‘అణువం’త వైరం- ‘ఆకాశమం’త యుధ్ధం
ఇరాన్ ను మింగెయ్యాలన్న ఆకలి ఇజ్రాయిల్ దా? అమెరికాదా?
ఇరాన్ తుళ్ళి పడింది. ఆ దేశ రాజధాని నగరం టెహ్రాన్ వణకి పోయింది. శుక్రవారం (13జూన్ 2025) తెల్లవారు ఝామున 90 లక్షల టెహ్రాన్ నగర వాసులు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచారు. భూమి కంపించిందనుకున్నారు. కానీ ప్రమాదం నేల నుంచి కాదు, నింగి నుంచి వచ్చింది. రెండువందలకు పైగా ఇజ్రాయిల్ దేశపు ఫైటర్ జెట్ విమానాలు, ఇరాన్ గగన తలంలోకి ఒక్కసారిగా చొరబడ్డాయి. బాంబుల దాడులు చేశాయి. లక్ష్యాలు పౌరులు కాదు. ఆయుధసంపద! అణ్వాయుధ సంపద! అణు సౌకర్యాలూ, మౌలిక సదుపాయాలు, ఇరాన్ సైనికాధికారులు. ఈ దాడి పేరు ‘ఆపరేషన్ రైజింగ్ లైన్’. నిజంగానే ‘కొదమ సింహంలాగా’ ఇజ్రాయిల్, ఇరాన్ మీద విరుచుకు పడింది. ఇరాన్ నుంచి అప్పటికప్పుడు వచ్చిన ఎలాంటి కవ్వింపు లేకుండానే ఇజ్రాయిల్ దాడి చేసింది. ఈ దాడిలో అరడజను అతి ముఖ్యమైన అణు శాస్త్రవేత్తలు మరణించారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్ సిసి) ప్రధాన కార్యాలయం పొగలో చిక్కుకు పోయింది. జనావాసాలు నేలమట్టమయ్యాయి. కుటుంబాలు, కుటుంబాలు వీధుల్లోకి పరుగులు తీసాయి.
ఆ‘బాంబు’ లేకుండానే బెదరింపా?
ఆ ‘బాంబు’ లేకుండానే అంతహడావిడా?అయితే ఇంత చేసి కూడా, ఇజ్రయిల్ అనుకున్నది సాధించలేకపోయింది. ఇరాన్ అణుశక్తి మొత్తాన్ని ధ్వంసం చెయ్యాలన్నది ఇజ్రాయిల్ సంకల్పం. కానీ, నటాంజ్ అనే ఒక్క అణుస్థావరాన్ని తప్ప, మిగిలిన అణుసదుపాయాలను కూల్చలేక పోయింది. నిజానికి ఇరాన్ కు వున్న అతి కీలకమైన అణుస్థావరం టెహ్రాన్ కు చేరువలోనే వున్న ‘ఫోర్డో’ కేంద్రం. ఇది మాత్రం భద్రంగా నే వుంది. దీని నిర్మాణం 2006లో జరిగినా, 2009 నుంచి పని చెయ్యటం మొదలు పెట్టింది. భూమికి 80 మీటర్ల లోతులో వున్నా, ఉపరితలం మీద క్షిపణుల రక్షణలో వుంటుంది. నిజానికి దీనిని ధ్వంసం చెయ్యదగ్గ ఆయుధసామాగ్రి ఇజ్రాయిల్ వద్ద లేదు. దీనిని ధ్వంసం చెయ్యాలంటే ‘బంకర్- బస్టర్’ బాంబుతో( జిబియూ 57 ఎ/బి మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబుతో) నే సాధ్యం. ఈ బాంబు 61 అడుగుల లోతుకు చొచ్చుకు వెళ్ళి, అప్పుడు పేలుతుంది. ఇలాంటి బాంబులను, ఒకటి తర్వాత ఒకటి జెట్స్ నుంచి జారవిడచగలిగితే, అప్పుడు మాత్రమే ’పోర్డో’ అణుస్థావరాన్ని ధ్వంసం చెయ్యగలరు. కానీ ఇది అమెరికా వద్ద మాత్రమే వుంది. నిఘాకీ, గూఢచర్యానికి ఇజ్రాయిల్ పెట్టింది పేరు. తాను ధ్వంసం చెయ్యలేనని తెలిసి కూడా ఇరాన్ మీద ఈ ’దుందుడుకు’ చర్యకు ఎందుకు పాల్పడ్డట్లూ?

ధ్వంసం చెయ్యాలంటే ‘బంకర్- బస్టర్’ బాంబుతో( జిబియూ 57 ఎ/బి మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబుతో) నే సాధ్యం. ఈ బాంబు 61 అడుగుల లోతుకు చొచ్చుకు వెళ్ళి, అప్పుడు పేలుతుంది. ఇలాంటి బాంబులను, ఒకటి తర్వాత ఒకటి జెట్స్ నుంచి జారవిడచగలిగితే, అప్పుడు మాత్రమే ’పోర్డో’ అణుస్థావరాన్ని ధ్వంసం చెయ్యగలరు. కానీ ఇది అమెరికా వద్ద మాత్రమే వుంది.
అమెరికా ముఖానికి ఇజ్రాయిల్ ముసుగు
అది కూడా వారం రోజుల్లో అణుఒప్పందం గురించి అమెరికాతో చర్చించటానికి ఇరాన్ ఒప్పుకున్నాక చెయ్యటం కేవలం అత్యుత్సాహం మాత్రమే కాదు. చర్చకు బదులు బెదరించే పరిస్థితికి అమెరికాను నెట్టటం. ఎందుకంటే, ఎప్పుడయితే ఇరాన్ మీద ఇజ్రాయిల్ దాడి చేసిందో, ఇరాన్ నుంచి ప్రతిదాడి అనివార్యమవుతుంది. అదే జరిగింది. అనుకున్నట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుంకరించాడు. ‘ఇజ్రాయిల్ చేసింది గొప్పపని. ఇరాన్ నేతలకు కు మేము ఓ అవకాశం ఇచ్చాం. (అణుప్రయోగాలు మానుకొమ్మని) హెచ్చరించాం. వారు వినలేదు. అందుకే గట్టి దెబ్బ తిన్నారు. ముందు ముందు మరింత గట్టి దెబ్బలు తింటారు. ఇలాంటివి ముందు ముందు ఇంకా ఎదుర్కుంటారు.’ అంటే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యహు అనాల్సిన మాటలన్నీ ట్రంప్ అనేశారు. అంటే, ఇరాన్ మీద ఇజ్రాయిల్ చేసిన దాడులకు అమెరికా మద్దతు ఇచ్చింది, అన్నది చిన్నమాట. ‘నేను చెయ్యాల్సిన పని నువ్వు చేశావ్’ అన్నంతగా ఇజ్రాయిల్ చూసి అమెరికా గర్వపడిందీ అనటం సబబుగా వుంటుంది. ట్రంప్ అక్కడితో ఆగ లేదు. ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా ఖమేనీ ఎక్కడ దాక్కున్నదీ తమకు తెలుసనీ, అయితే ఆయన ప్రాణం ఇప్పుడు తీయమని కూడా ట్రంప్ అనటంలో ఆంతర్యమేమిటి? మిగిలిన యుధ్ధాన్ని ఇజ్రాయిల్ కాకుండా, అమెరికాయే పూర్తి చేస్తుందా? ఖమేనీ కూడా తక్కువేమీ తినలేదు. ‘ఇజ్రాయిల్ నేరం చేసింది. దేవుడి అనుగ్రహం మాకు వుంది. మా సేనలు వారిని శిక్షించ కుండా వుండవు.’ అని సందేశాన్ని పంపాడు 86 యేళ్ళ వృధ్ధ నేత ఖమేనీ. ఇరాన్ ఆయన ‘మత రాజ్యం’ (థియోక్రటిక్ స్టేట్) గానే నడుపుతున్నాడు. పేరుకు ప్రధాని వున్నా, అంతా తానే చూస్తుంటారు. కానీ ఇటీవల ఇరాన్ లోపల కూడా పలు సవాళ్ళు ఎదురయ్యాయి. సంస్కరణలు చెయ్యాలన్న డిమాండ్లు పెరిగాయి.
అనుకున్నట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుంకరించాడు: ‘ఇజ్రాయిల్ చేసింది గొప్పపని. ఇరాన్ నేతలకు కు మేము ఓ అవకాశం ఇచ్చాం. (అణుప్రయోగాలు మానుకొమ్మని) హెచ్చరించాం. వారు వినలేదు. అందుకే గట్టి దెబ్బ తిన్నారు. ముందు ముందు మరింత గట్టి దెబ్బలు తింటారు. ఇలాంటివి ముందు ముందు ఇంకా ఎదుర్కుంటారు.’

నెతన్యహు ‘గగన’ కుతూహలం
ఇరాన్ ను అణ్వస్త్ర సన్యాసం చెయ్యాలని అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు ఎప్పటి నుంచో వున్నా, గత ఆరేళ్ళుగా ఇజ్రాయిల్ దూకుడు పెంచింది. 2019లోనే ఇరాన్ అణుశాస్త్ర వేత్తను కాల్చిచంపింది. ఇది రెండు దేశాల మధ్య కొత్త వైరానికి దారి తీసింది. రెండేళ్ళ పాటు సముద్ర జలాల్లో పరస్పరం దాడులు జరుపుకుంటూ వచ్చారు. అతర్వాత ఇరాన్ సైనికాధికారినీ, వైమానిక అధికారినీ ఇజ్రాయిల్ ను హత మార్చింది. అంతే కాదు హమాల అగ్రనేత ను ఇజ్రాయిల్ హత్య చేసింది. ఇక 2023లో ఇరాన్ వంతు వచ్చింది. హమాలను ఇజ్రాయిల్ మీదకు ఉసిగొల్పింది. ఇక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి ఎన్నికయ్యేసరికి, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యహుకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేద్దామన్న ప్రతిపాదనను కూడా నెతన్యహు ఈ ఏడాది (2025) ఏప్రిల్ నెలలోనే ట్రంప్ ముందు వుంచారు. కానీ ట్రంప్ అందుకు భిన్నంగా ’యురేనియం వృధ్ధి చెయ్యటాన్ని’ ఆపితే చర్చిస్తామన్న షరతు పెట్టారు. ఒప్పుకోక పోతే ఇజ్రాయిల్ విరుచుకు పడుతుందని హెచ్చరించారు. అంతిమంగా అదే జరిగింది. అంటే ఇజ్రాయిలే అమెరికా, అమెరికాయే ఇజ్రాయిల్ అన్నమాట. అయితే మాత్రం. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని కొల్లగొట్టే హక్కు అమెరికా, ఇజ్రాయిల్ కు ఎవరిచ్చారు? ఇది ప్రపంచ దేశాలు అడగాల్సిన ప్రశ్న. అడుగుతున్నారు కూడా.
సతీష్ చందర్
21 జూన్ 2025