‘ఉత్తరం‘ పెరగాలి, దక్షిణం‘ తగ్గాలి?!
ఇది ‘కాషాయ’ వాస్తు
ఉత్తరం కలసి వచ్చింది. దక్షిణం కలసి రావటం లేదు. ఇది వాస్తు కాదు. వాస్తవం. దేశంలో కాషాయం పార్టీ ముందు వున్న వాస్తవం. ఉత్తరభారతాన విజయాల పరంపరరనందుకుంటున్న బీజేపీకి దక్షిణాన ఎప్పుడూ చుక్క ఎదురువుతూనే వుంది. కేరళలో కమ్యూనిస్టులు (ఎల్డీఎఫ్), తమిళనాట ద్రావిడ పార్టీలు (ఇప్పుడు డీఎంకే), తెలంగాణ, కర్ణాటకలలో కాంగ్రెస్. ఒక్క ఆంధ్రప్రదేశ్లో పేరుకు ఎన్డీయే. కానీ అధికారం తెలుగుదేశందే. బీజేపీ అన్నది జనసేన తర్వాత వున్న రెండవ భాగ స్వామ్యపక్షం.
అతి కష్టం మీద ఒకప్పుడు బీజేపీ చేతికి వచ్చింది కానీ, నిలవలేదు. మిగిలిన రాష్ట్రాలలో అయితే ఆ ముచ్చటే లేదు. బీజేపీ అధికారంలోకి రావటానికి తీవ్రంగానే ప్రయత్నించింది. కానీ రాలేదు. ఒక దశలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్( జీహెచ్ఎంసీ) ఎన్నికలలో గెలచినంత పనిచేసింది కానీ, గెలవలేక పోయింది. కానీ అప్పటి అధికార పక్షం అయిన బీఆర్ఎస్ పీక మీద కత్తి పెట్టినంత పనిచేసింది.
కోత ‘సౌత్’ కే
కానీ ఇప్పుడు చూడబోతే, దక్షిణాదిని దారికి తెచ్చుకోవటానికి బీజేపీ చేతికి ఒక ఆయుధం దొరికనట్లయ్యింది. అదే నియోజకవర్గ పునర్విభజన. పార్లమెంటు నియోజక వర్గాల సంఖ్యను, పెరిగిన జనాభా నిష్ఫత్తిలో వుంచటానికి ప్రయత్నిస్తే, దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఈ ముక్క అందరికీ తెలిసిందే అయినా, ముందుగా గొంతెత్తింది తమిళనాడు రాష్ట్రం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ మేరకు చెన్పైలోనే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పార్టీ (డీఎంకే) తో విభేదించే పక్షాలను సైతం ఈ సమావేశానికి ఆహ్వానించారు. వారు హాజరయ్యారు కూడా. లోక్ సభలోని ప్రస్తుత బలంలో తమ రాష్ట్రానికి దక్కుతున్న 7.18 శాతాన్ని తగ్గించకూడదని ఈ సమావేశంలో తీర్మానించారు. అంటే లోక్ సభలో ఇప్పుడున్న 543 స్థానాల్లో తమిళనాడుకు దక్కుతున్న 39 సీట్లనూ కాపాడాలి. ఒకే వేళ మొత్తం లోక్ సభ స్థానాలను పెంచుకున్నా, ఇప్పడున్న నిష్ఫత్తిలోనే పెంచాలి. ఒక వేళ ఇప్పటి దేశజనాభాకి సరిపడా ప్రాతినిథ్యం వహించేటట్లుగా లోక్ సభ మొత్తం స్థానాలను 848 కు పెంచితే, అందులో తమ వాటాని( 7.18 శాతాన్ని) కాపాడాలి. అంటే తమిళనాడు 59 స్థానాలను ఇవ్వాలి. ఇదీ స్టాలిన్ డిమాండ్. ఇది తమ రాష్ట్రం కోసం పెట్టిన షరతు. ఇదే సమావేశంలో మొత్తం దక్షిణాది రాష్ట్రాల తరపున కూడా ఒక తీర్మానం చేశారు. లోక్ సభ, రాజ్యసభ సీట్లను ఎన్ని పెంచుకున్నా, 1971 నాటి జనాభా ప్రాతిపదికనే రాష్ట్రాల నిష్ఫత్తి వుంచాలి.
పైపైన చూస్తే మాత్రం ఈ వాదన వింతగానే వుంటుంది. ఇప్పటి జనాభా ప్రకారం సీట్లు పెంచి, అప్పటి (1971) జనాభా నిష్పత్తిని ఉంచటమేమిటి? వింతగా లేదూ?మన దేశంలో జనగణన ప్రతి పదేళ్ళకీ, (దశాబ్ది తొలిసంవత్సరంలో) జరగటం బ్రిటిష్ కాలం నుంచీ ఆనవాయితీ. ఆ లెక్కన మనకి తాజా జనగణన 2021 న జరగాలి. కానీ జరగలేదు. అందుకు కోవిడ్ ను నెపంగా చూపింది కేంద్రం. కోవిడ్ వెళ్ళిపోయే మూడు ఏళ్ళయ్యింది. అయినా జరగలేదు. ఈ ఏడాది కూడా జరుగుతందన్న హామీ కూడా కనపడటంలేదు. అందుకు రాజకీయ కారణాలు వున్నాయని విపక్షాల అనుమానం. అందులో ఒక కారణం ఈ నియోజకవర్గ పునర్విభజన.

ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే ఇప్పుడు 80 వున్న సీట్లు 143 అవుతాయి. అంటే అదనంగా 63 సీట్లు పెరిగాయి. మరి తమిళనాడుకు? పెరిగితే ఓ 10 సీట్లు పెరుగుతాయి. కేరళకయితే పెరగనే పెరగవు. కానీ బీజేపీ మాత్రం ఇప్పటి జనాభా నిష్ఫత్తిలోనే నియోజకవర్గ పునర్విభజనకు వెళ్ళాలనే కృత నిశ్చయంతో వుంది. దాంతో వరుసగా నాల్గవ సారి కూడా కేంద్రంలో అధికారంలోకి రావటానికి రాచబాట వేసుకోవాలనుకుంటుంది.
అధికసంతానానికి అదనపు సీట్లు
పెరిగిన జనాభాకు అనుగుణంగా నియోజకవర్గ విభజన వుండాలని ఎప్పటినుంచో వత్తిడి వున్నా, 1971 తర్వాత ఈ పని చెయ్యలేదు. అంతే కాదు, ఇలా చెయ్యకుండా వుండటానికి వెంటనే వీలులేకుండా 2002లో 84వ రాజ్యాంగ సవరణ చేశారు కూడా. ఈ పునర్విభజనను 2026 వరకూ వాయిదా వేశారు. అలా వాయిదా వేస్తూ, ఆ సవరణలో ఒక ఆంక్ష కూడా విధించారు. ఒక వేళ 2026 తర్వాత నియోజకవర్గ పునర్విభజన చేసినా, తర్వాత వెంటనే వచ్చే జనగణన ఆధారంగా జరగాలన్నది రాజ్యాంగ సవరణలోని షరతు. అంటే ప్రతీ దశాబ్దీ క్రమం తప్పకుండా జరిగితే, 2031వ జనగణన ఆధారంగా చెయ్యాలి. కానీ దేశంలో 2021 లోజరగాల్సిన జనగణన ఇంకా (2025నాటికి) జరగలేదు. దీనిని ఇంకాస్త వాయిదా వేస్తే 2026 గడువు దాటేస్తుంది. అప్పడు వెంటనే ఈ జనగణన ఆధారంగానే నియోజకవర్గ పునర్విభజన చేసుకోవచ్చు. ఆ పెరిగిన లోక్ సభ సీట్లతోనే 2029 ఎన్నికలకు వెళ్ళవచ్చు. ఈ పెరిగన జనాభా ప్రకారమే చూసి, ఆ నిష్పత్తినే ప్రాతిపదికగా తీసుకుంటే, ఉత్తరాది రాష్ట్రాలలో సీట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. రెండు తెలుగు రాష్ట్రాలు సహా ద క్షిణాది రాష్ట్రాలకు ఆమేరకు కోత పడిపోతుంది. అంటే కేంద్రంలో ఏ సర్కారు వుండాలన్నదానని పూర్తిగా ఉత్తరభారతమే నిర్ణయిస్తుంది. కారణం జనాభా ఉత్తరాది రాష్ట్రాలలో పెరిగినంత వేగంగా, దక్షిణాది రాష్ట్రాలలో పెరగలేదు. అందుకు కారణం దేశం మొత్తం మీద జనాభా తగ్గించుకోవటానికి ’కుటుంబ నియంత్రణ’ను కేంద్రంలోని ప్రభుత్వాలు ముందుకు తెచ్చినప్పుడు, వాటిని దక్షిణాది రాష్ట్రాలు శ్రధ్ధగా పాటించాయి. తమిళనాడు, కేరళలయితే మరీను. ఇందుకో అక్షరాస్యతలో మెరుగయిన శాతం వుండటం కూడా ఒక కారణమే. కానీ, దేశక్షేమాన్ని కాపాడినందుకు, ఇప్పుడు అదే జనాభా ప్రాతిపదికను ముందుకు తెచ్చి, నియోజకవర్గ పునర్విభజన చేస్తామంటే ఎలా?
ఆయా రాష్ట్రాలు వాటికవి కట్టుకున్న లెక్కల ప్రకారం అప్పటి నుంచి ఇప్పటికి (1971- 2024) తమిళ నాడులో జనాభా 171% పెరిగితే, బీహార్ లో233% పెరిగింది. అంటే బీహార్ లో ఎంపీ సీట్లు ఎన్ని పెరుగుతాయో ఊహించుకోవచ్చు. ఒక్కసారిగా లోక్ సభ సీట్లను 848 కాకుండా 668కి పెంచవచ్చు అన్న లెక్క ఒకటి వుంది. అలా చూస్తే, ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే ఇప్పుడు 80 వున్న సీట్లు 143 అవుతాయి. అంటే అదనంగా 63 సీట్లు పెరిగాయి. మరి తమిళనాడుకు? పెరిగితే ఓ 10 సీట్లు పెరుగుతాయి. కేరళకయితే పెరగనే పెరగవు.
కానీ బీజేపీ మాత్రం ఇప్పటి జనాభా నిష్ఫత్తిలోనే నియోజకవర్గ పునర్విభజనకు వెళ్ళాలనే కృత నిశ్చయంతో వుంది. దాంతో వరుసగా నాల్గవ సారి కూడా కేంద్రంలో అధికారంలోకి రావటానికి రాచబాట వేసుకోవాలనుకుంటుంది.
సతీష్ చందర్
7 మార్చి 2025