FeaturedHyderabadTelangana

నాడు ‘ఇడ్లీ సాంబార్’- నేడు ‘పాన్ మసాలా’

తెలంగాణలో మారుతున్న‘గో బ్యాక్’ మెనూ

 నిన్న ఇడ్లీసాంబార్! నేడు పాన్ మసాలా,పానీ పూరీ!! తినేవి, నమిలేవి, చప్పరించేవి. హఠాత్తుగా ‘నిషిధ్ధ’ పదార్థాలవుతాయి.  సమస్య పదార్థంతో కాదు. దానిని ఆరగించేవారితో. ‘ఏది ఆలోచిస్తానో అదే నేను’ (I think therefore I am) అన్నది వున్నమాటే. కానీ ’ఏది తింటావో అదే నువ్వు’ అన్నది విన్న మాట. తిన్నమాట కూడా. ఆరగించేది ఆహారాన్నే అయితే, ఏ గొడవా వుండదు. కానీ ప్రాంతాన్నో, సంపదనో, జీవికనో అయితేనే ఇబ్బంది. అప్పుడే ‘ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ’ అనీ, ’పాన్ మసాలా గో బ్యాక్’ అనే నినాదాలు పుట్టుకొస్తాయి. ఆంధ్రులొచ్చి తెలంగాణలోని  ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని ఆంధ్రులను ’నాన్ ముల్కి’ (స్థానికేతరులు)గా ముద్ర వేసి, 1952లో ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ’ అన్నారు స్థానికులు.

అవును. ఆంధ్రుల్ని వారు తినే తిండితోనే గుర్తించారు. నిజానికి ఇడ్లీ సాంబార్ మీద ఆంధ్రులకు పూర్తి పేటెంటు హక్కు ఇవ్వ వచ్చా? అనుమానమే. ఎందుకంటే తమిళులకు అతి ఇష్టమైన ఆహారం ఇడ్లీ సాంబార్. స్వరాజ్యానికి ముందు కూడా ‘బారిష్టరు’(బార్ ఎట్ లా) చదువును తమిళులే ఎక్కువ చదివారని, కవి శ్రీశ్రీ తిండికీ, చదువుకీ చమత్కారంగా లింకు పెట్టాడు- ‘బార్ ఎట్ లా కాని వాడు సాంబారెట్లా కాయగలడ’ని. అది వేరే విషయం. ఏమైనా అంధ్రుల మీద కోపాన్ని తెలంగాణలోని స్థానికులు వాళ్ళు తింటున్నారనుకున్న తిండి మీద చూపారు. ఇప్పుడు అంతటి కోపం ’పాన్ మసాలా, పానీ పూరీ’ తినేవాళ్ళ మీద నిజంగా వచ్చిందా? వచ్చిందనే అనుకోవాలి. హైదరాబాద్ లో ఈ రెంటినీ ఇష్టంగా నమిలేదీ, చప్పరించేదీ ’మార్వాడీలు’. అందుకే కాబోలు వ్యతిరేకత పుట్టీ, పుట్టగానే ‘పాన్ మసాలా’ గుర్తుకొచ్చింది. ‘మార్వాడీ గోబ్యాక్’నే ‘పాన్ మసాలా గో బ్యాక్’ గా అనువదించుకుంటున్నారు ఆందోళన కారులు. ఇక్కడ (22 ఆగస్టు 2025న) తెలంగాణ పాటించినప్పుడు ఈ నినాదాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా అరెస్టులు కూడా జరిగాయి.  

ఈ ’మార్వాడీ గో బ్యాక్ ’ నినాదానికి కారణం: మోండా మార్కెట్ (హైదరాబాద్) లో పార్కింగ్ దగ్గర జరిగిన వివాదం. పార్కింగ్ దగ్గర దూషణలూ, తోపులాటలో హైదరాబాద్ లోని ప్రతీ మార్కెట్లోనూ, ప్రతీ రోజూ జరుగుతాయి. కాబట్టి చిన్నదని కొట్టి పారెయ్యవచ్చు.

ఈ ’మార్వాడీ గో బ్యాక్ ’ నినాదానికి కారణం: మోండా మార్కెట్ (హైదరాబాద్) లో పార్కింగ్ దగ్గర జరిగిన వివాదం. ఈ గొడవ చిన్నదీ అంటే చిన్నది. పెద్దదీ అంటే పెద్దది. పార్కింగ్ దగ్గర దూషణలూ, తోపులాటలో హైదరాబాద్ లోని ప్రతీ మార్కెట్లోనూ, ప్రతీ రోజూ జరుగుతాయి. కాబట్టి చిన్నదని కొట్టి పారెయ్యవచ్చు. కానీ తోసేసి, తిట్టేసింది ఎవర్నో కాదు. ఒక దళితుణ్ణి. దూషణ కూడా ’కులం పేరుతో’ చేశారని ఆరోపణ. అలా దూషించింది ’మార్వాడీ’. ఇలా చూస్తే పెద్దదే. (బెయిలు కు నోచుకోని కేసు అవుతుంది.) అయితే మాత్రం. ఏకంగా ఇది రాష్ట్రవ్యాపితమైన ఆందోళన అవుతుందా? అగ్నికి ఆజ్యం తోడయితే అవుతుంది. ’మార్వాడీ వ్యాపారుల’ మీద ఇతరులకున్న పాత కోపాలన్నీ వెలుపలికి వచ్చాయి. ‘మార్వాడీ షాపుల్లో’ నాసిరకం డూప్లికేటు వస్తువులు అమ్ముతారనీ, జీఎస్టీ సుంకాలు ఎగ్గొడతారనీ, కొన్నవస్తువులకు రశీదులివ్వరనీ యూట్యూబు చానెళ్ళలోనూ, సోషల్ మీడియా వేదికల్లోనూ దుమ్మెత్తి పోసేశారు. ప్రధాన మాధ్యమాలు పెద్దగా పట్టించుకోలేదు. రాజకీయ పక్షాలూ కిమ్మనలేదు. ఒక్క బీజేపీ తప్ప.  బీజేపీ టికెట్టు పై ఎంపీగా పోటీ చేసి వోడిన మాధవీలత, ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీకి రాజీనామా చేసిన రాజా సింగ్ లు మాత్రం ముందుగా కలగచేసుకున్నారు. మర్వాడీలకు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత ఇతర బీజేపీ నేతలు రంగంలోకి దిగారు.

’మార్వాడీ గో బ్యాక్’ అంటే ఒక్క ’కాషాయ నేత’లకు మాత్రమే ఎందుకు కోపం వచ్చినట్లూ? కారణాలు రెండు. ఒకటి: హిందీ,  రెండు : హిందూత్వ. ఎక్కడికి వెళ్ళినా ఈ రెంటినీ వదలరు. ఇందుకు ఢిల్లీలోని ‘మార్వాడీ లైబ్రరీ’యే సాక్ష్యం. దేశంలోపలే కాదు. దేశం వెలుపలా ఈ రెంటినీ వదలరు. ఇందుకు కారణం లేక పోలేదు. వీరిలో అధిక భాగం రాజస్థాన్, గుజరాత్ కు చెందిన వారే. కానీ దేశమంతటా వున్నట్టే వుంటారు. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తీసుకుంటే గుప్పెడు, గుప్పెడు వుంటారు. అందుకే రాజకీయంగా ప్రాంతీయ పార్టీల వుండరు. దేశాన్ని చక్కబెట్టగల జాతీయ పార్టీలనే వెంబడిస్తారు. ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ. స్థానికంగా వచ్చిన చిన్న ఆందోళనకయినా పెద్దగా కలవరపడతారు. ముందు తమ రాష్టాన్ని వదలి వెళ్ళేటప్పడు, సముద్ర తీర ప్రాంతాలనే వెతుకున్నారు. కాబట్టే కోల్ కత్తా, ముంబయిల వైపు వెళ్ళారు. కారణం అక్కడే ‘బజార్లు’ వచ్చాయి. ముత్యాలు, నల్లమందు, సిల్కు వంటి దిగుమతయిన వస్తువులను తిరిగి దేశంలో విక్రయిస్తే, లాభాలు బాగా వచ్చేవి. కానీ క్రమేపీ (1960 నుంచీ) బెంగాల్లో (కోల్ కొతాలో) కమ్యూనిస్టుల ప్రభావమూ, ముంబయిలో కార్మిక సంఘాల ప్రభావమూ పెరిగే సరికి, ప్రశాంతంగా వుంటుందని, పెద్దపెద్ద మార్వాడీ వ్యాపారులు అక్కడి నుంచి ఢిల్లీకి మారారు. అంటే స్థానికులనుంచి ఇబ్బంది కలగకుండా వుండాలంటే, దేశమంతా ఒకే భాష (హిందీ) మాట్లాడేవాళ్ళు వుండాలని, దేశంలో ఒకే ‘మతం’ ఆధిపత్యంలో వుండాలనీ ప్రచారం చేసేవారు.

మార్వాడీల వాణిజ్యవలసలు 18వ శతాబ్దం నుంచే వుండటం చేత, కొన్ని మార్వాడీ కుటుంబాలు 19వ శతాబ్దం నాటికి వేలాది ఎకరాల భూముల్ని కొనగలిగారు. ‘జమీన్ దారు’లుగా కూడా మారారు. ప్రధానంగా మార్వాడీల్లో ఓస్వాల్ మార్వాడీలు(వీరిని ముర్షీదాబాదీలు అని కూడా అంటారు.) ఈ స్థాయికి ఎదిగారు.

వీరి వాణిజ్యవలసలు 18వ శతాబ్దం నుంచే వుండటం చేత, కొన్ని మార్వాడీ కుటుంబాలు 19వ శతాబ్దం నాటికి వేలాది ఎకరాల భూముల్ని కొనగలిగారు. ‘జమీన్ దారు’లుగా కూడా మారారు. ప్రధానంగా మార్వాడీల్లో ఓస్వాల్ మార్వాడీలు(వీరిని ముర్షీదాబాదీలు అని కూడా అంటారు.) ఈ స్థాయికి ఎదిగారు. వీరు బ్రిటిష్ పాలకులకు విధేయంగా వున్నప్పటికీ, ఇలా మార్వాడీలు భూమి మీద ఆధిపత్యం సాధించటం నచ్చలేదు. వ్యవసాయం చెయ్యని కులాలకు భూమి తో ఏమి పని? ఈ ప్రశ్నవేసి, ’వ్యవసాయేతర కులాల’ వారు భూమిని కొనకుండా శాసనం చేశారు.ఆ తర్వాత వీరు ‘సట్టా వ్యాపారం’ (Speculation) లోకి దిగారు. ఎదుగుతుందన్న వర్తకాన్ని ముందే కనిపెట్టి పెట్టుబడి పెట్టి లాభాలార్జించటంలో వీరు పండిపోయారు. అదే వీరిని తర్వాత ‘స్టాక్ మార్కెట్ల’ వైపు నెట్టింది. దాదాపు 1860-1900 మధ్య కాలంలో మార్వాడీ ఈ మార్కెట్టుని కమ్మేశారు.

దేశానికి స్వరాజ్యం వచ్చేనాటికి, భారీ పరిశ్రమలు, భారీ వ్యాపారాలు అనగానే గుర్తుకొచ్చేవి రెండే కుటుంబాలు. ఒకటి టాటా కుటుంబం. మరొకటి బిర్లా కుటుంబం. టాటాలు పార్శీలు. హిందువులు కారు. కానీ బిర్లాలు మార్వాడీలు. జాతీయోద్యమంలో ఈ రెండు కుటుంబాలూ కాంగ్రెస్ కు సహకరించాయి. టాటా (జె.ఆర్.డి టాటా) నెహ్రూకీ, బిర్లా (జి.డి. బిర్లా) గాంధీకి దగ్గరగా వుండేవారు. అలా, నాటి జాతీయ కాంగ్రెస్ వీరిద్దరూ ఆర్థికావసరాలను తీర్చేవారు. అప్పుడు టాటా, బిర్లాలు ఎలాగో, ఇప్పుడు ‘అ.అ’లు -అనగా అంబానీ, అదానీలు- అలాగ. కాకుంటే అప్పుడు ఒకరు పార్శీ, ఇంకొకరు మార్వాడీ. ఇప్పుడయితే ‘అ’లు ఇద్దరూ బనియాలే. (మార్వాడీల్లో  అధికభాగం బనియాలే. కాబట్టే మార్వాడీలను బనియాలనూ పర్యాయ పదాలుగా వాడతారు. కాకుంటే రాజస్థాన్ లో ’మార్వార్’ నుంచి వచ్చారని మార్వాడీలంటారు.) ఇప్పటి బీజేపీకి వీరి అండదండలు ఏ మేరకు వున్నాయన్నది బహిరంగ రహస్యమే.

హైదరాబాద్ లో స్థానికులు చేసుకునే చిన్నవ్యాపారులకు మార్వాడీ వ్యాపారులకూ మధ్య స్పష్టమైన అగాథం కనిపించింది. అంతే కాదు. మార్వాడీలు నగలు వ్యాపారంలో బాగా వృధ్ధి చెందారు. చిన్నగ్రామాల్లో, పట్టణాల్లో వుండే స్వర్ణకారులు తమ వృత్తిని వదలుకుని, ఈ నగలషాపుల్లో కూలి వారిగా చేరాల్సి వచ్చింది.

సట్టా వ్యాపారం మీద మార్వాడీలకున్న మక్కువ వారిని ముంబయి వైపు ఎలా నెట్టిందో, బ్యాంకింగ్ వ్యాపారం మీద  వున్న అపేక్ష వారిని హైదరాబాద్ వైపు నెట్టింది. నిజాం నవాబులకు నమ్మకమైన బ్యాంకర్లుగా అప్పట్లో బికనేరి మార్వాడీ కుటుంబాలు మారాయి. ఆ కుటుంబాల్లో ముఖ్యమైన కుటుంబం పిత్తీస్ కుటుంబం. వీరు 1817 నాటికే హైదరాబాద్ చేరుకున్నారు. వీరు రాజస్థాన్ లోని జహాజ్ పూర్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. తర్వాత రాజస్థాన్ నుంచే కాదు, గుజరాత్ నుంచి కూడా హైదరాబాద్ వైపు వచ్చారు. అయితే తెలంగాణ ఇండియన్ యూనియన్ లో విలీనం అయ్యాక, ఎలాగూ కాంగ్రెస్ సర్కారే వచ్చింది. తర్వాత స్థానిక, స్థానికేతరుల సమస్య వచ్చినా, స్థానికేతరుల ముద్ర ఆంధ్ర వారిపైనే పడింది. కాబట్టి మార్వాడీలు అప్పడు అభధ్రతకు గురి కాలేదు. తొలుత వచ్చిన తెలంగాణ ఉద్యమం చల్లారి పోయాక, 1970 లలో ‘హిందూత్వ’ ప్రచారాన్ని ముమ్మరం చెయ్యబోయారు. అందుకు గణపతి నవరాత్రులు బాగా దోహద పడ్డాయి. భారీ విగ్రహాల తయారీలకూ, ఊరేగింపునకూ అంతే భారీగా విరాళాలు విరజిమ్మారు. (తర్వాత కాలంలో హైదరాబాద్ లో బీజేపీ ఊపిరి పోసుకోవటానికి వీరి సహకారం బాగా వుంది.) అప్పట్లో పాతబస్తీలో మతపరమైన అల్లర్లు బాగా జరిగేవి. ఆ తర్వాత 1983లో ప్రాంతీయ పార్టీ (తెలుగుదేశం) పాలన వచ్చింది. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్  అల్లర్ల మీద ఉక్కుపాదం మోపారు. దాంతో ఆంధ్రపారిశ్రామిక వేత్తలు పెట్టుబడి పెట్టటానికి హైదరాబాద్ సురక్షిత ప్రాంతమయ్యింది. మద్రాసు నుంచి తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్ కు తరలి వచ్చింది. దాంతో ఆంధ్రపారిశ్రామిక వేత్తలు, వాణిజ్య వేత్తలను మార్వాడీలు పోటీని ఎదుర్కొన్నారు. దాంతో 2001 తర్వాత వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మార్వాడీలు మద్దతు కూడా ఇచ్చారు. తెలంగాణ (2014లో) రాష్ట్రంగా ఏర్పడ్డాక, పదేళ్ళ వరకూ మార్వాడీలు తమ వాణిజ్యాలను యధేఛ్చగా అభివృధ్ధి చేసుకున్నారు. ఈ లోగా హైదరాబాద్ లో స్థానికులు చేసుకునే చిన్నవ్యాపారులకు మార్వాడీ వ్యాపారులకూ మధ్య స్పష్టమైన అగాథం కనిపించింది. అంతే కాదు. మార్వాడీలు నగలు వ్యాపారంలో బాగా వృధ్ధి చెందారు. చిన్నగ్రామాల్లో, పట్టణాల్లో వుండే స్వర్ణకారులు తమ వృత్తిని వదలుకుని, ఈ నగలషాపుల్లో కూలి వారిగా చేరాల్సి వచ్చింది. ఇందుకు సరళీకృత ఆర్థిక విధానం (Liberalisation) కొంత కారణం కావచ్చు. ఏమైతేనేం? ఇప్పుడు హైదరాబాద్ లో వుండే స్థానికుల్లో కొందరికి మార్వాడీలు తమ వాణిజ్యాన్ని కొల్లగొడుతున్న వారిలా కనిపిస్తే కనిపించ వచ్చు. అందుకే కాబోలు 2021 లోనూ మోండా మార్కెట్ లో జరిగినట్టి  ఓ ఘటన తూప్రాన్ లో నూ జరిగింది. అప్పుడు ’మార్వాడీ హఠావో, తూప్రాన్ బచావో’ అంటూ జనం రోడ్ల మీదకు కూడా వచ్చారు.

ఏ ఆందోళనా రాజకీయ మద్దతు లేకుండా రాజుకోదు. ఇప్పటి మార్వాడీ వ్యతిరేక ఆందోళనకు ఎవరు మద్దతు ఇస్తారు? బీజేపీ ఎలాగూ మార్వాడీలకు అనుకూలంగా ముందుకొచ్చింది. మిగిలిన ప్రధాన పక్షాలు రెండు. ఒకటి కాంగ్రెస్. మరొకటి బీఆర్ఎస్. రెండూ పైకి పట్టనట్టే వున్నాయి. బంద్ కు పిలుపునిచ్చిన వారిని కాంగ్రెస్ సర్కారు మాత్రం అడపాదడపా అరెస్టులు చేసి ఊరుకుంది. వచ్చేవి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికలు. బీజేపీ వ్యూహం వేరుగా వుంటుంది. ముస్లిం వోటర్లను వేరే చేసి, ఇతరుల (హిందువుల) వోటర్లన్నింటినీ కులాలకతీతంగా కూడగట్టాలని అనుకుంటుంది. ఇప్పుడు దీనికి ప్రతి వ్యూహం చెయ్యటానికి ఎవరయినా పూనుకున్నారా? ‘మార్వాడీ వ్యతిరేక ఆందోళన’ చూస్తే అదే అనిపిస్తోంది. ఒక చిన్న సమూహాన్ని వేరుపరచటం (Othering) అన్నవ్యూహానికి కౌంటర్ గా ’మార్వాడీ’లను వేరుపరిచే అవసరం కాంగ్రెస్- బీఆర్ఎస్ లలో ఎవరికి వుంది? బీజేపీ బరిలో బలంగా వుంటే త్రిముఖ పోటీ అవుతుంది. అదే బీజేపీని ఇలా తప్పిస్తే, ముఖాముఖి పోటీ అవుతుంది. ఇలా జరిగితే బీఆర్ ఎస్- కాంగ్రెస్ లలో ఎవరికి ఎక్కువ లాభం? ముందు ముందు తెలుస్తుంది.

27 ఆగస్టు 2025

6 thoughts on “నాడు ‘ఇడ్లీ సాంబార్’- నేడు ‘పాన్ మసాలా’

  • Santosh

    చాలా సరళo గా, సునిశీల పరిశోధన తో రాసిన ఆర్టికల్. కొత్తగా, ఆలోచనాత్మoగా ఉంది.

    మార్వాడీలు, వారి చారిత్రక నేపథ్యం, ప్రస్తుత రాజకీయ పార్టీలు, వారి ఆలోచనలు చక్కగా వివరంగా తెలిపారు.

    Reply
    • S.naveen goud

      Sir you explained clearly about marwaris n their bussiness from before independence.the article shows how they dominated n developed by financing the political parties from then to now.before reading this article i don’t know about marwaris.But now I got clarity about marwaris.i think main telugu dialy editions also not written this much clarity about marwaris.thank u sir for this great article.

      Reply
  • Rajesh Babu Ch

    చాలా బాగుంది సార్. అనేక కోణాలను నిశితంగా గమనించి, పరిశీలించి సగటు పాఠకునికి అర్ధం అయ్యేలా, తీగలాగితే డొంకంతా కదిలేలా అసలు విషయం బోధపడేలా చెప్పారు. మీరు నిజంగా “మా ⭐ స్టారు”.

    Reply
    • విమల రాయల

      “మార్వాడి గో బ్యాక్ “నినాదం రాష్ట్రంలో ఒక కుదుపు
      తీసుకొచ్చింది. “ఒక చిన్న నిప్పు రవ్వ దావనాలం “.
      అయినట్లు రాబోయే ఎన్నికలకు హవాలా ఈ “మార్వాడి
      గో బ్యాక్”పిలుపును రాజేయ చూసారు.వ్యాపార అవసరాలకు వచ్చిన మార్వాడిల దురహంకారం మోండా మార్కెట్లో చిరు వ్యాపారి అయిన దళితుడిపై
      బట్టబయలయింది. సతీష్ sir సమస్యను “పానీపూరి “తో మొదలు పెట్టి మార్వాడిలలో బడా వ్యాపారులతో పాటు పేద కూలీలు, చిరు వ్యాపారులు కూడా ఉంటారని, ఇలా ఈ సమస్య లోని అన్ని కోణాలను పాఠకులదృష్టికి తెచ్చారు.మార్వాడి గో బ్యాక్ ‘గోల ‘లో
      ముందు వెనుక పరిణామాలు సామాన్యులకు అర్థం అయ్యేలా చక్కగా వివరించి, అందరి దృక్కోణాన్ని విస్తృతం చేసారు. చాలా బాగుంది sir 🙏

      Reply
  • Bochu sambasiva

    చాలా మంచి వివరణ సార్

    Reply
  • పట్టుపోగుల పవన్ కుమార్ B.tech

    ఇంతటి చక్కటి విశ్లేషణ ఎక్కడ రాయలేదు సార్. ఇది చదివిన తర్వాత మార్వాడీల చరిత్ర తెలిసింది. ఇందులో ఉన్న రాజకీయం గ్రహించగలుగుతున్నాను. మన దేశంలో ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ప్రభుత్వ వ్యవస్థలు పటిష్టంగా పనిచేయాలి. పనిచేసే విధంగా ప్రజలు ప్రశ్నించాలి.ఒక సమూహాన్ని ‘అదరింగ్’ చేయడం బాధాకరం. ఇటువంటివి మొక్కలోనే తుంచేయాలి. మీ విశ్లేషణ మాత్రం చాలా చాలా సూపర్ సార్చా. చాలా విషయాలు తెలిశాయి నాకు….ధన్యవాదాలు సతీష్ చందర్ సార్.

    Reply

Leave a Reply to Santosh Cancel reply

Your email address will not be published. Required fields are marked *