‘కోటా’కు దూరం! ‘కొరడా’కు దగ్గర!!
క్రైస్తవంలోకి మారిన ‘అస్పృశ్యుల’కు ‘అట్రాసిటీ’ రక్షణ వర్తించదా?
‘సుప్రీం’ తీర్పు పై సమగ్ర విశ్లేషణ
‘మతం మారితే కులం పోతుందా?’ ప్రశ్న ఇలా కాదు వెయ్యాల్సింది. ‘మతం మారితే కుల హీనత’ పోతుందా?’ ఇదీ అసలు ప్రశ్న. షెడ్యూల్డు కులం(ఎస్సీ) అన్నది ‘కుల హోదా’ కాదు. ‘కులహీనత హోదా’. ఈ ‘హోదా’ ఫలానా మతంలోకి మారితే, పోతుందన్న హామీ వుంటే, దేశంలో వున్న ‘అస్పృశ్యులు’ (ఎస్సీలు) కట్టకట్టుకుని మారి పోయి వుండేవారు. పాపం, అలాగే అనుకుని, దేశంలో పలుచోట్ల కొద్ది మంది ఎస్సీలు మతం మారారు. హిందూ మతంలోనుంచి ఇస్లాం మతంలోకి, క్రైస్తవ మతంలోకి వెళ్ళారు. ఇస్లాంలోకి వెళ్ళిన వారి సంగతి ఏమోకానీ, క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వారు పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డారు. ‘అస్పృశ్యుల్ని’(ఆడవాళ్ళనయితే బొట్టులేక పోవటాన్ని బట్టీ, మగవాళ్ళనయితే పేర్లతోనూ) పోల్చుకుని వేధించటానికి ఈ మతమార్పిడి వీలుకల్పించింది. అంటే వారి ‘హీనత్వ’ స్థాయి మరింత దిగజారింది. కాబట్టే దాడులు తీవ్రమయ్యాయి.
కారంచేడు మృతులు క్రైస్తవులే

ఈ తీర్పులో పలు ఆశ్చర్యాలు వున్నాయి. మొదటి ఆశ్చర్యం: దళిత క్రైస్తవుల దాడి ప్రేరణగా వచ్చిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం అదే దళిత క్రైస్తవులకు వర్తించక పోవటం.
దళితుల (అస్పృశ్యుల) మీద దాడులు అనగానే గుర్తుకొచ్చేది కారంచేడు దురగాతం. ఆరుగురు దళితులను అక్కడి అగ్రవర్ణ భూస్వాములు దారుణంగా(17 జులై 1985న) నరికి చంపారు. ఆత్మరక్షణ కోసం నిలువరించిన మహిళను నెల తిరగకుండా హత్య చేశారు. మృతుల్లో అధిక భాగం క్రైస్తవులు పెట్టుకునే పేర్లే. (దుడ్డు వందనం, దుడ్డు అబ్రహాం, తేళ్ళ యెహొషువా, తేళ్ళ మోషే, మున్నంగి సువార్త.) ప్రత్యేకించి కారంచేడు దాడి తర్వాతనే, ఈ తరహా దాడుల్ని అరికట్టటంకోసమే దేశంలో (11 సెప్టెంబరు, 1989న) ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక, చట్టం,1989 వచ్చింది.
ఆ చట్టం వచ్చిందే వారి కోసం
ఈ తీర్పులో పలు ఆశ్చర్యాలు వున్నాయి. మొదటి ఆశ్చర్యం: దళిత క్రైస్తవుల దాడి ప్రేరణగా వచ్చిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం అదే దళిత క్రైస్తవులకు వర్తించక పోవటం.
ఈ తీర్పుకు ఇవ్వటానికి ‘షెడ్యూల్డు కులాల’ నిర్వచనం కీలకమయ్యింది. ఇందుకు ధర్మాసనం ‘కాన్సిట్యూషన్ (షెడ్యూల్డు కులాలు) ఆర్డర్ 1950 లోని మూడవ క్లాజును ఆశ్రయించింది: ‘హిందూమతం కాకుండా ఇతర విశ్వాసాన్ని ఆచరించే వ్యక్తి షెడ్యూల్డు కులాల కు చెందిన సభ్యుడి గా పరిగణించబడడు’. అయితే 1956లోనే ఈ ఆర్డర్ సవరణకు గురయ్యింది. ‘హిందూమతం పక్కన సిక్కుమతం’ చేరింది. అక్కడితో సవరణ ఆగిపోలేదు. మళ్ళీ 1990లో ‘హిందూ, సిక్కు మతాలతో పాటు బౌధ్ధాన్ని కూడా’ కలిపారు.
ఇప్పుడు ఇదే చట్టం అదే క్రైస్తవ విశ్వాసం లోకి వెళ్ళాడనే కారణం మీద అదే ‘అస్పృశ్య’ నేపథ్యం కలిగిన చింతాడ ఆనంద్ కు వర్తించందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆనంద్ సర్వోన్నత న్యాయస్థానం వరకూ వెళ్ళటానికి గల కారణం కూడా ‘దాడే’. తాను మతం తీసుకుని పాస్టర్ అయ్యాక తనను ఇతర వర్ణాల వారికి చెందిన వారు తనని పలుసార్లు ‘కులదూషణ చెయ్యటమే కాక, దాడులు పాల్పడ్డారన్నది’ ఆనంద్ చేసిన అభియోగం. ఈ వ్యాజ్యం ఆంద్ర ప్రదేశ్ హైకోర్టు వరకూ వెళ్ళితే, గత ఏడాది ఏప్రిల్ నెలలో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, 1989 పరిధిలోకి ఈ కేసు రాదని తేల్చిచెప్పింది. అందుకు కారణం అతడు క్రైస్తవమతంలోకి వెళ్ళటమేనని కూడా స్పష్టం చేసింది. అదే తీర్పును 24 మార్చి 2026 జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్ మోహన్ ల సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం బలపరిచింది.
ఇప్పటి తీర్పును లిఖించిన జస్టిస్ మిశ్రా 1950 నాటి కాన్సిట్యూషన్ ఆర్డర్ ‘విపులమైనది, సంపూర్ణ మైనది’ (Categorical and absolute) అని పేర్కొన్నారు.
కొట్లాట దగ్గర ‘కోటా’ నిర్వచనమా?
రెండవ ఆశ్చర్యం: రిజర్వేషన్ కు పరిగణించే శాసన (1950)పరిధిలోనే రక్షణ కల్పించే చట్టాన్ని (1989) వ్యాఖ్యానించటం.
విద్య, ఉపాధి కోసమయితే, క్రైస్తవ మతం తీసుకున్న ‘అస్పృశ్యుల’కు షెడ్యూల్డు కులాల రిజర్వేషన్ కాకుండా ఓబీసీల రిజర్వేషన్ ను (బీసీ- సి)ని వర్తింప చేస్తున్నారు. అలాకాకుండా తమని షెడ్యూల్డు కులాలగానే పరిగణించాలని ఈ దళిత క్రైస్తవులు ఎప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఈ మేరకు తీర్మానాలు చేసి పంపారు కూడా. ఈ డిమాండ్ లో న్యాయబధ్ధత వుంది. అందుకు కారణాలు:
ఒకటి: దళితులు క్రైస్తవమతం తీసుకున్నాక కూడా, ఊరు వెలుపలి వాడలోనే వుంటున్నారు. వారి నివాసాలేవీ ఊరు మధ్యలోకి రాలేదు. అంటే అస్పృశ్యత అలాగే వున్నట్లా? పోయినట్లా?
రెండు: క్రైస్తవ మతం తీసుకున్నాక కూడా వారు ఆ వృత్తుల్నే( మృతకళేబరాలను శుభ్రం చెయ్యటం, కాటికి కాపలా కాయటం, వీధుల్ని శుభ్రం చెయ్యటం వగైరా) ఇంకా చేస్తున్నారు.
మూడు: క్రైస్తవ మతం తీసుకున్నాక కూడా వ్యవసాయభూమిలో వారి వాటా పెరగలేదు. పరిశ్రమల్లోనూ, వ్యాపారాల్లోనూ వారు పెద్దగా రాణించలేదు. ఐటీ రంగం వచ్చాక, అందులోని ఉద్యోగాల్లో కూడా వారికి దక్కింది తక్కువ.
నాలుగు: దళితుల పై జరిగే దాడులు, అత్యాచారాలు క్రైస్తవ మతం తీసుకోవటం వల్ల పెరిగాయే తప్ప తగ్గలేదు.
అయిదు: దళిత క్రైస్తవులకూ, అదే మతం తీసుకున్న ఇతర వర్ణాల వారికీ మధ్య ‘కులాంతర వివాహాలు’ ఏమీ పెరగలేదు.
క్రైస్తవమతం తీసుకున్నాక కూడా వారి సాంఘిక వెనుకబాటుతనంలో ఇసుమంత మార్పూ లేనప్పుడు దళితులకు ఇచ్చేరక్షణ (ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని) ను, దళిత క్రైస్తవులకు మాత్రమే ఉపసంహరించటం అన్యాయం కాదా? ఇదే కాదు అసలు విద్య, ఉపాధి, చట్ట సభల ప్రాతినిథ్యంలో కూడా ఈ మతమార్పిడి కారణంగా వారికి ఎస్సీ హోదా స్థాయిని వర్తింప చెయ్యకుండా వుండటం కూడా అన్యాయమే.
‘మత స్వేఛ్ఛ’ ఊరు వెలుపలకు రాదా?
అంతే కాదు, మీకు ఈ రక్షణలో వుండాలంటే ఈ మతాల్లో వుండి తీరాలనుకోవటం, రాజ్యాంగం పౌరుడికి కలిగించే -ఇష్టమైన మతాన్ని ఎంచుకునే- మతస్వేఛ్చను కాలరాయటమే కదా?
ఈ దృష్టితోనే హిందూ మతంతో పాటు వరుసగా సిక్కు, బౌధ్ధాలను చేర్చారు. అప్పుడు క్రైస్తవం సహా ఇతర మతాలను చేర్చటంలో ఇబ్బంది ఏముంది? కొందరు ఏమతాన్ని విశ్వసించకుండా హేతువాదులుగా వుండవచ్చు. ఇంకొందరు సర్వమత సమానత్వ పాటిస్తూ, అన్ని మతాలను ఆచరిస్తూ, అందరి దైవాలను కొలవవచ్చు. (గాంధీ అనలేదా- తనలో రాముడున్నాడు, క్రీస్తు వున్నాడు, అల్లా వున్నాడు- అని). ఈ స్వేఛ్చ కేవలం అసృశ్యులకే వర్తించకుండా చేస్తారా?
అయితే ఈ దిశగా ప్రయత్నాలు జరగక పోలేదు.
సర్కారులు మారితే నివేదికలు చెల్లవా?
కేంద్రప్రభుత్వమే సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రా నేతృత్వంలో గతంలో (29 అక్టోబరు 2004న) నేషనల్ కమిషన్ ఫర్ రెలిజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్(ఎన్.సి. ఆర్. ఎల్. ఎం)న ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 2007 లో ఇచ్చిన నివేదికలో పలు సిఫారసులతో పాటు క్రైస్తవమతంలోకి, ఇస్లాం మతంలోకి వెళ్ళిన దళితులకు (‘అస్పృశ్యుల’కు) ను షెడ్యూల్డు కులాల జాబితాలోనే వుంచాలని చెప్పింది. అందుకు కమిషన్ సూచించిన కారణం కూడా స్పష్టంగానే వుంది: అదే సాంఘిక వివక్ష మతంమారినా కొనసాగుతూనే వుంది. అప్పటికి కేంద్రంలో కాంగ్రెస్ (యూపీయే) సర్కారు అధికారంలో వుంది.
కానీ 2022లో బీజేపీ (ఎన్డీయే) కేంద్రంలో అధికారంలో వుండగా ఈ నివేదికను పూర్తిగా పట్టాలని అత్యున్నత న్యాయాస్థానాన్ని కోరింది. అప్పటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘ఈ నివేదిక నాలుగు గోడల మధ్యన వుండి రాసింది. ఇందుకు ఎలాంటి క్షేత్ర అధ్యయనమూ చెయ్యలేదు.’ అని కేంద్ర ప్రభుత్వ వాదనను అప్పటి త్రిసభ్య ధర్మాసనం ముందుం వుంచారు.
అంతేకాక తాము మరో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె. జి. బాలకృష్ణన్ కమిషన్ నేతృత్వంలో కొత్త కమిషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిషన్ రూపకల్పన అక్టోబరు 2022 లో జరిగింది. ఈ కమిషన్ దళిత క్రైస్తవుల, దళిత ముస్లింల స్థితిగతులూ, వాటి వెనుక వున్న చారిత్రక, సాంఘిక కారణాలను అంచనా వెయ్యాల్సి వుందని కేంద్రం ప్రకటించింది. అయితే అనేక కారణాల వల్ల కమిషన్ తుది నివేదిక సమర్పించలేదు. ఆ నివేదిక వెలువడాల్సి వుండగానే, సుప్రీం కోర్టు లో ఇద్దరు సభ్యుల ధర్మాసనం 24 మార్చి2026 న తీర్పు వెలువరించేసింది.
ఇది ఈ తీర్పులోని మూడవ ఆశ్చర్యం.
ఈ తీర్పువల్ల విద్యా,ఉపాధిలో ఎస్సీల కోటా దక్కదు. సరికదా ఎస్సీల మీద జరిగేదాడులను ఎలాంటి (చట్టపరమైన ‘రక్షణా’ లేకుండా ఎదుర్కోవాలసి వుంటుంది.
–సతీష్ చందర్
27 మార్చి 2026
