తెలుగు ’అనాథమీ’కు పట్టని మహిళా ప్రముఖులు!
ఢిల్లీ తెలుగు ఆకాడమీ ప్రారంభించి 29 సంవత్సరాలు గడిచిన సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ప్రతిభా పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సామాజిక సేవా, విద్యా, వైద్యా ,ఆర్థిక రంగాలతో పాటు సినీ రంగాలలోని ప్రతిభావంతులని గుర్తించి వారిని అవార్డులతో సత్కరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. తెలుగు ఆకాడమీ ఏ ప్రతిపాదికన వీరిని ఎంపికచేస్తుందనే దే అందరిలో కలుగుతున్న ప్రశ్న.
ఆకాడమీని స్థాపించి 29వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన జాబితాలో వున్న ప్రముఖులు సామాజిక సేవలో గురు ప్రసాద్, విద్యా రంగంలో రావురి వెంకట స్వామి, వైద్య రంగంలో దశరథ రామ రెడ్డి, ఆర్థిక రంగంలో మహేష్ వై.రెడ్డి లతో పాటు సినీ రంగంలో మురళీ మోహన్, తనికెళ్ళ భరణి, ఆలీ, రవిబాబు, సాయి కుమార్‌లతో పాటు హాస్య నటుడు బ్రహ్మానందానికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆందజేశారు. వీరిలో ఒక్క సినీ రంగాన్ని మినహాయించి మిగిలిన రంగాలలో వున్న ప్రముఖులు ఇంతవరకు వారెవరో కూడా లోకానికి తెలియదు.
పేరుకు ఢిల్లీలోని తెలుగు అకాడమీ. కానీ రెండు తెలుగు రాష్ర్టాలలో ప్రముఖులెవరో వీరికి తెలియనే తెలియదా..? లేక కులం, పరపతి, జెండర్ వంటి ఇతరేతర ప్రాధాన్యాలను మాత్రమే గణిస్తున్నారా..? అబ్బే ఏం లేదు.. పురస్కార గ్రహీతల్లో ఒక్క మహిళా లేక పోతేనూ…!? శ్రీ శ్రీ అందుకే అన్నాడేమో… అకాడమీలు కావు.. ‘అనాథమీలూ’, ‘అగాధమీలూ’.. అని.