Opinion

కరోనా పెళ్ళిచూపులు

చేతిలో కాఫీ కప్పు తో, ‘ఈనాడు’లో  కరోనా వార్తలతో కాలక్షేపం చేస్తున్న నాకు ఎదురింటి ముందు ‘అమ్మ ఒడి’ వాహనం ఆగడంతో అంతరాయం కలిగి అటు వైపు చూసాను. రెండు రోజుల క్రితమే ఈ భూ ప్రపంచంలోకి ఏదో ఒకటి వెలగబెడదామని వచ్చిన చంటోన్ని పొదివి పట్టుకొని ‘అమ్మ ఒడి’ వాహనం నుండి ‘అమ్మ ఇంట్లో’కి అడుగిడుతున్న గీతక్కను చూడగానే అన్యాపదేశంగా నా చేతులు చరవాణి కోసం వెతికాయి.

పోయిన వారం ఫోన్ చేసినప్పుడు, తన చెల్లెలికి ఈ నెలలోనే డెలివరీ డేట్ ఇచ్చారని మిత్రుడు గోపాల్ చెప్పిన మాట గుర్తొచ్చింది. చేతులు ఖాళీ లేక పక్కన పడేయడంతో నా వైపే ధీనంగా చూస్తున్న మొబైల్ ను తీసుకుని గోపాల్ కి కాల్ కలిపా. కుశల ప్రశ్నలు వేశాక చెల్లి గురించి ఆరా తీస్తే వాడు ఒక దాని తర్వాత ఒకటి చెప్పిన విషయాలు కొన్ని తమాషా గాను, మరికొన్ని బాధ కలిగించేవి గాను ఉన్నాయి.

హైదరాబాద్ లోనే నంబర్ వన్ మెటర్నిటీ హాస్పిటల్ ‘ఫెర్నాండెజ్’లో అసాధారణ పరిస్థితుల్లో సాధారణ ప్రసవం జరిగి మేనల్లుడు పుట్టాడని తల్లీ బిడ్డ అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పాడు. ఇక్కడే నాకో సందేహం వచ్చింది. సాధారణంగా మా ప్రాంతంలో తొలుచూరి కాన్పు తల్లి గారింట చేసి అత్తగారింటికి పంపించటం ఆనవాయితి. అలా అయితే వాళ్ళ ఊరికి దగ్గర్లో ఉన్న సిద్దిపేటలో కాకుండా, హైదరాబాద్ లో డెలివరీ చేయించడం ఏంటి? నా ఈ ప్రశ్నకి వాడు చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాను. కానా మరీ! ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే వాడికి కరోనా సోకడమేంటి? వాడికి కరోనా వచ్చింది కాబట్టే, చెల్లెలి డెలివరీ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యిందన్నమాట. ఎందుకంటే ఆమె మెట్టినిల్లు హైదరాబాద్ లో ఉందాయె.

కొందరు పిల్లలు పుట్టినప్పుడు మేనమామ గండాన పుట్టారని శాంతి హోమాలు జరిపించడం ఊళ్ళల్లో చూస్తూనే ఉంటాము కానీ, మా గోపాల్ వాడి మేనల్లుడి పుట్టుకకే గండంగా మారే ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్నాడు.

వాడు ఈ గండం నుంచైతే తప్పించుకున్నాడు కానీ, వాడి చిన్న తనం నుండే తండ్రి సృష్టించిన ఇమేజ్ చట్రం నుండి తప్పించుకోలేకపోయాడు. అందుకే వాడికి ఎంతో ఇష్టమైన వ్యవసాయాన్ని వదిలిపెట్టి పేరెంట్స్ కోరిక మేరకు ఎమ్.సి.ఎ చేసి, సాఫ్ట్ వేర్ కొలువులో స్థిరపడ్డాడు. జాబ్ లో  జీతం పెరిగినంత వేగంగా వాడి పెళ్ళి విషయంలో తల్లిదండ్రుల కోరికలు కూడా పెరిగినాయి. ఈ ఓవర్ యాక్షన్ వల్లే మొదట్లో వచ్చిన మంచి సంబంధాలన్నింటిని జాతకాలు కలవలేదని, కట్నం సరిపోలేదని, స్వంత కులమైనప్పటికి ఒకే శాఖ కాదనే సిల్లీ రీజన్స్ తో కాలదన్నుకున్నారు.

‘అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది, దురదృష్టం తలుపు తీసే వరకు బాత్తానే ఉంటది’ అనే సామెత నా ఫ్రెండ్ విషయంలో సరిగ్గా సరిపోతుంది. మొదట్లో విరివిగా వచ్చిన పెళ్ళి సంబంధాలు కాస్తా వీళ్ళ విర్రవీగుడికి వీలైనంత మేర తగ్గినై. ఇంతలోనే కరోనా వచ్చి వాన్ని కన్నవారి కాళ్ళను నేలమీదకు దించింది. ఈ కరోనా కాలంలో వాడికి వచ్చిన ఒకే ఒక సంబంధం హైదరాబాద్ కు చెందిన డాక్టరమ్మాయిది. ఈ సంబంధం చూడడానికి వెళ్ళే వాడు కరోనా కొనితెచ్చుకున్నాడు. డాక్టరమ్మగారు పనిచేసేది గాంధీ ఆసుపత్రిలోనాయె మరి. చూడూ! నన్ను పి.పి.ఇ కిట్ లోనే చూడు లేదంటే నీకు నెక్స్ట్ బర్త్ డే ఉండదనే డాక్టర్ గారిని మాస్క్ లేకుండా సాంప్రదాయ లంగా ఓణీ లో చూడాలనుకున్నాడు మా గోపాల కృష్ణుడు. పెళ్ళిచూపుల్లో ఆ అమ్మాయి ఇళ్ళాదిరిపోయేలా తుమ్మడం, మా వాడికి కరోనా సంక్రమించడం చకచకా జరిగిపోయాయి.

కరోనా ప్రభావం తగ్గిపోయాక పెళ్ళిచూపులకి వెళ్ళొచ్చు కదరా..! అంటే “నాకు ఈ సాఫ్ట్ వేర్ జాబు ఉండి నెలకు లక్షన్నర సంపాదిస్తుంటేనే సంబంధాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. కరోనా కారణంగా ఈ జాబు కూడా పోయిందంటే ఇక ఒక్క సంబంధమూ రాదు. ’దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే‘ కార్యక్రమంలో భాగంగా ఈ పెళ్ళి చూపులకు వెళ్ళానురా” అన్నాడు.

సరేలేరా! కరోనా వస్తే వచ్చింది గానీ మాంచి డాక్టర్ సంబంధమైతే పట్టేశావు కదా! మరి పెళ్ళెప్పుడని అడగ్గానే వాడు ఇంకో షాకిచ్చాడు. పాపం వాళ్ళ కంపెనీ నష్ట నివారణ చర్యల్లో భాగంగా మనవాడి పోస్టు ఊస్టింగయింది. ఈ విషయం తెలిసి డాక్టర్ సంబంధం గోవిందో హరి. పైకి బాధపడ్డట్టు నటిస్తున్నా ఈ విషయం మటుకు నాకు సంతోషం కలిగించింది. ఎందుకంటే నా ఆప్తమిత్రుడి వీడికిచ్చి పెళ్ళి చెయ్యాలని చూస్తే కట్నం సరిపోదని ఖరాఖండిగా చెప్పేశారు. అంతమంచి అమ్మాయిని వదులుకున్నందుకు నీకిలా జరగాల్సిందే అనుకున్నాను. ఎంతైనా నేను కూడా సగటు భారతీయున్నే కదా!

పెళ్ళిళ్ళు స్వర్గం లో నిర్ణయించబడతాయంటారు కదా! వాడి కోసం స్వర్గంలో నిర్ణయించబడ్డ అమ్మాయి వాడి మరదలేనేమో అనిపిస్తుంది. అగ్రికల్చరల్ బి.ఎస్.సి చదివి సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ , ఊళ్ళోనే  ఉంటూ, ఐదు సంవత్సరాల నుండి గోపాల్ కోసం ఎదురు చూస్తూనే ఉంది.

-చంద్రశేఖర్.ఎమ్., విద్యార్థి.
ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *