‘ఊ అంటావా ఓటరా?, ఊహూ అంటావా ఓటరా?’
ఎన్నికల నగారా మోగింది. రాజకీయ రణరంగానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఫిబ్రవరి 10 నుండి మొదలుకొని ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక ప్రజలు ఏ పార్టీకి ఊ అంటారో, ఏ పార్టీకి ఊహూ అంటారో వేచి చూడాల్సిందే.
ఉత్తర్‌ప్రదేశ్
దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు (403) ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ లో ఎన్నికల యుద్ధభూమి సిద్ధమైంది. గత ఎన్నికలలో 312 సీట్లతో బీజేపీ అధికారం చేపట్టింది. 47 సీట్లతో ఎస్పీ ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇతరులు 47 స్థానాలు. ఈసారి ఇక్కడ ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 వరకు, ఏడు దశలుగా ఓటంగ్ జరగనుంది.’యొగీ’కి మంచి యోగముందా? బీఎస్పీ ‘మాయ’మైపోనుందా? అఖిలేశ్ అడుగులు ఎటువైపు? హస్తం పార్టీ ఖాతా తెరుస్తుందా? నరేంద్రమోదీ, అమిత్‌షా, యూపీ సీఎం యోగీ ఆధిత్యనాధ్ సహా ఎంతో మంది కీలక బీజేపీ నేతలు అవకాశం దొరికినప్పుడల్లా సమాజ్‌వాదీ పార్టీ పై తమ బాణాలు సంధిస్తూ వచ్చారు. ఇటీవల కాలంలో బీజేపీ అఖిలేశ్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ వచ్చింది. ఒక్క 2007 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికలు తప్ప గడచిన అన్ని ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ ఎదుగుతూ వచ్చింది. దీని ద్వారా బీజేపీ, ఎస్పీనే తన ప్రధాన శత్రువుగా భావిస్తుందని తెలుస్తుంది.
యొగీ తనని తాను ఇప్పుడు జాతీయ స్థాయి నేతగా చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి మోదీ, అమిత్‌షా కృషి వల్ల యూపీలో అధికారంలోకి వచ్చిన బీజేపీని యోగీ తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు గెలిచినా ఓడినా అది యోగీ ఖాతాలోకి వస్తుంది. ఎందుకంటే గతంలో 300పై చిలుకు స్థానాలు గెలిపించి యోగీ చేతిలో పెట్టాడు మోదీ. తాను ఏ విధంగా ఈ ఐదేళ్ళూ పరిపాలన చేశాడనే దానికి ఈ ఎన్నికలే నిదర్శనం. ఒకవేళ గెలిచినా గతంలో గెలిచిన స్థానాల కంటే ఎక్కువ గెలిస్తేనే మనం విజయం కింద పరిగణించాలి కాని, అంతకంటే తక్కువ వస్తే ప్రజా వ్యతిరేకత పెరిగినట్టే.
ఇక అఖిలేశ్ యాదవ్ వివిధ సామాజిక వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి అనుబంధంగా ఉంటున్న బ్రాహ్మణులకు దగ్గరయ్యేలా ఆయన చేరికలను ప్రోత్సహిస్తున్నారు. 2012 ఎన్నికల్లో ఎస్పీ 224 సీట్లు సాధించడంలో ఓబీసీలు, ముస్లిం, వైశ్యులు కీలకంగా ఉన్నారు. 19 శాతంగా ఉన్న ముస్లింలకు 2017లో అధిక సీట్లు కేటాయించినా గెలిచింది తక్కువే. ఓట్ల చీలిక ఇక్కడ ప్రధాన భూమిక పోషించింది. అందుకే ఈసారి ఓట్లు చీలకుండా కాంగ్రెస్, బీజేపీలో ఉన్న అసంతృప్తి నేతలకు స్వాగతం పలుకుతున్నారు. ఇక పశ్చిమ యూపీలో జాట్‌ల మద్దతు కూడగట్టేందుకు ఆర్‌ఎల్‌డీతో సీట్ల పంపకంపై చర్చలు జరుపుతుంది. ఇక జాట్లు అధికంగా వ్యవసాయ ఆధారిత వర్గం కనుక, రైతు ఉద్యమాల తరువాత ఈ వర్గం ఎవరి పక్షాన ఉంటుందో చూడాలి.
ఇక మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యట్లేదు కాని బీఎస్పీ అభ్యర్ధుల ప్రచారానికి, గెలుపుకు కృషి చేస్తోందని ఆ పార్టీ తెలిపింది. గత ఎన్నికల్లో కేవలం 35 సీట్లకే పరిమితమైన బహుజన్ సమాజ్ పార్టీ, ఈసారి ఎన్ని చోట్ల ప్రభావం చూపుతోందో వేచి చూడాలి. యూపీలో హస్తం పార్టీ కనుమరుగైపోతుందనేది అక్షరసత్యం. 2019లో కాంగ్రెస్ కంచుకోటగా భావించే అమేథిలో రాహుల్‌గాంధీ ఓడిపోయారు. ఇక తనకి అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని చేతపట్టుకొని, కాంగ్రెస్ పార్టీని యూపీలో బ్రతికించడానికి ఆ పార్టీ తరుపున ప్రియాంగా గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిరుద్యోగులు, మహిళా సమస్యలపై తమ గలాన్ని వినిపిస్తుంది. ఇటు దళితులను అటు మహిళలను దెగ్గర చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. టకెట్ కేటాయింపుల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్ కల్పించింది. తమ మొదటి జాబితాలో ఉన్నావ్ అత్యాచార భాధితురాలి తల్లికి టికెట్ కేటాయించింది కాంగ్రెస్.
పంజాబ్
117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏదో ఒక పార్టీకి 59 సీట్లు రావాల్స ఉంటంది. 2017లో 77 సీట్లతో అధికారాన్ని కైవసం చేస్కున్న కాంగ్రెస్, ఈసారి ఎన్ని సీట్లు దక్కించుకుంటుందో చూడాలి. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటంచే విషయంలో కాంగ్రెస్ తర్జన భర్జన పడుతుంది. అమరీందర్ సింగ్ పార్టీ నుంచి బయటకి వెళ్ళాక, ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలక కొన్నినెలల క్రితమే ఒక దళిత సిక్కుని ముఖ్యమంత్రి చేసి, దళిత సమాజం నుంచి మన్ననలు పొందింది కాంగ్రెస్ పార్టీ. ఇక పార్టీ అధ్యక్షుడు సిద్ధూకి, ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ కి మధ్య ఉన్న విభేధాలను పార్టీ పరిష్కరించి, అంతర్గత సమస్యలను సవరించుకుంటే పార్టీకి మేలు జరుగుతుంది. ఇక పంజాబ్ పై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. 2017లో శిరోమణి అకాలి దళ్ ని దాటుకొని 20 సీట్లతో ప్రతిపక్ష స్థానం కైవసం చేసుకున్న ఆప్, ఈసారి పంజాబ్‌లో అభివృద్ధికి సంబంధించి, అవినీతి నిర్మూలన, యువతకు ఉపాధి కల్పన వంటి కీలక అంశాలతో కూడిన 10 పాయింట్ల పంజాబ్ మోడల్ సిద్ధం చేసింది. ఇక సీఎం అభ్యర్ధి ఎంపిక ప్రజలకే వదిలేశారు కేజ్రీవాల్. మరోవైపు శిరోమణి అకాలి దళ్, బీజేపీ కలిసి గతంలో 18 సీట్లు సాధించగా, ఈసారి ఒంటరిగా బరిలోకి దిగుతున్న బీజేపీ కొన్ని సీట్లకే పరిమితం కానుంది. అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూటమి కూడా పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు. రైతు వ్యతిరేక చట్టాలపై ఉద్యమాలు, డ్రగ్స్ సమస్య, అవినీతి లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.
ఉత్తరాఖండ్
70 సీట్లున్న ఉత్తరాఖండ్‌లో 57 సీట్లు సాధించి గత ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 11, ఇతరులు 2 సీట్లు సాధించారు. ఒకప్పుడు యూపీలో అంతర్భాగంగా ఉన్న ఉత్తరాఖండ్, 2000లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతీసారి అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం, ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌లకు మధ్యే ఉండే అవకాశం ఉంది. గెలిపిస్తే అభివృద్ధి చెయ్యాల్సింది పోయి, ముఖ్యమంత్రుల్ని మారుస్తూ వచ్చింది బీజేపీ పార్టీ. అభివృద్ధి, పాలన, పక్కదారి పట్టిందని ప్రజల నుంచి విమర్శలు కూడా ఎదుర్కుంటుంది. ఇక అంతర్గత కొమ్ములాటలు కాంగ్రెస్‌లో మామూలైపోయింది. హరీష్ రావత్‌కు సొంత పార్టీ నేతలే అడ్డుతగులుతున్నారనే వాదన ఉంది. ఆప్ కొత్తగా అడుగుపెట్టినప్పటికీ, సంస్థాగత నిర్మాణం లేని కారణంగా అంతగా ప్రభావం చూపకపోవచ్చు. ఈసారి ఉత్తరాఖండ్ ప్రజలు ఎటువైపు ఉంటారో వేచి చూడాల్సిందే.
మణిపూర్
60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపూర్ లో కాంగ్రెస్ గత ఎన్నికల్లో 28 సీట్లు, బీజేపీ 21 సీట్లలో గెలుపొందగా, ఇతరులు 11 సీట్లు సాధించారు. ఆ తరువాత ఎనిమిది మంది పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అయ్యరు. అప్పుడు బీజేపీ, ఇతర పార్టీలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎన్ బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కూడా ఎవ్వరికీ సరైన మెజారిటీ రాకపోతే, కింగ్‌మేకర్ పాత్రలో నాగా పీపుల్స్ ఫ్రంట్, ఇతరులు, కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో కూడా మాకు తిరుగులేదని చెప్పుకోడానికి బీజేపీకి మణిపూర్ ఎన్నిక కీలకం కానుంది.
గోవా
40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో, 17 సీట్లతో 2017లో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. బీజేపీ 13 సీట్లు, ఇతరులు 10 సీట్లు సాధించారు. తరువాత జరిగిన ఎమ్మెల్యేల ఫిరాయింపులతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. గోవాలోని ప్రమోద్ సావంత్ ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు బీజేపీని ఈ ఎన్నికల్లో కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రజలు బీజేపీని వీడాలని కోరుకుంటున్నపటికీ, కాంగ్రెస్ పట్ల విముఖత చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో చాలా కసరత్తు చేస్తోంది. గోవాలో చివరి నిమిషంలో మమతా బెనర్జీ ఆశక్తికరంగా అడుగుపెట్టింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ పాత్రపై రాజకీయ నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో అసలు ఉనికి లేదని కొందరు అంటుండగా, ఇక్కడ టీఎంసీ బీజేపీకి పోటీ ఇవ్వగలిగితే, జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చని మరికొందరు భావిస్తున్నారు. ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారో చూడాలి మరి.
మన దేశంలో జరిగే ఏ ఎన్నికనూ ఇంకొక ఎన్నికతో పోల్చలేము. ఐనప్పటికీ ప్రజల నాడి ఏ విధంగా ఉందో సరిగ్గా గమనిస్తే పట్టుకోవచ్చు. ఏది ఏమైనా ఈ ఎన్నికలు 2024 ఎన్నికలకు సెమీఫైనల్ మాత్రమే కాదు కాని, అంతకు మించే!
– షమైక్ సరిళ్ళ,