FeaturedOpinionTwittorials

వీళ్ళకి ఒరిగిందీ లేదు! వాళ్ళకి తరిగిందీ లేదు!

కులం అంటేనే అంతరం; ఎడమ; వేరు. అందుకే ఒక కులానికీ మరొక కులానికీ పడదు. ఈ పడని తనం కులం లోపలి కులాలకు కూడా వర్తిస్తుంది. వాటిని ఉపకులాలంటారు. శాఖలంటారు. కానీ వాటిని కులాలుగా పిలవాలని పట్టుపడతారు. మన అసమ సమాజంలో పైనుంచి కింద వరకూ ఈ ఉపకుల వ్యత్యాసాలు కనిపిస్తునే వుంటాయి. బ్రాహ్మణకులంలో వైదికులకూ, నియోగులకు మధ్య ఈ అంతరం వుండేది. రెంటినీ రెండు శాఖలుగానే ఇప్పటికీ చూస్తుంటారు. ఇటీవలి కాలం వరకూ వివాహాలు ఈ రెండు శాఖల మధ్యా జరగటం కష్టంగా వుండేది. ఇప్పుడు దాదాపు తొలగిపోయిందనుకోండి.

అలాగే సమాజంలో అట్టడుగున – అందునా ఊరు వెలుపల ’అస్పృశ్యులు’ గా- వుండే షెడ్యూల్డుకులాల (ఎస్పీల) మధ్యా ఈ అంతరాలున్నాయి. మరీ ముఖ్యంగా రెండు ప్రధాన ఉపకులాలయిన మాల, మాదిగల మధ్య. (ఈ పేర్లని సంస్కరణోద్యమాల కాలం అవమాన సూచికలు భావించి ప్రత్యామ్నాయాలతో పిలవటానికి ప్రయత్నించారు. కానీ గత మూడు దశాబ్దాలుగా వీటినే ’గౌరవ వాచకాలు’ గా ఆ వర్గాల వారే ధరిస్తున్నారు.) ఈ అంతరాలకు ఆర్థిక కోణం వచ్చింది. అందుకు కారణం రిజర్వేషన్ల పంపిణీ. ఇందులో అసమానతలు వున్నాయని తెలుగునాట మొదలయిన ఆందోళనలకు మూడుదశాబ్దాలయ్యింది. మధ్యలో (1997లో) ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎస్సీలను ఏబీసీడిలు గా విభజించారు. (బీలోకి మాదిగలూ, సీలోకి మాలలూ వెళ్లారు)  ఈ లోగా (2014లో) ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయింది. తెలంగాణ ఏర్పడింది. అంతే కాదు సుప్రీం కోర్టు నుంచి రెండు తీర్పులు వచ్చాయి. మొదటి తీర్పు ఈ విభజన (వర్గీకరణ)కు వ్యతిరేకంగానూ, తర్వాత అనుకూలంగానూ వచ్చింది. అంతే కాదు, విభజన చేసే అధికారం రాష్ట్రాలకు వుంటుందని రెండవ తీర్పు స్పష్టం చేసింది. ఇదీ జరిగిన కథ.

అసమానతలు వున్నాయని తెలుగునాట మొదలయిన ఆందోళనలకు మూడుదశాబ్దాలయ్యింది. మధ్యలో (1997లో) ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎస్సీలను ఏబీసీడిలు గా విభజించారు. (బీలోకి మాదిగలూ, సీలోకి మాలలూ వెళ్లారు)  ఈ లోగా (2014లో) ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయింది. తెలంగాణ ఏర్పడింది. అంతే కాదు సుప్రీం కోర్టు నుంచి రెండు తీర్పులు వచ్చాయి. మొదటి తీర్పు ఈ విభజన (వర్గీకరణ)కు వ్యతిరేకంగానూ, తర్వాత అనుకూలంగానూ వచ్చింది.

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలూ ఈ విభజనకు పూనుకున్నాయి. అసెంబ్లీలో తీర్మానాలు చేశాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డీ, ఆంధ్రప్రదేశ్ లోచంద్రబాబు నాయుడూ ఒకే తీరులో ఈ విభజన ప్రక్రియను పూర్తి చేశారు. ముందు కమిషన్ వేశారు. తెలంగాణకు షమీర్ అఖ్తర్ నేతృత్వంలోనూ, ఆంధ్రప్రదేశ్ కు రంజన్ మిశ్రా నాయకత్వంలోనూ ఈ ఈ కమిషన్లు ఏర్పడ్డాయి. ముందు షమీర్ అఖ్తర్ కమిషన్ సిఫారసులు వచ్చాయి. దాని అధారంగా  ఎస్సీ రిజర్వేషన్ బిల్లును తయారు చేశారు. ఇందుకు తెలంగాణ చేసిన జనాభాలెక్కల్ని పరిగణనలోకి తీసుకున్నారు. దాని ప్రకారం తెలంగాణలో మొత్తం ఎస్సీలు 52. 17 లక్షలు.  రిజర్వేషన్ల కోసం వీరిని మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-1 (రెల్లి సంబంధిత ఉప కులస్తుల)కు 1 శాతం, గ్రూపు-2( మాదిగ సంబంధిత ఉప కులస్తులకు)9 శాతం, గ్రూపు-3( మాల సంబంధిత కులస్తులకు) 5 శాతం ఇవ్వచూపారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే 2011 జనాభా  లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకుంది. ఆ లెక్కల ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీల జనాభా(75, 12,068). మిశ్రా కమిషన్ సిఫారసుల మేరకు గ్రూపు-1(రెల్లి,అనుబంధ ఉపకులాల)కు 1 శాతం, గ్రూపు-2(మాదిగ, అనుబంధ కులాల)కు 6.5 శాతం, గ్రూపు-3(మాల, అనుబంధకులాల)కు 7.5 శాతం కేటాయించారు. ఇదీ లెక్క.

ముందునుంచీ వర్గీకరణ కావాలన్నది మాదిగలు. వద్దూ అన్నది మాలలు. ఇందులో ఎంత స్పష్టత వుందంటే, 2014కు ముందు రాష్ట్రం కలసివుండాలన్నది ఆంధ్రులూ, విడిపోవాలన్నదీ తెలంగాణ వాసులూ అన్నంత స్పష్టంగా వుంది.( మినహాయింపులూ వుంటాయి.) ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఏర్పాటయినప్పటి నుంచీ, ఎస్సీలకున్న కోటా (15శాతం)లో అధికంగా మాలలే లబ్ధి పొందారన్నది మాదిగ ఆందోళన కారుల ఫిర్యాదు. ఫిర్యాదులో నిజముంది. కానీ కారణాం వేరు. అది ప్రాంతం. అభివృధ్ధిలోనూ, ఇంగ్లీషు విద్య పొందటంలోనూ ఆంధ్రకు తెలంగాణకు, ఆంధ్రకు రెండువందల యేళ్ల వ్యత్యాసం వుంది. ఆంధ్రలో మాలలు ఎక్కువ, తలంగాణలో మాదిగలు ఎక్కువ. ఈ తేడాను ’ఉపకులం’ లో చూడాలని కొందరు ఉవ్విళ్ళూరారు. కాలం పరిష్కారం ఇచ్చేసింది. ఆంధ్ర, తెలంగాణలు వేరు పడ్డాయి. ప్రయివేటీకరణ తో  అడుగంటగా, అడుగంటగా మిగిలి వున్న ప్రభుత్వోగాలు ఎలాగూ ఆంధ్రలో మాలలు అధికంగానూ, తెలంగాణలో మాలలు అధికంగానూ జనాబా ప్రాతిపదికను ఉపయోగించేసుకుంటారు. విభజన కీచులాటకు రాష్ట్రవిభజనే అలా శుభం కార్డు వేసేసింది. అయినా సుప్రీం కోర్టు కొత్త తీర్పు ఇచ్చింది కనుక వర్గీకరణ ’తంతు’ను పూర్తి చేశాయి తెలుగు రాష్ట్రాలు. అనుకున్నట్లుగానే ఆంధ్రలో మాదిగలకంటె,  మాలలకు (ఒక శాతం) ఎక్కువా , తెలంగాణలో మాలల కంటె మాదిగలకు (4 శాతం) ఎక్కువా వచ్చింది.  కారణం జనాభా విభజనే. ఈ శాతాల్ని కూడా భూతద్దాల్లో చూసి ఇరు పక్షాలలో స్వయంప్రకటిత నేతలు కొందరు గుండెలు బాదుకుంటే బాదుకోవచ్చు. కానీ జనాభా నిష్పత్తులను చూస్తే అందుకు కూడా ఆస్కారం వుండదు. 2011 జనాభా లెక్కల ప్రకారం మాలలూ మాదిగల జనాభా నిష్ఫత్తి ఆంధ్రలో 8:7 అయితే, తెలంగాణలో 1: 2 వుంటుంది. పనిగట్టుకుని ఈ వర్గీకరణ చెయ్యకున్నా, ఈ రెండు ఉపకులాలకు ఇంచుమించు అరకొర ఉద్యోగాలు ఈ మేరకే దక్కేవి.

వర్గీకరణ వల్ల ఒరిగి పోతుందనుకున్న మాదిగలకు ఏమి ఒరిగినట్లూ? తరిగి పోతుందనుకున్న మాలలకు ఏమి తరిగనట్లూ? ఎస్సీలు జనసంఖ్యలో చూసినప్పుడు తెలంగాణలో తక్కువ (39 శాతం),  ఆంధ్రలో (61శాతం) వుంటారు.  తెలంగాణలో 4 శాతం అదనంగా పొందినా, అదనంగా పొందినట్లు కాదు. ఆంధ్రలో మాలలు 1 శాతం అదనంగా పొందినా తక్కువ పొందినట్లు కాదు.  అదీకాక, తెలంగాణలో షమీర్ అఖ్తర్ కమిషన్ తన నివేదికలో ఒక భరోసా ఇచ్చింది. ఉద్యోగాల భర్తీలో ఎస్సీ కోటా గ్రూపు 1 కు కేటాయించన ఖాళీకి అభ్యర్థికి ఆ గ్రూపునుంచి దొరక్క పోతే, గ్రూపు2 నుంచీ, అక్కడా దొరక్కుంటే గ్రూపు-3 నుంచీ తీసుకునే ’ప్రాధాన్యతా ప్రాతిపదిక’ ను నిర్దేశించింది. ఇది పంజాబ్ లో అమలు జరిగింది. అయినా ’అన్యాయం’ అని అరిచే  వారు రెండు ఉపకులాల్లోనూ వుంటారు. వారే ’రాజకీయ నిరుద్యోగులు’.

 ఈ వర్గీకరణ వివాదం వల్ల ఒరిగేదీ, తరిగేదీ ఏదయినా వుంటే అది రాజకీయ పార్టీలకే. ఆంధ్రప్రదేశ్ 1999 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో వర్గీకరణ చేసినందుకు తెలుగుదేశం పార్టీకి మాదిగల వోట్లు దక్కాయి. మాలలు కాంగ్రెస్ వైపు నిలిచారు. ఇప్పుడు ఈ వర్గీకరణ వల్ల కూడా మళ్ళీ అదే ఉపకులం నుంచి తెలుగుదేశం, జనసేనలు మద్దతును ఆశిస్తే ఆశించవచ్చు. ఈ బిల్లు చేపడుతున్నప్పుడు ఆ పార్టీల అధినేతలు (వర్గీకరణ ఉద్యమ నేతల పట్ల) చేసిన సానుభూతి వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయి. అంతే కాదు, ఆ ఉపకులానికి ఎంతో మేలు చేసేశామన్న ‘తృప్తి’ ని కూడా పొందినట్లు ప్రకటనలు చేస్తున్నారు. మాటలు ’కోటాలు’ దాటటం అంటే ఇదే!

7 మార్చి 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *