ఆద్యంతం ‘అమృత’ పై విషం చిమ్మిన మీడియా!
ప్రేమే. ప్రేమించుకుంటే పెళ్ళివరకూ వెళ్ళాలి.మధ్యలో ఎన్నికష్టాలయినా పడవచ్చు. అంతిమంగా ప్రేయసీ ప్రియులవ్వాలి. ఇలాంటి ప్రేమ కథనే చదవటానికీ, వినటానికీ, సినిమాలో చూడటానికీ ఇష్టపడతాం. ఎవరు ఎవర్నయినా ప్రేమించుకోవచ్చు. కవి అన్నట్లు ’ఒకానొకడు ఒకానొకామె’ ను ప్రేమించవచ్చు. పెళ్ళయితే చేసుకోవాలి. ఇది ప్రేక్షకుడు, సినిమా దర్శకుడికి విధించే షరతు. లేక పోతే సినిమాను ’ఫ్లాపు’ చేసి పడేస్తానంటాడు. కానీ అదే ప్రేక్షకుడు సినిమా అయ్యాక వాళ్ళ వూరు వస్తాడు. పోనీ వాళ్ళ కాలనీకి వస్తాడు. అక్కడా ఇలాంటివి జరుగుతాయి. ఎక్కువ సార్లు మెచ్చుకుంటాడు. కొన్ని సార్లే నొచ్చుకుంటాడు. ఈ ‘ఒకానొకామె’ తో పేచీ వుండదు. ఎటొచ్చీ ’ఒకానొకడి’ తోనే ఇబ్బంది. ఈ ’ఒకానొకడూ’ ఆమె సొంత కులస్తుడయితే మహదానందం. అలాకాదూ, ఆమె కులం కన్నా ’పైమెట్టు’ న వుండే కులమయినా ఫర్వాలేదు. ఎటొచ్చీ, ఆమె తన కులం కన్నా కింద కులం వైపు చూస్తేనే ఇబ్బంది. ’ఊరువెలుపల’ వుండే కులమయితే తట్టుకోలేడు. ఆ పిల్లకు ఏమీకాని, తానే తట్టుకోలేక పోతే, కన్నతండ్రి ఎలా తట్టుకుంటాడూ?
అదేమిటీ? సినిమా చూసినప్పుడు కథను ప్రియుడి(హీరో) వైపునుంచి చూశాడు కదా? జీవితంలో కథను చూసేటప్పడు అటు ప్రియుడూ, ప్రియురాలి (హీరో, హరోయిన్ల) వైపు నుంచి కాకుండా ప్రియురాలి తండ్రి వైపు నుంచి చూస్తాడేమిటీ? సినిమాలో అయితే ప్రేమకు అడ్డుపడ్డ ప్రతీ ఆడపిల్ల తండ్రీ ’విలన్’ అవుతాడు కదా? పోనీ జీవితం కదా, అమ్మాయి తండ్రి వైపు చూస్తే చూశాడు. ఆ ఇద్దరూ ఒక్కటయి, అంతిమంగా పెళ్ళి చేసుకున్నందుకు సంతోష పడాలి కదా? అబ్బే లేదు. ఆ తండ్రి, కూతురి భర్తను ఆమె కళ్ళముందే నరికి చంపించినప్పుడయినా, ఆ కుర్రాడిమీద, ఆ అమ్మాయి మీదా జాలి పడాలి కదా? పడలేదు సరి. కనీసం అడ్డంగా నరికించిన తండ్రి మీద కోపం కలగాలి కదా? ’హంతక’ తండ్రి మీద జాలి ఎలా పుట్టుకొస్తోంది? చిత్రం కదూ! ఇది సాదాసీదా పౌరుడికో, ప్రేక్షకుడికో అనిపిస్తే వచ్చే ప్రమాదం తక్కువే. కానీ మీడియా ప్రతినిథులకు అనిపిస్తే..?

ఉభయ తెలుగు రాష్ట్రాలలో అంతూ, పొంతూ లేకుండా ’పరువు హత్య’లు జరిగిపోతున్నాయి. ఇవి పదుల సంఖ్యనుంచి వందల సంఖ్యలోకి వెళ్ళిపోయినా, ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుండేది మిర్యాల గుడాలో (14 సెప్టెంబరు 2018)లో జరిగిన ప్రణయ్ పరువు హత్య. వైశ్య కులస్తుడయిన మారుతీ రావు కూతురు అమృత ను, షెడ్యూల్డు కులానికి చెందిన ప్రణయ్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఇలా అనటం బాగుండలేదా? పోనీ, ప్రణయే అమృతను ప్రేమించి, ఇద్దరికీ చట్ట రీత్యా పెళ్ళాడే వయసు వచ్చాకే (31 జనవరి 2019న) పెళ్ళి చేసుకున్నాడు.
నిజానికిలాంటివి కూడా ప్రేమ కథలే. కానీ ఈ కథలకు ’పరువు హత్యల’తో ముగింపు పలుకుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అంతూ, పొంతూ లేకుండా ’పరువు హత్య’లు జరిగిపోతున్నాయి. ఇవి పదుల సంఖ్యనుంచి వందల సంఖ్యలోకి వెళ్ళిపోయినా, ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుండేది మిర్యాల గుడాలో (14 సెప్టెంబరు 2018)లో జరిగిన ప్రణయ్ పరువు హత్య. వైశ్య కులస్తుడయిన మారుతీ రావు కూతురు అమృత ను, షెడ్యూల్డు కులానికి చెందిన ప్రణయ్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఇలా అనటం బాగుండలేదా? పోనీ, ప్రణయే అమృతను ప్రేమించి, ఇద్దరికీ చట్ట రీత్యా పెళ్ళాడే వయసు వచ్చాకే (31 జనవరి 2019న) పెళ్ళి చేసుకున్నాడు. అమృత గర్భవతిగా వుండగా ఆసుపత్రి లో అమృతను చూపించినందుకు ’సుపారీ ఇచ్చి’ మనుషుల్ని పెట్టి అమృత తండ్రే స్వయంగా ప్రణయ్ ను హత్య చేయించాడు. వేట కత్తితో నరికిన కిరాయి హంతకుడిగా బీహార్ కుచెందిన సుభాష్ కుమార్ శర్మ ను గుర్తించారు. అంతిమంగా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు తీర్పు ప్రకటించింది. అయితే ఈ తీర్పు వెలువడే నాటికి (10 మార్చి2025) మొదటి ముద్దాయి మారుతీ రావు లేడు. కిరాయి హంతకుడికి మరణ శిక్ష, ఇతర ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష ను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ ఆరుగురిలో మారుతీరావు తమ్ముడు (అమృత బాబాయి) శ్రావణ్ కూడా వున్నాడు. ఇదీ జరిగింది.
ఈ ’పరువు హత్య’ కు సంబంధించి మూడు సందర్భాల్లో మీడియా ముందుకొచ్చి, ’టాప్ స్టోరీస్’నూ, ’హెడ్ లైన్స్’నూ, ’థంబ్ నెయిల్స్’నూ ఊపిపారేసింది.
సందర్భం ఒకటి: ప్రణయ్ హత్య
’అల్లారు ముద్దుగా, గారాభంగా పెంచుకున్న తండ్రి.’ గా మారుతీరావునీ, ’వలపన్ని పెద్దింటి పిల్లను ఎగరేసుపోయిన వాడిగా ప్రణయ్’ నూ అధిక శాతం మాధ్యమాలు చూపించాయి. ప్రధాన ముద్దాయి ’మారుతీ రావు’ కు కన్నబిడ్డ మీద వున్న ప్రేమను వర్ణించటానికి మాటలు చాలక పోతే సినిమా డైలాగుల్ని ఆశ్రయించారు. ’చంపేటంత ప్రేమ’ అతనిదన్నారు. మరీ ప్రణయ్ కీ తండ్రి వున్నాడు కదా? అతణ్ణి ఆ తండ్రి ఎలా పెంచి వుంటాడో? మీడియాకు అనుమానం కూడా రాలేదు. మారుతీరావు అంత గొప్పగా అయితే పెంచివుండరన్న నిర్ధారణకు వచ్చేశారు. ఎలా?
సందర్భం రెండు: మారుతీ రావు ఆత్మహత్య
చనిపోయాడు. ప్రధాన ముద్దాయే. వైశ్యా హాస్టల్ కు చెందిన గదిలో ప్రాణం విడిచాడు. నూటికి నూరు పాళ్ళూ ఆత్మహత్యే. అప్పుడు మీడియా మొత్తం ’మైకులతో’, ’లోగోల’ తో అమృత ముందుకొచ్చారు. మారుతీరావుది ఆత్మహత్యే అయినా, కారకురాలు ’అమృతే’ అన్నది మీడియా ’ముందస్తు నిర్థారణ’. అందుకు తగ్గట్టుగానే ’హెడ్ లైన్సూ’ ’తంబ్ నెయిల్సూ’ వచ్చాయి. మారుతీ రావుకు ఇప్పుడు కూతురు మీద వున్నది ’చచ్చేంత ప్రేమ’. అంతే కాదు. ’నీ తల్లి భర్తలేనిదయ్యింది కదా? మరి ఆమెను చూసుకుంటావా?’ అని అడిగితే ’తప్పకుండా. ఆమె రావాలే కానీ, ఇక్కడకు (ప్రణయ్ తాను వుంటున్న ఇంటికి) తెచ్చుకుని చూసుకోనూ?’ ఆ సమాధానం మీడియా ప్రతినిథులకు నచ్చలేదు. ’నువ్వు ఆ (మారుతీరావు) ఇంటికి వెళ్ళాలి కానీ, ఆమె నీ (ప్రణయ్) ఇంటికి ఎందుకు వస్తుందీ?’ అన్నారు కొందరు మీడియా ప్రతినిథులు. ’ఎవరెక్కడుండా అక్కడ వుండాలీ’ అనే పాత కాలపు వర్ణ వ్యవస్థలోంచే మీడియా కూడా చూస్తే, ’ప్రజాస్వామ్యం’ ఏమయి పోవాలి?
సందర్భం మూడు: ప్రణయ్ హత్య పై తీర్పు:
అమృత మీడియాకు నేరుగా లభ్యం కాలేదు. ప్రణయ్ తండ్రి బాలస్వామి మీడియా ప్రశ్నలకు తావివ్వకుండా మాట్లాడారు. తీర్పును స్వాగతిస్తూనే ’ఒక హత్య ఎందరికి విషాదాన్ని మిగల్చిందీ?’ అని అన్నారు. ’కులం పేరుతో మనుషుల్ని చూడటం మానుకోవాలి’ అని కూడా అన్నారు. ఈలోగా మీడియాకు శిక్ష పడ్డ అమృత బాబాయి శ్రావణ్ తనయ విలపిస్తూ కనిపించారు. ఆమె దుఃఖంలో ’అమృత నే తప్పుపడుతుంటే’ ఆ వీడియో మాత్రం వైరల్ అయ్యింది. అమృత సోషల్ మీడియాలో పోస్టు ద్వారా తీర్పును స్వాగతించారు. ప్రణయ్ ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు. కానీ మీడియా ’అమృత’ పేరు పక్కన ’ప్రణయ్’ అనే పేరువుందా? లేదా? అని వెతుకుతోంది.
ఇంకా అమృత లోని లోపాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్న ఒక వర్గం మీడియా ప్రతినిథులకు, కోర్టు తీర్పు పట్టదా? తమ తీర్పులు తమవేనా?
సతీష్ చందర్
14 మార్చి 2025