ఓటీటీ పోటీ: ఇక పెద్ద సినిమాలకు తిప్పలేనా.!?
“ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం” అన్నట్టు ప్రపంచంలో ఏ రంగం చూసినా ఏం ఉన్నది గర్వకారణం సమస్తం కరోనామయం. దేశంలోని అన్ని సినీ పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూసేయడంతో, ఓటీటీకి వీక్షకులు పెరిగారు. ఓటీటీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లోనే ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ ట్రెండ్ గా మారింది. బుల్లితెర ప్రేక్షకులు కూడా ఈ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు మనకు ఒటీపీనే తెలుసు కానీ ఇప్పుడు ఓటీటీ అనే పేరు మార్మోగుతుంది. సినీ ఇండస్ట్రీ కష్టాలు అంతా ఇంతా కాదు. సినిమా షూటింగులు అగిపోయాయి. ఎంటర్టైన్మెంట్ కి వెన్నుముక అయిన థియేటర్లు మూత పడటం పరిశ్రమను మరింత కష్టాలలోకి నెట్టివేసింది.
కోవిడ్-19 రోజురోజుకీ విజృంభిస్తుది. ఒకవేళ వైరస్ ప్రభావం తగ్గినప్పటికీ, ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరచిన ప్రేక్షకులు వెళ్లే పరిస్థితులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకుల చూపు థియేటర్ నుంచి ఓటీటీ వైపు మళ్ళింది. కొత్త సినిమాలు విడుదలైన కొన్ని రోజులకే రావడం ఒక కారణమైతే, ఇప్పుడు ఏకంగా కొన్ని సినిమాలు డైరెక్ట్ వెబ్ స్ట్రీమింగ్ లో విడుదల కావడంతో మరింత డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. సినిమా థియేటర్లు తెరిచిన గానీ, ఆకాశాన్నంటుతున్న టికెట్, స్నాక్స్ ధరలు ప్రేక్షకులను ఓటీటీ వైపే మొగ్గు చూపేలా చేస్తాయి. ఒకసారి థియేటర్ కి వెళ్ళే ఖర్చుతో, సంవత్సరం పాటు సబ్ స్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఇంటిళ్ళీపాది విడుదల అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసుకునే అవకాశం ఉండటంతో ఎంటర్టైన్మెంట్ లవర్స్ ఈ వైపు మొగ్గుచూపుతున్నారు.
కొన్ని ఓటీటీ సంస్థలు తెలుగు రాష్ట్రాలను సైతం వదలడం లేదు. ఇప్పుడిప్పుడే తెలుగులో సైతం వెబ్ సీరీస్ హవా కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రతిఒక్కరు వెబ్ ప్లాట్ ఫామ్ లో సినిమాల కంటే, ఎక్కువగా వెబ్ సీరిస్ చూడటానికే ఆసక్తి చూపుతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మిగిలిన అన్ని భాషల్లో ఒరిజినల్ వస్తున్నాయి. ఇక వెబ్ సీరీస్ కి అలవాటు పడ్డవారు మంచి స్టోరీ లైన్ తో పాటు ఇతర టెక్నికల్ తెలుసుకోగలుగుతున్నారు. సినీ ప్రేక్షకులు వెబ్ స్ట్రీమింగ్ ని మించిన సినిమా అయితేనే థియేటర్ లో చూసే అవకాశం ఉంది. లేదంటే సినిమాలు హిట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంటి వద్దే ఉండి అన్ని సౌకర్యాలకు అలవాటు పడ్డ ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి చూస్తారా అనేదే ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే సినిమాలు కానీ, తీయబోయే సినిమాలు కానీ వెబ్ సీరీస్ కి మించి ఉండాలని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఓటీటీలతో ఎవరికి లాభం-ఎవరికి నష్టం?
ప్రతి నాణానికి రెండు ముఖాలు ఉన్నట్టుగానే, సమాజంలో కొన్ని వర్గాలకి లాభామయితే, మరికొన్ని వర్గాలకి నష్టం వుంటుంది. సినీ పరిశ్రమలో చాలా లాభాలు అర్జించవచ్చు. థియేటర్లలో విడుదల కాక మూలనపడ్డ చాలా చిన్న సినిమాలున్నాయి. ప్రస్తుతం చిన్న సినిమాలకు ఈ ఓటీటీలు ప్రధాన వేదికలుగా మారాయి ఇప్పుడు. చిన్న చిత్రాల డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలకు వారి టాలెంట్ ను చూపించుకోవడానికి ఇదోక గొప్ప ప్లాట్ ఫామ్ అని సినీ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
పెద్ద సినిమాలకు ఈ ప్లాట్ ఫాం నష్టమే అని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. భారీ కలెక్షన్లు ఆశించే వారికి ఇది నష్టమేనని చెప్పవచ్చు. కొన్ని కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమాలకు కలెక్షన్లు రాకపోతే, ఆ సినిమాలో నటించిన నటులకు ఇచ్చే రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ఇతరత్రా ఖర్చులు ఇవన్నీ పెద్ద సినిమా నిర్మాతలకు కత్తి మీద సాము లాంటిదే అని చెప్పవచ్చు. భారీ బడ్జెట్ సినిమాలు కలెక్షన్లను ఆశిస్తాయనడంలో సందేహమేమీ లేదు. కాబట్టి ఓటీటీలోనే విడుదల చేయడానికి పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు ఆసక్తి చూపకపోవచ్చు. ఇటీవల కొన్ని సినిమాలు వెబ్ స్ట్రీమింగ్ లో విడుదల చెద్దామనుకుని, తిరిగి వారి ఆలోచనలను దారి మళ్ళించుకున్నారు. ఏదేమైనా వెబ్ స్ట్రీమింగ్ లతో భారీ బడ్జెట్ సినిమాలకు తిప్పలు తప్పేలా లేవు అంటున్నారు సినీ విశ్లేషకులు.
లాక్ డౌన్ తర్వాత జనం థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపుతారా? అంటే అవుననే చెప్పవచ్చు. ఇప్పటికే రోడ్లపై వున్న చిన్న చిన్న తినుభండారాల దగ్గర ప్రజలు గుంపులుగా ఉన్నట్లు మనం చూస్తునే ఉన్నాము. అలాగే, ఎన్ని వెబ్ స్ట్రీమింగ్ లు వచ్చినప్పటికీ, ప్రజలు థియేటర్ వాతావరణానికి మొగ్గు చూపుతారు. స్నేహితులతో, ఫ్యామిలీతో వినోదం కోసం, వారానికొకసారైనా థియేటర్లకు వెళ్లేవారు వుంటారు. వారు ఇంట్లో కన్నా, థియేటర్లో చూస్తేనే వారు అనుభూతి చెందుతారు. ముఖ్యంగా స్టూడెంట్స్ మాత్రం థియేటర్లకు వెళ్లడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు. థియేటర్లకు విద్యార్థులే బలమని చెప్పుకోవచ్చు. లాక్ డౌన్ తర్వాత, థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో లేదో ..? ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలంటే కొన్ని నెలలు వేచి చూడాల్సిందే.
-వెంకటేష్.పి, విద్యార్థి.
ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.