‘కాకా’లు తీరిన యోధుల మధ్య కాషాయ ‘రేఖ’
ముఖ్యమంత్రిగా మహిళ. రేఖా గుప్తా కొలువు తీరారు. మహిళా సీఎం ఢిల్లీకి కొత్త కాదు. బీజేపీకి కొత్తకాదు. కాకుంటే ఇప్పడు దేశంలో వున్న 14 బీజేపీ ముఖ్యమంత్రుల్లో రేఖ ఒక్కరే మహిళ. దాదాపు 27 యేళ్ళ తర్వాత దక్కిన ఢిల్లీ పీఠం పై ఎవర్ని కూర్చోబెట్టాలన్నది ‘కాషాయ’ నేతలకు పెద్ద సవాలే. కాకలు తీరినయోధుల్నో, కాకాలు పెట్టే బాబుల్నో కాకుండా, మహామహుల్ని కూల్చిన ’జెయింట్ కిల్లర్ల’ నో కాకుండా కొత్త ముఖం కోసమే చూశారు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను కూడా ఈ పీఠం వరించలేదు.
కొత్తొక వింత
ఇటీవలి కాలంలో బీజేపీకి ’కొత్త ముఖాల’ పథకం బాగా అచ్చొచ్చినట్టుంది. కానీ ’కొత్త’ను ఎంచుకోవటంలోనూ కొన్ని పాత ఫార్ములాలు తప్పటం లేదు. దశాబ్దానికి పైగా ఢిల్లీని ఏలుతున్న కేజ్రీవాల్ ’బనియా’ కులస్తుడు. డిల్లీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్తకు ఆక్సిజన్ ను అందించే సామాజిక వర్గం ఆయనది. అందుచేత ఆ కులం నుంచి ముఖ్యమంత్రిని ఎంపిక చెయ్యటమే సబబని వ్యూహకర్తలు భావించి వుండాలి. అదీకాక ఢిల్లీలో మహిళా ముఖ్యమంత్రులకు మంచి ఆదరణ వుంది. రేఖా గుప్తాకు ముందే, ముగ్గురు మహిళలు ఈ పీఠం మీదనే కూర్చున్నారు. అందులో ఒకరు (సుష్మాస్వరాజ్) బీజేపీ నుంచీ, ఇంకొకరు( అతిషి మార్లెనా) ఆప్ నుంచీ, మరొకరు (షీలా దీక్షిత్) కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రులుగా హస్తినను పాలించారు. కాకుంటే, సుష్మాస్వరాజ్ పట్టుమని రెండు నెలలు కూడా పదవిలో లేరు. ఇక అతిషి విషయం తెలిసిందే. మహా అయితే ఓ అయిదు నెలలు వున్నారు. కానీ ఏకంగా 15 యేళ్ళు (మూడు పదవీ కాలాల పాటు) వుండి ’హ్యాట్రిక్’ చేసిన ఏకైక మహిళ మాత్రం షీలా దీక్షితే. అంటే ఢిల్లీకి ’షీలా’ మోడల్ బాగా నప్పింది. ఈ కిటుకు గ్రహించే, బీజేపీ మహిళను ఎంచుకున్నారు.
అదీ కాక, సరిగ్గా ఈ ఏడాది (2025) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి, 33 శాతం మహిళా బిల్లు, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదానికి నోచుకుంది. ఇక జనగణన, నియోజకవర్గ పునర్విభజన జరిగితే చాలు. అమలులోకి వచ్చేస్తుంది. పార్టీలు ఎక్కడికక్కడ మహిళానేతల్ని చూపటానికి సంసిధ్ధమవుతాయి. కాకుంటే, ఏ సామాజిక వర్గాలు ఆర్థికంగా ఎదిగి, రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటాయో, ఆ వర్గాలనుంచే ఈ నేతలు కూడా వస్తుంటారు. ఏ పార్టీ అయినా అదే చేస్తుంది. ఇప్పుడు బీజేపీ కూడా అదే చేసింది.
చిత్రం. మోడీ 1.0, మోడీ2.0 సర్కారులు కేంద్రంలో వుండగా, దేశ రాజధాని వున్న ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాలేదు. కానీ మోడీ3.0 వుండగా ఢిల్లీ ’కాషాయం’ చేతికి వచ్చింది. కానీ మోడీ3.0 ప్రభుత్వంలో బీజేపీ ఏక పక్షనిర్ణయాలు యధేచ్ఛగా చెయ్యలేదు. ఎందుకంటే, నితిష్ (జేడీ-యూ), చంద్రబాబు(తెలుగుదేశం)ల మద్దతు మీద నడుస్తోంది. అంటే రాజధానిలో సర్వాధికారం వచ్చేనాటికి, బీజేపీకి కేంద్రంలో ’తిరుగులేని’ అధికారం పోయింది. ’సంకీర్ణ ధర్మం’ పాటిస్తూ, సాదా సీదా అధికారాన్నే చూపించాల్సి వచ్చింది. అయితే దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత, వరుసగా మూడు రాష్ట్రాలకు ( హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలకు) జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ వరస విజయాలు సాధిస్తూ వచ్చింది. ప్రతిపక్ష ఇండియా ప్లస్ కు ముచ్చెమట్లు పోయిస్తూ వచ్చింది. ఇండియా ప్లస్ భాగస్వామ్య పక్లాలు కలసి పోటీ చేసిన చోటా (మహరాష్ట్ర లోనూ), విడిగా పోటీ చేసిన చోటా( ఢిల్లీలోనూ) బీజేపీ విజయాలను దక్కించుకొంది. ఇందుకు బీజేపీ అనుసరిస్తున్న ఎన్నికల వ్యూహం మాత్రమే కారణం కాదు. బీజేపీ కి సైధ్ధాంతిక నాయకత్వాన్ని అందించే రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్.ఎస్. ఎస్) నేరుగా రంగంలోకి దిగటం. ఆర్.ఎస్. ఎస్ కార్యకర్తలు మహారాష్ట్ర, ఢిల్లీలలో నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీలో ఒకప్పుడు మోడీ-షాలదే అంతిమనిర్ణయంలా వుండేది. కానీ మోడీ 3.0లో మాత్రమే ’ఆరెస్సెస్’ ది మాత్రం తుది నిర్ణయంలా కనిపిస్తోంది. ఇందుకు నిదర్శన ఆరెస్సెస్ ’ఎజెండా’ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముందుకు రావటం. కేంద్రంలో ’సంకీర్ణ’ గండం వుండటం వల్ల, ఆరెస్సెస్ తన ఎజెండాను రాష్ట్రాలలో అమలు చేయిస్తోంది. ఉత్తరాఖండ్ లో అమలు చేసి ’ఉమ్మడి పౌర స్మృ తి’ (యూసీసీ) అలాంటిదే. ’సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్ లో వుండే) చేసే జంటకు కూడా ’రిజిస్ర్టేషన్’ తప్పనిసరి అన్నది ఆరెస్సెస్ ’సోషల్ పోలీసింగ్’ లో భాగమే.

తాజాగా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన రేఖా గుప్తా అలాంటి వారే. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నేత గా ఆమె ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ కు (1996లోనే) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె ఆర్. ఎస్. ఎస్ లో క్రియాశీల సభ్యురాలు కూడా. ఆ తర్వాత మునిసిపల్ ఎన్నికలలో కార్పోరేటర్ గా రెండు సార్లు గెలిచారు. కానీ అసెంబ్లీ ఎన్నికలలో షాలిమార్ బాగ్ 2015 నుంచి పోటీ చేస్తున్నా వరుసగా ఒకే అభ్యర్థి (బందన కుమారి) చేతుల్లో రెండు సార్లు ఓడిపోతూ వచ్చి, కడకు 2025 అదే అభ్యర్థి మీద గెలుపొందారు.
‘పరివార్’ ఛాయిస్
ఇప్పుడు రాష్ట్రగవర్నర్ల ఎంపికలోనే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రుల ఎంపికలోనూ ఆరెస్సెస్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర పార్టీలనుంచి ఎగురుకుంటూ బీజేపీలోకి వచ్చిన వారు కాకుండా, ’సంఘ్ పరివార్’ (ఆర్ ఎస్ ఎస్ దాని అనుబంధ సంస్థలలో) పుట్టి పెరిగిన వారికే ముఖ్యమంత్రి పదవుల్ని కట్టబెడుతున్నారు. తాజాగా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన రేఖా గుప్తా అలాంటి వారే. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నేత గా ఆమె ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ కు (1996లోనే) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె ఆర్. ఎస్. ఎస్ లో క్రియాశీల సభ్యురాలు కూడా. ఆ తర్వాత మునిసిపల్ ఎన్నికలలో కార్పోరేటర్ గా రెండు సార్లు గెలిచారు. కానీ అసెంబ్లీ ఎన్నికలలో షాలిమార్ బాగ్ 2015 నుంచి పోటీ చేస్తున్నా వరుసగా ఒకే అభ్యర్థి (బందన కుమారి) చేతుల్లో రెండు సార్లు ఓడిపోతూ వచ్చి, కడకు 2025 అదే అభ్యర్థి మీద గెలుపొందారు. మొదటి సారే ఎమ్మెల్యే అయ్యి వెంటనే ముఖ్యమంత్రి అయ్యారు. అది కూడా కేవలం 50 యేళ్ళకే. ఇందుకు మరో కారణం: ఆర్. ఎస్. ఎస్ ముద్ర.
కేంద్రంలో ఇతరుల మీద ఆధారపడ్డా, బీజేపీ రాష్ట్రాలలో సర్వస్వతంత్రంగా ఎదగటానికి ఈ ’ఆర్.ఎస్. ఎస్’ ప్రమేయమే కీలకం. దేశంలో 28 రాష్ట్రాలు కాక అసెంబ్లీ వున్న కేంద్రపాలిత ప్రాంతాలు మూడు వున్నాయి. వెరసి 31 రాష్టాలు అనుకోవచ్చు. ఇప్పడు ఢిల్లీ రాష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటే 14 రాష్ట్రాలలో బీజేపీ స్వతంత్ర పాలన కొనసాగిస్తోంది. అంటే సగానికి సగం రాష్ట్రాలు కాషాయానివే. కానీ చిత్రమేమిటంటే, దక్షిణ భారతం ఇప్పటికీ బీజేపీకి కొరకరాని కొయ్య గావుంది. ఏ దక్షిణ రాష్ట్రంలోనూ, బీజేపీ సొంతగా జెండా పాతలేక పోయింది. సరికదా- రెండు రాష్ట్రాలలో(కేరళ, తమిళ నాడుల్లో) ఆర్.ఎస్.ఎస్ కు విరుధ్ధభావ జాలం వున్న కమ్యూనిస్టు, ద్రావిడ పార్టీలు అధికారంలో వున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం మాటున మనగలుగుతోంది. ఇక్కడ ఆర్.ఎస్. ఎస్ పాచికలు పారటం లేదా? ’కాషాయ‘ వ్యూహ కర్తలే ఆలోచించుకోవాలి.
సతీష్ చందర్
21 ఫిబ్రవరి 2025