ఫైర్ బ్రాండ్స్ కు నామినేటెడ్ కుర్చీలు..?
జగన్ పదవులు పంపిణీ ఇంకా ఆసక్తి రేపుతూనే వుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైన రిటీలకు 60 శాతం పదవులు కట్టబెట్టి సామాజిక న్యాయం చేశారు. కానీ గత పదేళ్ళ పాటు, జగన్ మీద కానీ, వైసీపీ మీద కానీ ఒక్క మాట అంటే, పది మాటలు అన్న ఫైర్‌బ్రాండ్‌లు ముగ్గురు వున్నారు. ఇంకా చెప్పాలంటే తమ నేత మీద ఈగ వాలితే, రాతిగద కొట్టగల సమర్థులు వీరు. పదవుల వడ్డనప్పుడు, వీరు ముందు వరసలో వుంటారని అందరూ భావించారు. కానీ వీరికి కేబినెట్లో ఎక్కడా చోటు దొరక లేదు.
ఆ ముగ్గురూ ఎవరో కాదు. ఒకరు: నగరి శాసన సభ్యులు ఆర్కే రోజా, మరొకరు: సత్తెనపల్లి శాసన సభ్యులు అంబటి రాంబాబు, ఇంకొకరు పార్టీ అధికార ప్రతినిథి వాసిరెడ్డి పద్మ. అయితే పద్మ అసెంబ్లీకి పోటీ చెయ్యలేదు.
వీరిని ఎక్కువ కాలం వెయిటింగ్ లో పెట్టటం లేదు. ఇప్పటికే రోజాకు అంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలికవసతుల సంస్థ (ఎపీఐఐసి) చైర్‌పర్సన్ గా నామినేట్ చేశారు. అలాగే వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించాలనుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పదవిని నన్నపనేని రాజకుమారి నిర్వహిస్తున్నారు. ఆమె ముందు పదవి నుంచి వైదొలగకుండా, జగన్‌ను కలిసే ప్రయత్నం చేశారు కానీ, జగన్ ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు లేరు. దాంతో ఆమె ఆ పదవినుంచి తప్పుకోవాలని అనుకున్నారు. దాంతో ఈ పదవిని అదే సామాజిక వర్గా నికి చెందిన పద్మకు కేటాయిస్తున్నారు. ఇక అంబటి రాంబాబుకు కూడా, ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తారని ఊహిస్తున్నారు.
అయితే జగన్ మంత్రులకు పదవీ కాలం రెండున్నరేళ్ళే అని ముందే సూచించారు. కాబట్టి రెండవ విడతలో ఈ ఫైర్ బ్రాండ్స్‌కు కేబినెట్లో స్థానం దొరికే అవకాశం కనిపిస్తోంది.