AndhraFeaturedPoliticsTelangana

ఉపరాష్ట్రపతి ఎన్నికలో ‘తెలుగు’ వోటు తడబాటు

అవును. బరువొకవైపు. పరువొక వైపు. అంకెల్ని ఎన్డీయే చూపిస్తుంటే, విలువల్ని యూపీయే చూపిస్తోంది. ఇదే ఈ ఏడాది( 2025లో) జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక. కొన్ని ఎన్నికలంతే. లెక్కింపునకు ముందే ఫలితం తెలిసిపోతుంది. ఎన్డీయే అభ్యర్థి సి.పి. రాధాకృష్ణనే  కాబోయే ఉపరాష్ట్రపతి. యూపీయే యే కాకుండా ఇండియా బ్లాక్ మొత్తం బలపరుస్తున్న ఇండిపెండెంటు అభ్యర్థి జస్టిస్. బి. సుదర్శన్ రెడ్డి ఎలాగూ  ఓడిపోతారు. ముగింపు తెలిసిన సినిమాను ఊపిరిబిగబట్టి చూస్తారా? దేశమంతా చూస్తున్నారిప్పుడు. ప్రచార హోరు, తీరు అలా వున్నాయి.

లోక్ సభ సీట్లు: 542

రాజ్యసభ సీట్లు: 240

మొత్తం: 782

ఎన్డీయే: 427

కాంగ్రెస్ +: 355

ముఖ్యంగా ఈ ఉత్కంఠ తెలుగునాట వుంది. కారణం విపక్ష అభ్యర్థి జస్టిస్. సుదర్శన్ రెడ్డి తెలుగు వాడు. అప్పటి ఆంధ్రప్రదేశ్ (ఇప్పటి తెలంగాణ)లోని ఆకుల మైలారంలో ఆయన పుట్టారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కు న్యాయమూర్తిగా,  గువహతి హైకోర్టుగా ప్రధాన న్యాయమూర్తిగా, ఆపైన సుప్రీం కోర్టుకు న్యాయమూర్తిగా  పనిచేశారు. ఏ రాజకీయ  పార్టీలోనూ ఎప్పుడూ లేరు. కానీ, తాను ’రాజకీయాలకు అతీతం’ కాదు అని అంటారు. తనకంటూ విస్పష్టమైన రాజకీయాభిప్రాయాలుంటాయని చెప్పారు.

కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో వుండగా తెలుగువాడయిన ప్రధాని పీవీ నరసింహారావు నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి(1991లో) పోటీ చేస్తే, తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ పోటీ పెట్టకుండా ‘తెలుగు ప్రధాని’కి సహకరించారు.

ఉపరాష్ట్రపతి లాంటి కీలకమైన రాజ్యాంగ పదవికి తెలుగు వాడు పోటీలో వున్నప్పుడు, తెలుగు రాష్ట్రాలలో వుండే పార్టీలకు అగ్నిపరీక్ష వుంటుంది. పొత్తులకూ, ఎత్తులకూ అతీతంగా వోటు చెయ్యాలన్న వత్తిడి ఒకటి  వుంటుంది.  ఆంధ్రప్రదేశ్ లో వున్న అధికారంలో వున్న తెలుగుదేశమే వుంది. దాని పేరులోనే ’తెలుగు’ వుంది. పై పెచ్చు వ్యవస్థాపకుడయిన ఎన్టీ రామారావు, తాను ‘తెలుగువారి ఆత్మగౌరవం’ కోసమే ఈ పార్టీ పెట్టానని అన్నారు. మరి ఇప్పుడా పార్టీ  ఎన్డీయే లో భాగంగా వుంది.  బీజేపీ  అభ్యర్థి రాధాకృష్ణన్ ని కాదని, సుదర్శన్ రెడ్డికి ఎలా వేస్తుంది? పైపెచ్చు జెడి(యు) అధినేత నితిష్ కుమార్ తో పాటు, ఇప్పటి తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు మీదనే కేంద్ర సర్కారు ఆధారపడి వుంది. కానీ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో వుండగా తెలుగువాడయిన ప్రధాని పీవీ నరసింహారావు నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి(1991లో) పోటీ చేస్తే, తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ పోటీ పెట్టకుండా ‘తెలుగు ప్రధాని’కి సహకరించారు. అంతెందుకు? ఇదే ఉపరాష్ట్రపతి ఎన్నికకు 2017లో  తెలుగువాడయిన ఎం. వెంకయ్యనాయుడు ఎన్డీయే (బీజేపీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు, మిత్రపక్షమైన తెలుగుదేశం ఎలాగూ మద్దతు ఇస్తుంది? దానితో పాటు ఎన్డీయే కు వ్యతిరేకంగా వున్న తెలుగు రాష్ట్రాలలోని పార్టీలు ( ఆంధ్రప్రదేశ్ నుంచి వైయస్సార్ కాంగ్రెస్, తెలంగాణ నుంచి టీఆర్ఎస్ లు) మద్దతు ఇచ్చాయి. మరి ఇప్పుడలా చేస్తాయా? వైయస్సార్ కాంగ్రెస్ (వైసీపీ) రాధాకృష్ణన్ కే వోటు చేస్తానంటుంది. రాజ్యాంగ పదవులకు జరిగే ఎన్నిక ‘ఏకగ్రీవంగా’ వుండాలన్నది తన విధానంగా చెబుతున్నది. గతంలో వెంకయ్యనాయుడికి మద్దతు ఇవ్వటానికి కూడా ఇదే కారణాన్నిసూచించింది. 

మరి అప్పటి టీఆర్ఎస్ గా వున్న ఇప్పటి బీఆర్ ఎస్ మాటేమిటి? అది ‘తెలుగువాడి పరువు’ కన్నా ’తెలంగాణ కు ఎరువు’ ముఖ్యమైన కొత్త తర్కాన్ని ముందుకు తెచ్చింది. తెలంగాణ రైతును ఆదుకోవటానికి రెండు లక్షల మెట్రిక్ టన్నుల  యూరియా ఇవ్వటానికి హామీ ఇచ్చే పార్టీకే  తమ మద్దతు అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేశారు. (ఎరువిచ్చేది అధికారంలో వున్న ఎన్డీయేనని వేరే చెప్పనవసరంలేదు. ఇక జనసేన ఏం కారణాలను చెబుతుందన్నది పక్కన పెడితే,  అనివార్యంగా  బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తుంది. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతు సుదర్శన్ రెడ్డికి కోరతామని, తెలంగాణ ముఖ్యమంత్రి , కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. కానీ అది ‘కోరిక’గానే మిగిలి పోతుంది.

సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ కాంగ్రెస్ పార్టీలోనే చేరాడు. అంతే కాదు, అప్పటి కేంద్ర హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కూడా ఈ ’సల్వాజుడుం కార్యకలాపాలను’ తెగ పొగిడారు. ఆ తర్వాత(2013లో) మావోయిస్టులు మహేంద్ర కర్మ తో పాటు, కాంగ్రెస్ దిగ్గజం విద్యాచరణ్ శుక్లా ను కూడా మట్టుబెట్టారు.

చిత్రమేమిటంటే, ఈ సారి ఉభయపక్షాలూ, ఉపరాష్ట్రపతి అభ్యర్థులను వ్యూహాత్మకంగా దక్షిణ భారతంనుంచే దించారు. ఎన్డీయే అభ్యర్థి సి.పి రాధాకృష్ణన్ ది తమిళ నాడు. కోయంబత్తూరు అనగానే గుర్తుకొచ్చే ఏకైక బీజేపీ నేత సి.పి. రాధాకృష్ణన్. ఈయన నిజానికి కాంగ్రెస్ కుటుంబీకుడే. తర్వాత, బీజేపీకి వెన్నెముకగా వున్న ఆర్.ఎస్.ఎస్ లో చేరారు. ఈయన ప్రభావం కోయంబత్తూరులో చాలా వరకూ వుంటుంది. అందుకు కారణం అక్కడ  జరిన ఉగ్రవాదు దాడులు. అందుకు నిరసనగా ఆయన పెద్ద  ఆందోళన చేపట్టారు. బాబ్రీ మసీదు విధ్వంసం చేసినందుకు ప్రతీకార చర్యగా అల్- ఉమ్మా అనే ఉగ్రవాద సంస్థ (1998లో) ఈ దాడికి పాల్పడింది. ఈ దాడిలో 58 మంది చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కోయింబత్తూరు లోక్ సభ సీటునుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. అంటే మైనారిటీ వ్యతిరేక వోటుగా పడ్డ హిందూమెజారిటీ వోటు ఆయనకు అనుకూలించింది. ఇప్పుడు రాధాకృష్ణన్ నే అభ్యర్థిగా ఎంచుకోవటానికి మరొక  కారణం కూడా లేక పోలేదు. ఇటీవల  కాలంలో బీజేపీ ‘మతం’ మీద కన్నా ’కులసమీకరణ’ ల మీద ఎక్కువ ఆధారపడుతోంది. రాధాకృష్ణ కొంగు వెల్లార్ సామాజిక వర్గానికి చెందిన వారు. కొంగు వెల్లార్ లో వాణిజ్య రంగంలో బాగా ముందున్నారు. రాధాకృష్ణన్ కూడా  వ్యాపార వేత్తే. తర్వాత వచ్చే తమిళనాడు ఎన్నికలలో బీజేపీ ఈ కులపు మద్దతు బాగా ఉపయోగపడుతుందని ముందే ఊహిస్తున్నట్టున్నారు.

రాధాకృష్ణన్ మీద విపక్షం పెద్దగా విమర్శలు గుప్పించకుండానే, జస్టిస్. సుదర్శన్ రెడ్డి మీద ’మావోయిస్టు అనుకూల’ ముద్రవెయ్యటానికి బీజేపీ తెగించేసింది. అందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వున్నప్పుడు (సుందర్ అండ్ అదర్స్ వెర్సస్ స్టేట్ ఆఫ్ చత్తీసగడ్-2011 కేసులో) ‘సల్వాజుడుం’కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు. రాష్ట్రప్రభుత్వ మద్దతుతో ఏర్పడ్డ ప్రయివేటు సంస్థ ’సల్వాజుడుం’. ఇందులో చత్తీస్ గడ్ లోని గిరిజనులనే రిక్రూట్ చేసి, వారి చేతికి ఆయుధాలిచ్చి, అదే రాష్ట్రంలో మావోయిస్టుల మీదకు పంపేందుకు ఈ సంస్థ ఏర్పడింది. ఇలా గిరిజన యువకులకు ఆయుధాలిచ్చి‘స్పెషల్ పోలీసు ఆఫీసర్లు’ గా చూపటం రాజ్యాంగ విరుద్ధం అని ఆయన తీర్పుచెప్పారు. ఆయన ఈ తీర్పు చెప్పకుంటే 2020కు ముందే నక్సలైట్లకు చరమగీతం పాడేవాళ్ళమని సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించేశారు. అయితే ఇటీవల కాలంలో ‘అర్బన్ నక్సలైట్ ’అనే ముద్ర పట్టుకుని, తమని విమర్శించిన ప్రతీ ఒక్కరి మీద వేస్తోంది. రాహుల్ గాంధీ  నుంచి అమర్త్య సేన్ వరకూ ప్రతీ ఒక్కరి మీద పచ్చబొట్లు వేసినట్లు ఈ ‘ఎర్రబొట్లు’ పొడుస్తూనే వుంది. కాబట్టి జస్టిస్. సుదర్శన్ రెడ్డి విషయంలో ఆశ్యర్యంలేదు. నిజానికి ‘సల్వాజుడుం’ ను కోర్టు ఇలా రద్దు చేసినందుకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ యే ఎక్కువ ఉడుక్కుని వుండాలి. ఎందుకంటే, ఈ సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ కాంగ్రెస్ పార్టీలోనే చేరాడు. అంతే కాదు, అప్పటి కేంద్ర హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కూడా ఈ ’సల్వాజుడుం కార్యకలాపాలను’ తెగ పొగిడారు. ఆ తర్వాత(2013లో) మావోయిస్టులు మహేంద్ర కర్మ తో పాటు, కాంగ్రెస్ దిగ్గజం విద్యాచరణ్ శుక్లా ను కూడా మట్టుబెట్టారు. అంటే ’సల్వాజుడుం’ సృష్టికి సహకరించినందుకు కాంగ్రెసే ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇన్నాళ్ళకు గుణపాఠం నేర్చుకున్నట్టుంది కాబోలు. ప్రమాదాన్ని ముందుగానే తన తీర్పు ద్వారా హెచ్చరించిన జస్టిస్. సుదర్శన్ రెడ్డిని ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి సిధ్ధం చేసింది.

కానీ జస్టిస్. సుదర్శన్ రెడ్డి కేవలం ’సల్వాజుడుం’ మీద ఇచ్చిన తీర్పే కాదు, విదేశీలకు తరలిపోతున్న నల్ల ధనాన్ని పట్టుకోవటంలో కేంద్ర అలసత్వాన్ని తప్పుపడుతూ కూడా తీర్పును ఇచ్చారు. పదవీ విరమణ తర్వాత కూడా ‘సాంఘిక సమానత్వం’ దిశగా కొంత కృషి చేశారు. ఆ మేరకు ప్రభుత్వాలకు సహకరించారు కూడా.

అయితే కాంగ్రెస్ సహా, ఇతర యూపీయే పక్షాలూ, ఇండియా బ్లాక్ ని ఇతర భాగస్వామ్య పక్షాలూ, బీజేపీ ఇప్పటి అభ్యర్థి ని పెద్దగా విమర్శించ కుండా, ఇప్పటి మధ్యంతర ఎన్నికకు కారణమైన జగ దీప్ ధన్ ఖర్ చేత ’బలవంతంగా రాజీనామా చెయ్యించారని‘ బీజేపీ అధినాయకత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. పేరుకు ఉపరాష్ట్రపతి ఎన్నిక అయినా, ఈ సారి మాత్రం ఉత్కంఠ భరితంగా  సాగుతోంది. ఎందుకంటే, ‘వోటు చోరీ’ అంటూ విపక్ష నేత రాహుల్ గాంధీ ‘భారత ఎన్నికల సంఘాన్ని’ లక్ష్యంగా చేసుకుని ‘యాత్ర’లు చేస్తున్నారు. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలుపు రాకపోయినా, పోటీ అన్నది ఒక ప్రచారాస్త్రంగా విపక్షాలు వాడుతున్నాయి.  

2 సెప్టెంబరు 2025

8 thoughts on “ఉపరాష్ట్రపతి ఎన్నికలో ‘తెలుగు’ వోటు తడబాటు

  • Rajesh Babu Ch

    నేటి రాజకీయ పరిస్థితుల్లో వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా నిలుస్తుంది. యావత్ ప్రపంచం ఆసక్తి కనపరుస్తుందనటంలో సందేహం అక్కరలేదు. దాని గురించి అనేక ప్రధాన వార్తాపత్రికలు ఇంతటి విశ్లేషణ అయితే చేయటం లేదు. నాకైతే ఈ వ్యాసం బాగా నచ్చింది సార్ ధన్యవాదాలు.

    Reply
  • S.naveen goud

    First word in my mind after reading this article is”EXCELLENT”

    From this article we understand about wise president candidates from NDA and congress plus they both are fighters,but majority number of mp’s from loksabha,and rajasabha showing definitely NDA candidate win is confirmed.But congress and there supporting parties move is very clever,because they elected candidate from telugu state’s.from this move they want show war is not one side.Lets wait and see.

    Thank u soo much sir for this huge information.i am very happy to read ur article’s regularly.

    Reply
  • Bochu sambasiva

    మంచి వివరణ ఇచ్చారు సార్

    Reply
  • Pattupogula Pavan Kumar B.tech

    చాలా మంచి విశ్లేషణ సర్,సామాన్యులకు కూడా అర్థం అయ్యేవిధంగా రాసారు ధన్యవాదాలు సర్

    Reply
  • Abhiram

    ఏ న్యూస్ పేపర్ లో దొరకని విశ్లేషణ ఈ ఒక్క ఆర్టికల్ ద్వారా లభించింది. విశ్లేషణ ఇవ్వాల్సిన న్యూస్ పేపర్లు విసిగిస్తే, విసుగులో చదివిన ఈ కధనం పదిమందికి అర్ధమయ్యేలా చెప్పే ఉత్సాహాన్నిచ్చింది. థ్యాంక్యూ.

    Reply
  • Kumar Nice

    చాలా బాగా రాశారు సార్, ప్రజలకు మంచి విశ్లేషణ పొందుపర్చారు!

    Reply
  • Deshmukh Badreshwar

    తెలంగాణ కాంగ్రెస్ తప్ప వేరే తెలుగోడు తెలుగోడి గోడును వినిపించుకోవడం లేదు.

    మొత్తానికి బీజేపీ మళ్ళీ ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనుంది.

    Reply
  • మీ విశ్లేషణ వల్ల ఉపరాష్ట్రపతి ఎవరు ఎన్నుకోబడతారో అని స్పష్టంగా అర్థమైంది. Good explanation sir

    Reply

Leave a Reply to Bochu sambasiva Cancel reply

Your email address will not be published. Required fields are marked *