ఆంధ్రాలో ‘కొట్టిన’ వీడియో- తెలంగాణలో ‘తిట్టిన’ ఆడియో
కవల రాష్ట్రాలకు దిష్టిచుక్కలు
కవల పిల్లల్లాగా, కవల రాష్ట్రాలు. చాలా కాలం అవిభాజ్య కవలల్లాగే (Conjoined Twins) అంటుకు పోయివున్నాయి. ఒక వేళకు తిండి. ఒకే వేళకు నిద్ర. ఈ రాష్ట్రానికి వచ్చిన కడుపు నొప్పే ఆ రాష్ట్రానికీ వస్తుంది. ఇక్కడ సీఎం ఏం చేస్తారో, అక్కడ సీఎం అదే చేస్తారు. ముఖ్యమంత్రులు మాత్రమే కాదు. విపక్ష నేతలూ అంతే. ’టాట్ నేను అసెంబ్లీకి వెళ్ళను’ అంటారు ఆంధ్రప్రదేశ్ లో జగన్. ’నేనూ పొవ్వ’ నంటారు కేసీఆర్. అక్కడ జగన్ మెడకు ’లిక్కర్’ కేసులు చుట్టుకుంటే, ఇక్కడ కేసీఆర్ పీకకు ’కాళేశ్వరం’ చుట్టుకుంటుంది.
ఇక ముఖ్యమంత్రులిద్దరూ ఒకటే తీరు. ఇప్పుడంటే పార్టీలు వేరు. కానీ ఆంధ్రా ’బాబు’, తెలంగాణ ’రేవంత్’ ఇద్దరూ ఒకే బడిలో చదివారు. అదే ’ఎన్టీఆర్ ట్రస్టు’. ఇద్దరూ తమ తమ రాజధానులకు బ్రాండ్ అంబాసిడర్ల మంటారు. ’అమరావతి’లోకి బాబు ’తెలివి’ని తెస్తే, హైదరాబాద్ లోకి రేవంత్ ’అందాన్ని’ తెచ్చారు. ’తెలివి’ అంటే ఉత్త తెలివి కాదు. మేధ. కృత్రిమ మేధ. AI (Artificial Intelligence). అమరావతిని ఏఐ రాజధానిగా చెయ్యాలని బాబు సంకల్పం. మరి రేవంత్ దో? హైదరాబాద్ ను అంద మైన నగరం చెయ్యాలని. అందుకే కదా? అడ్డొచ్చినవి ’కంచ’లయినా, కట్టడాలయినా కూల్చి పారేస్తున్నారు. అందమంటే మామూలు అందం కాదు. ప్రపంచం గుర్తించే అందం. కాదు. కాదు. ప్రపంచంలోవున్న అందాన్నంతటినీ హైదారాబాద్ కు రప్పించారు. తెలివీ అందమూ కలిస్తేనే నెత్తిన కిరీటం పెడతారు. థాయ్ లాండ్ అమ్మాయి సుచాత చువాంగ్ శ్రీ అలాగే ప్రపంచ సుందరి (Miss World) అయ్యింది లెండి. ఇంకా గట్టిగా మాట్లాడితే, తెలివే , అందం; అందమే తెలివి. బాబే రేవంత్ . రేవంతే బాబు.

’అమరావతి’లోకి బాబు ’తెలివి’ని తెస్తే, హైదరాబాద్ లోకి రేవంత్ ’అందాన్ని’ తెచ్చారు. ’తెలివి’ అంటే ఉత్త తెలివి కాదు. మేధ. కృత్రిమ మేధ. AI (Artificial Intelligence). అమరావతిని ఏఐ రాజధానిగా చెయ్యాలని బాబు సంకల్పం.
ఇలా అయిపోయాక దిష్టి తగలదూ? అందుకే అక్కడా ఇక్కడా అధికారులు రెండు చుక్కల్ని పెట్టారు. చూడటానికి చుక్కల్లానే వుంటాయి. వెంటనే తుడుచుకోక పోతే మచ్చలయి కూర్చుంటాయి. ఈ దిష్టి చుక్కను ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు పెడితే, తెలంగాణలో ఒక ఐయ్యేఎస్ అధికారి పెట్టారు. పోలీసులు కొట్టారు. అధికారి తిట్టారు. ఆంధ్ర లో గాయపడిందీ, తెలంగాణలో అవమానపడిందీ అణగారిన వర్గాలే. ఈ రెండు వార్తలూ దావాలనంలా వ్యాపించాయి. ఇందులో ప్రధాన స్రవంతి మీడియా ఏ పాపమూ ఎరుగదు. కానీ సామాజిక మాధ్యమాలు ‘పాపాన్నే’ కాదు, ‘ఫుణ్యాన్ని’ కూడా దాచుకోలేవు. పేరుకు సోషల్ మీడియా కానీ, తీరుకు మాత్రం ’కంఠ శోష’ల్ మీడియా. చూపిందే చూపుతాయి. చెప్పిందే చెపుతాయి. ’దెబ్బల్ని’ చూపాయి. ’తిట్ల’ను వినిపించాయి.
అవును. ’ఆంధ్ర పారిస్’లో ఖాకీల బహిరంగ ’లాఠి‘న్యాన్ని చూపించాయి. (ఆంధ్రలో పారిస్ ఏమిటని అనుమానపడకండి. ఇదేమీ ’బికాంలో ఫిజిక్స్’ అంతటి పెద్ద తప్పు కాదు. తెనాలి ని ఆంధ్రపారిస్ అనేవారు. నాగరికతలో అంత ముందుండేది.) అక్కడే. పాతికేళ్ళు దాటని ముగ్గురు యువకుల్ని (దోమర రాకేష్, చేబ్రోలు జాన్ విక్టర్, షేక్ కరీముల్లా) నడి రోడ్డు మీద కూర్చోబెట్టి, కాళ్ళు ఆరచాపించి, కదప కుండా నొక్కి పట్టి ఒకరి తర్వాత ఒకరికి ఆరికాళ్ళ మీద లాఠీ దెబ్బలు తినిపించారు. అందులో రాకేష్ అనే కుర్రాడికి గతంలో కాలు విరిగితే లోపల స్టీలు రాడ్డు వేశారు. ఈ విషయం అతని తల్లిదండ్రులే తర్వాత చెప్పారు. వాళ్ళని ఉతకాలన్న పోలీసుల ‘ఉక్కు’ సంకల్పం ముందు, ‘స్టీలు’ రాడ్డు ఎంత? చిత్రం ఏమిటంటే, ఈ ’చిత్రాన్ని’ ఎవరో ఔత్సాహికులు రహస్యంగా రికార్డు చెయ్యలేదు. కానిస్టేబుళ్ళు పనికానిస్తుంటే, సర్కిల్ ఇన్స్పెక్టర్ వీడియో రికార్డు చేశారని కూడా బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపణ. ఇంతకీ ఇంత ’ఉక్రోషం’ ఎందుకొచ్చినట్టూ? వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చెందిన (మఫ్టీలో వున్న) ఓ కానిస్టేబుల్ ని, ఈ ముగ్గురూ మరో స్నేహితుడుతో కలసి అంతకు ముందు (ఏప్రిల్ 24న) దాడి చేశారనీ, అప్పుడు వాళ్ళు ’గంజాయి’ మత్తులో వున్నారనీ సదరు కానిస్టేబుల్ వివరణ. ఆమేరకు వారు ఫిర్యాదు నమోదు చేసుకుని. వాళ్ళకు ’పాఠం’ చెప్పాలని, ఇలా రోడ్డు మీద ’ఒపెన్ స్కూలు’ తెరిచినట్లు సమర్థించుకుంటున్నారు. వారు గంజాయి మేసి వుండవచ్చు. లేదా అసలు గంజాయి సాగు చేసే వుండవచ్చు. నిరూపణయ్యాక శిక్ష విధించాల్సింది ఎవరూ? పోలీసులా? న్యాయస్థానాలా? దాడికి గురయిన వారిలో ఇద్దరు దళితులు వున్నారు. కేసును ఇంకెలా చూడాలి? అయితే ఉన్నత పదవిలో వున్న ఓ పెద్దాయన- జాన్ విక్టర్ – అనే పేరు వుంటే అతడు దళితుడెలా అవుతారు? అంటే క్రైస్తవుల మతగ్రంథంలో పేర్లు వెతికి పెట్టేసుకుని వుంటారు కాబట్టి దళితులెలా అవుతారు? (హిందువులు కారు కదా, అని పెద్దాయన భావన కావచ్చు) ఓ హిందూ కుటుంబంలోనే పిల్లలు బతకటం లేదని, బతికిన పిల్లాడికి ’ఫకీర్రాజో’, ’ఫకీరప్పో’అనే పేరు పెట్టుకుంటే, ఆ బిడ్డ హిందువు కాకుండా పోతాడా? జాన్ మిల్టన్, విక్టర్ హ్యుగో వంటి ప్రపంచ సాహితీవేత్తల పేర్లు, ఏ మతస్తులయినా అభిమానంతో పెట్టుకోవచ్చు కదా? ఈ చర్చ ఇప్పుడు అవసరమంటారా? కేసు సంగతి చూడాలి కాని.

హైదరాబాద్ ను అంద మైన నగరం చెయ్యాలని. అందుకే కదా? అడ్డొచ్చినవి ’కంచ’లయినా, కట్టడాలయినా కూల్చి పారేస్తున్నారు. అందమంటే మామూలు అందం కాదు. ప్రపంచం గుర్తించే అందం. కాదు. కాదు. ప్రపంచంలోవున్న అందాన్నంతటినీ హైదారాబాద్ కు రప్పించారు. తెలివీ అందమూ కలిస్తేనే నెత్తిన కిరీటం పెడతారు. థాయ్ లాండ్ అమ్మాయి సుచాత చువాంగ్ శ్రీ అలాగే ప్రపంచ సుందరి (Miss World) అయ్యింది లెండి.
ఇక తెలంగాణ లోని ’ఆడియో’ చోద్యం. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఎస్) సెక్రటరీ అలగు వర్షిణి స్వరంగా ఒక ఆడియో క్లిప్ వైరల్ అయ్యింది. అందులో విద్యార్థులు ’తమ టాయిలెట్లన శుభ్రపరచుకోవటమూ, తమ వంట తాము చేసుకోవటమూ తప్పు’లేదనట్లు చెప్పారు. మరి ’క్లీనింగ్ స్టాఫ్ కు వేలకు వేలు జీతాలు ఇవ్వటం దేనికీ? వంట చెయ్యటానికి సిబ్బందిని పెట్టుకోవటం దేనికీ? అంటే ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు చదువుకుందామని ఆశపడి, తమ ప్రతిభను ప్రదర్శించి, రెసిడెన్షియల్ పాఠశాల్లో ప్రవేశం పొందింది ఇందుకేనా? ఈ వార్త ఎప్పుడయితే గుప్పు మందో, వెంటనే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్( ఎన్ సి ఎస్ సి) సంజాయిషీ కోరుతూ ఐయ్యేఎస్ అధికారిణి అయిన వర్షిణి నోటీసు ఇచ్చారు. అయితే ఆమె మీడియాకు వివరణ ఇచ్చారు. తాను బీసీ వర్గాలనుంచి వచ్చిన వ్యక్తిననీ, తనను తమ విద్యార్థులందరూ ’అమ్మ’ అని పిలుచుకుంటారనీ చెప్పారు. పైపెచ్చు ఇందుకు గాంధీనీ, అంబేద్కర్నీ ఉదహరించారు. వ్యక్తిగత శుభ్రతనీ, శ్రమ పట్ల గౌరవాన్నీ బోధించారన్నారు. తనకు నీళ్ళు అందించాల్సిన తన సిబ్బంది నీళ్ళు ఇవ్వకపోతే, ’ఎందుకు ఇవ్వరూ?’ అని అంబేద్కర్ ప్రశ్నించిన విషయాన్ని వర్షణి విస్మరించినట్లున్నారు.
ఈ వార్త ఎప్పుడయితే గుప్పు మందో, వెంటనే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్( ఎన్ సి ఎస్ సి) సంజాయిషీ కోరుతూ ఐయ్యేఎస్ అధికారిణి అయిన వర్షిణి నోటీసు ఇచ్చారు. అయితే ఆమె మీడియాకు వివరణ ఇచ్చారు. తాను బీసీ వర్గాలనుంచి వచ్చిన వ్యక్తిననీ, తనను తమ విద్యార్థులందరూ ’అమ్మ’ అని పిలుచుకుంటారనీ చెప్పారు. పైపెచ్చు ఇందుకు గాంధీనీ, అంబేద్కర్నీ ఉదహరించారు. వ్యక్తిగత శుభ్రతనీ, శ్రమ పట్ల గౌరవాన్నీ బోధించారన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కు అడ్డాగా అమరావతిని చేసే హడావిడిలో పడి, తెనాలి ’లాఠి’న్యాన్నీ, అందాల పోటీలకు అడ్డాగా హైదరాబాద్ ను చూపించానన్న సంబరంలో పడి, వర్షిణి వ్యాఖ్యల్నీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు విస్మరించినట్లున్నారు. జనసేన, బీజేపీ మైత్రిలో వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, షెడ్యూల్డు కులాల వోట్లతో పెద్ద పని లేక పోవచ్చు కానీ, ఈ వర్గాల వోట్ల మీదే అధికంగా ఆధారపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రికి కొంచెమయినా ఇబ్బందిగా వుండాలి కదా? లేక వీరు కూడా ’అందాల పోటీల’ మధ్య ఈ ఘటనను ఒక ’దిష్టి చుక్క’గా తీసేసుకున్నారా? లేక మంత్రివర్గంలో ఈ వర్గాలనుంచి మరో ఇద్దరికి చోటిస్తే చాలనుకుంటున్నారా?
సతీష్ చందర్
9 జూన్ 2025