులు. బోధనలు. పురాణాల్ని చరిత్రలంటారు. విశ్వాసాలను విజ్ఞానమంటారు. హేతువు చస్తుంది. అందుకే ఏది తినాలో, ఏమి తాగాలో ఎవరు చెప్పాలి ‘డైటీషియన్’ కదా! కానీ, చదువూ, సంధ్యలేని వాడెవడో ‘యూట్యూబ్’లో చెబుతాడు. ‘పచ్చని రొట్ట తిను. ఎండిన గింజ నములు’ అని. సినిమాలూ అంతే. ఏ ముచ్చటా లేకుండా నడిచిపోతున్న ఏకాకి జీవితాలకు ఒక కుదుపు నివ్వాలి. ఎలా? దెయ్యాన్ని దించితే సరి. హారర్ ను హింసనూ జోడిస్తే..? వణుక్కుంటూ చూసేస్తారు. ‘ఓటీటీ’ ప్లాట్ ఫావ్‌ు లో వదలాలన్నా, ది¸యేటర్లో వదలాలన్నా ఇదే ఫార్ములా. కడకు ఒక అధికారిణి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నా భూతాన్నే దించాలి. మాధ్యమాలు సరేసరి. ఇప్పుడు ఏకంగా ‘వేపమండలూ, నిమ్మకాయలూ’ టీవీ చర్చల్లోకి వచ్చేశాయి.
రాజకీయాలంటరా? అయితే గుడులు చుట్టూ, లేకుంటే విగ్రహాల చుట్టూ. ఆంధ్రప్రదేశ్ నే చూడండి ఎవరో పనిగట్టుకుని విగ్రహాలు విధ్వంసం చేయిస్తూ, వాటి చుట్టూనే రాజకీయాలు తిప్పాలనుకుంటున్నాడు. అందుకే కొత్త తరంలో కొంతమందికి వింత ప్రవర్తన వచ్చేస్తుంది. వీళ్ళు నాటు బాంబు మీద పడ్డా భయపడారు. కానీ, ఒక్క నిమ్మకాయ విసిరితే వణకి చస్తారు.
-సతీష్ చందర్