ప్రపంచ మహాసభల్లో తెలుగు ప్రపంచం కనిపిస్తుందా..?
తెలుగు మహాసభలు ఎప్పుడు జరిగినా ఒక తంతులాగా వుండేవి. కొన్ని ప్రాంతాలకే పరిమితమైనట్లుగా వుండేవి. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో జరుగుతున్న తెలుగు మహాసభలు తీరు కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఇంత వరకూ మరుగున పడిన తెలుగు ప్రముఖులను వెలుగులోకి తెస్తున్నారు. దాదా సాహేబ్ ఫాల్కే పురస్కారం పొందిన అరుదైన బాలీవుడ్ నటుడు జయరాజ్ తెలంగాణ కు చెందినవాడన్న విషయాన్ని ఎలుగెత్తి చాటబోతున్నారు. అలాగే జోగిని వ్యవస్థపై ఉక్కుపిడికిలి ఎత్తిన భాగ్యరెడ్డివర్మను కూడా తలచుకుంటున్నారు. తెలుగు రాష్ర్టాలలో వున్న ప్రముఖులనే కాకుండా, చైన్నై, ఢిల్లీ తదితర రాష్ర్టాలలో వున్న తెలుగు ప్రముఖుల భాగస్వామ్యాన్ని అర్థిస్తూ సన్నాహ సభలు నిర్వహిస్తున్నారు. డిశంబరు 15 నుంచి 19 వరకూ హైదరాబాద్ లో జరిగే ఈ మహాసభల నిర్వహణ ప్రభావం ప్రపంచంలో ని తెలుగు వారి అందరి మీదా పడాలంటే.. ఉమ్మడి రాష్ట్రం వున్నప్పుడును పక్షపాత వైఖరిని విడనాడాలి. అప్పడు జరిగిన తప్పు ఇప్పడు జరగకూడదంటే హుందాగా వ్యవహరించాలి. ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా తెలుగు ప్రముఖుల్ని అహ్వానించగలగాలి.