Assembly Polls 2026Featured

గ్యాసా? క్యాషా?

రెండు ‘జె’లు. ఒకటి: జెన్ జెడ్, ఇంకొకటి: జెండర్. ఈ రెండూ ఎవరికి ‘జై’ కొడితే, వారే రాజు. ఇదీ తమిళ నాట వోట్ల స్థితి. జెన్ జెడ్ అంటే కుర్రకారే. ఇప్పటి సమస్యలకు ఇప్పటికిప్పుడు -పరిష్కారాలు కాదు- ఉపశమనాలు కావాలి. ఇక జెండర్ అక్కడ తారు మారు. మగ వోటర్ల కన్నా, మహిళా వోటర్లే ఒక శాతం ఎక్కువ. (మొత్తం 51శాతం).

‘ఆర్యా!’ అని పిలిస్తే ఒకప్పుడు ఏ వోటరూ పలికే వారు కారు. అక్కడ ‘ద్రావిడా!’ అన్ననేతకు తలవూపేవారు. ఇప్పటికీ డీఎంకే, ఎఐడీఎంకేలు ఆ ‘వూపు’లోనే వున్నాయి. మధ్యలో సీమన్ ఎన్టీకే తోనూ, విజయ్ టీవీకే తోనూ వచ్చారు. సీమన్ ‘ద్రావిడా!’ అని పొరపాటున కూడా అనరు. అసలు ద్రావిడ ఉద్యమానికి ఊపిరి పోసిన పెరియార్ రామస్వామి అంటేనే ఆయనకు వొళ్ళు మంట. అందుకే ‘తమిళా!’ అంటాడు. అయినా గత(2024) పార్లమెంటు ఎన్నికలలో పోలయిన వోట్లలో ఆరు శాతం వరకూ మూటగట్టుకోగలిగారు. కారణం ఎవరనుకున్నారు? జెన్ జెడ్డీయులే. వీరు కొత్త తరం కదా? వీరికి ఊహ తెలిసేసరికి, కరుణానిధి ఎంజీఆర్ లు చర్చల్లో లేరు. పోనీ సిలబస్ లో వుంటారా- వారు చదివినవి ఐటీ చదువుాలాయె. ఇప్పుడు విజయ్ కు కూడా వారే అండ. అయినా ‘ద్రావిడ’ వాదాన్ని వదల్లేదు. కానీ పెరియార్ లోని సంస్కరణ ను తీసుకుంటాను కానీ, హేతువాదాన్ని తీసుకోనంటున్నారు.

ఇక జెండర్. స్త్రీలను ఆకర్షించటానికి ఏం ఇవ్వాలి? ‘క్యాషా?’, ‘గ్యాసా?’. ట్రంపు చలువ వల్ల, ప్రతీ ఇల్లాలూ గ్యాసే కోరుకుంటోంది. దాంతో ఏఐడిఎంకె ‘ఉచిత ఎల్ పిజి సిలిండర్’ ను ఇంటింటికీ దొర్లిస్తానని హామీ ఇచ్చేసింది. డిఎంకె ఇంకో అడుగు ముందుకేసింది. సిలిండర్ సరే, మరి గ్యాస్ స్టౌ ఎవరిస్తారు? ఒక్క స్టౌ ఏం ఖర్మ? వంటింట్లో ఏమేంకావాలో అవి కొనుక్కోవచ్చు. మిక్సీలు, గ్రైండర్లు, ఫ్రిజ్జులూ, వాషింగ్ మెషిన్లూను. సొంత డబ్బుతో కాదు. డిఎంకే మళ్ళీ వస్తే ఇచ్చే కూపన్లతో. అంతే కాదు. డైరెక్టు క్యాష్ కూడా. ఒక్కొక్క స్త్రీకి నెల నెలా రెండేసి వేలు నగదు బదిలీ.

ఇదీ ఎన్నికల ప్రచారమే. కానీ ఇంటింటి ప్రచారం కాదు. వంటింటి ప్రచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *