CasteFeatured

వేళకు కేసు కట్టలేదు, కానీ కట్టెలు పేర్చారు!!

ఆఘమేఘాల మీద దళితయువత మృతదేహానికి అంత్యక్రియలు జరిపిస్తున్న పోలీసులు

బతికుండగా కేసు కట్టలేక పోయిన పోలీసులు, చచ్చాక కట్టెలు పేర్చారు. ఏ కేసు? అబ్బే..! ఒక సమాజానికీ, ఒక సర్కారుకీ, ఒక రాజకీయ పక్షానికీ బొత్తిగా పట్టని కేసు.
అత్యాచారం కేేసే! ఒకరు కాదు. ఇద్దరు కాదు. నలుగురు కలసి అత్యాచారం చేసిన కేసే. అయినా ఉలిక్కి పడరు. కేకలు పెట్టరు.
వెన్నెముకను విరగ్గొట్టి, నాలుకను నలగ్గొట్టి, ఒకరి తర్వాత ఒకరు పాశవికానందం పొందిన కేసే. అయినా పరుగులు తీసి, దేశ రాజధాని నగరాన్ని ముట్టడించి, పరమ శాంతియుతంగా పోటెత్తి, ‘నిర్భయ’ లాంటి చట్టం చెయ్యమని ‘చదవేసిన’ ఒక వర్గం యువతరం నినదించదు.
కాకుంటే, అత్యాచారం చేసి, చంపేశాక, రూపు రేఖలు తెలియకుండా నిందితులే దహనం చేసిన కేసు కాదు. చచ్చిందనో, చావక పోతుందా- అనో వదిలేసి ‘దుష్ట చతుష్టయం’ దుమ్ముదులుపుకుని వెళ్ళిపోయిన కేసు. (కాల్చే పని, లేదా దగ్గరుండి కాల్పించే పని పోలీసులకు వదలి వెళ్ళిపోయారు.) కాబట్టి, ఆ ‘నలుగుర్నీ’ ఎనకౌంటర్‌ చేసి చంపండని కానీ, లేదా తమకు వదలండని, ‘సభ్య’ (స్పృశ్య) సమాజం మాత్రం ‘చట్టపరిరక్షకులు’ మెచ్చే పిలుపు నివ్వదు.

కారణం ఒక్కటే. చనిపోయిన అమ్మాయి. దళిత కుటుంబానికి చెందినది. పందొమ్మిదేళ్ళ అమ్మాయి. పశుదాణా కోసం పొలం వెళ్ళితే, ఠాకూర్‌ కులానికి చెందిన నలుగురు మీద పడ్డారు. (నాలుగూ పుణ్యమూర్తులూ, పురాణ పురుషుల పేర్లే: సందీప్‌, రాము, లవకుశ, రవి. ఏం చేస్తాం? ఒక్కొక్క సారి అంతే. ‘బాపూజీ’ ని చంపిన వ్యక్తి పేరులో ‘రాముడు’ న్నాడు, ‘గాడ్‌’ వున్నాడు.). ఆమె కప్పుకున్న ‘చున్నీ’ నే ఆమె పీకకు చుట్టారు. కింద పడేశారు. ఆమె ప్రతిఘటన వీళ్ళకు నచ్చలేదు. అందుకనే పీక బిగించే పోయారు. పెనుగులాటలో వెన్ను విరగిపోయి స్పృహ తప్పింది. ఆమె కేకలు ఎవరికీ వినపడలేదు. కొంచెం దూరంలో వున్న తల్లికి తప్ప. ఈ ఘటన రెండు వారాల క్రితం (14 సెప్టెంబరు 2020 నాడు) ఉత్తరప్రదేశ్‌ లోని హత్రస్‌ జిల్లాలో జరిగింది. చట్టమంటే అపారమైన గౌరవమున్న తల్లి అపస్మారక స్థితిలో వున్న కూతురుని చాంద్‌ పా పోలీసు స్టేషన్‌ కు తీసుకువెళ్ళింది. ఆమె చెప్పినది పోలీసులు నమ్మలేదు. పైపెచ్చు ఎగతాళి చేసినట్లు (బాధిత కుటుంబ సభ్యుల) ఆరోపణ. (ఆ తర్వాత ఎప్పుడో ఎనిమిది రోజులు తర్వాత వాళ్ళకి నమ్మటం తప్పలేదనుకోండి. అప్పుడు బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేశారు. అది వేరే విషయం.)
ముందు ఆలిగడ్‌ లోని జవహర్‌ లాల్‌ నెహ్రా వైద్య కళాశాలలో చేర్పించినా, వెన్నెముక బాగా పాడవటంతో, ఆమెను ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ హాస్పటల్‌ లో చేర్చారు. ఆ తర్వాత (29 సెప్టెంబరు 2020) న చనిపోయింది.

చదవాలనుకున్నదే రాసిచ్చారు!
శవ పరీక్ష నివేదిక రానే వచ్చింది. ‘తీవ్రమైన వత్తిడి వినియోగించటం వల్ల వెన్నెముక కు గాయమవ్వటం వల్ల చనిపోయింది.’ అంతే కానీ, ‘పీక నులమటం వల్ల చనిపోలేదు’. ఇక తుదినివేదిక చూడాలి. ముచ్చెమట్లు పోస్తాయి: ‘ఆమె మర్మావయాల్లో ఎప్పటివో చినిగిన జాడలు వున్నాయి కానీ, రేప్‌ మాత్రం జరగలేదు.’


షేక్‌ చేస్తే ‘ఫేక్‌ న్యూసే’!
ఈ వార్త ముందు ప్రధాన స్రవంతి మాధ్యమాల్లో రాలేదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. దాంతో ఉత్తర ప్రదేశ్‌ పౌర సమాచార అధికారులు అతిసులభంగా ‘తప్పుడు వార్త’ (ఫేక్‌ న్యూస్‌) అని తేల్చేశారు. మనిషి చనిపోయాక, మడికట్టుకున్న పత్రికలకు సైతం వార్త అవుతుంది కదా! అప్పుడు ఉన్నత పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. బాధితురాలి వద్ద సేకరించిన నమూనాల్లో ఎక్కడా ‘వీర్యపు’ జాడలు లేవని ధ్రువీకరించేశారు. అంతేకాదు. కేవలం ‘కుల పరమైన ఉద్రిక్తతలను’ పెంచటానికి ఈ ఘటనను కొందరు వాడుకుంటున్నారని ప్రత్యారోపణలు చేశారు.
అయినప్పటికీ నలుగురు నిందితుల్నీ అరెస్టు చేశారు. అది కూడా సామూహిక అత్యాచారం, హత్యాయత్నానికి పాల్పడ్డారని. అయితే ఇందులో ఒకణ్ణి మాత్రమే కొన్ని రోజుల ముందు అరెస్టు చేశారు.
సాధారణంగా, అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరు పరచటంతో పోలీసులు తమ బాధ్యత ముగిసిందనుకుంటారు. కానీ, ఇక్కడి పోలీసులు ‘అంతకు మించి’న ధర్మాన్ని నిర్వర్తించారు. చనిపోయిన బాలిక మృత దేహాన్ని కూడా ఉచితంగా ‘దహన’ పరిచారు. అది కూడా తెల్లవారితే 30వ తేదీ అనగా, అర్థరాత్రి 2 గంటలకు కట్టెలు పేర్పించి, కాల్పించారు. ఈ పనికి తమ అనుమతి లేదన్నది బాలిక కుటుంబ సభ్యుల అభియోగం. అంతే కాదు తమను ఇంటిలో బంధించి- ఈ పనికి పాల్పడ్డారని కూడా వారు అంటున్నారు. కానీ పోలీసు ఉన్నతాధికారులు ఈ అభియోగాన్ని కొట్టి పారేస్తున్నారు.


చితిని పేర్చిన ‘చట్టం’
‘చట్టం తన పనిని తాను చేసుకు పోతుంది.’ అంటూంటే, చాలా మందికి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అర్థమయ్యేలా చెప్పారు: ముందు ఘటనే నిరాకరించారు, తర్వాత బాలిక ప్రాణం పోయే ముందు, ఆమె వాంగ్మూలాన్ని స్వీకరించారు. అయినా అత్యాచారం జరగలేదన్నారు. అంతిమంగా కేసు కట్టారు. క్షణాలమీద ‘పోస్టు మార్టం’ చేశారు. తెల్లవార కుండా శవాన్ని ‘బూడిద’ చేశారు. ఒక వేళ ఏ కోర్టువారో ‘రీ పోస్ట్‌ మార్టవ్‌ు’ కు అదేశించారనుకోండి? ‘మృతదేహాన్ని’ వెలికే తీసే పెద్ద పని పోలీసులకు ముందే తప్పింది.


యధా ‘ఠాకూర్‌’, తథా ఖాకీ!
యధాసర్కార్‌. తథా పోలీస్‌. ఇది నిజమని కాస్సేపు నమ్మాల్సి వస్తే, ఉత్తరప్రదేశ్‌ ను పరిపాలిస్తున్నది ముఖ్యమంత్రి హోదాలో వున్న ఆదిత్యనాథ్‌. ఆయన సర్వసంగ పరిత్యాగి, కాషాయాంబరధారి. చిన్నప్పుడే అన్నీ పరిత్యజించారు. ఆయన పుట్టిన ‘ఠాకూర్‌’ కులాన్ని పరిత్యజించ కుండా వుంటారా? కానీ, అదేమిటో, ఆయన సర్కారులోని కీలక విభాగాల్లో (పోలీసు విభాగంతో సహా) ‘ఠాకూర్‌’ లే వుంటారని పలువురు ఆరోపిస్తారు. ఈ ఆరోపణలు చేసే వారిలో ‘బ్రాహ్మణ అధికారులు’ కూడా వున్నారు.
అయినప్పటికీ, ఈ బాలిక అత్యాచారం- హత్య కేసులో నలుగురు నిందితులూ ‘ఠాకూర్‌’ లే కావటం యాధృఛ్చికంగానే తీసుకోవాలా? పోలీసులు ఆ బాలికకు ‘దహన సంస్కారం’ చెయ్యటాన్ని కూడా యాధృచ్చికం అని సరిపెట్టుకోవాలా? పాపం! ఆ ‘నలుగురు నిందితుల’ తో యాధృచ్చికంగా పెనుగులాడితేనే ఆమె వెన్నెముక విరిగిందీ- అని కూడా భావించెయ్యాలా?

-సతీష్ చందర్ ( ఈ రచయిత ఇతర రచనల కోసం www.satishchandar.com విజిట్ చెయ్యండి.)

One thought on “వేళకు కేసు కట్టలేదు, కానీ కట్టెలు పేర్చారు!!

  • Sir always rise your voice these kind of incidents but no use Sir…Really shame of this incident our society your kind of mark is always excellent Sir..

    Reply

Leave a Reply to Usha Cancel reply

Your email address will not be published. Required fields are marked *