FeaturedLiterature

చతుర్ముఖుడు

నాన్న బూడిదయ్యాడు: అది అప్పుడు.  బూడిదే నాన్నయ్యాడు: ఇది ఇప్పుడు

కలశమే. నాన్న అస్థికలున్న కలశమే. చూసేవాళ్ళకు ఇత్తడి చెంబు. కానీ ఆకాశ్ నాయుడికి మాత్రం పుత్తడి జ్ఞాపకం. ఎప్పుడో కలపాల్సింది. గంగలో కాదు, గోదావరిలో. గోదావరి నీళ్ళల్లో మునక, గోదావరి గట్టు మీద పడక- ఈ రెండూ నాన్నకు ఇష్టం. కలపటానికి రేపు, మాపు అంటూ వాయిదా వేస్తూవచ్చాడు. ఏడాది పూర్తి కావస్తోంది. వారంలో సంవత్సరీకం.

నాన్న అంటేనే వాయిదా. ఏదీ అనుకున్న రోజున చేసేవాడు కాదు. ‘అలా చేస్తే మీ నాన్న ఎందుకవుతాడు’ అనేది అమ్మ. పెళ్ళికూడా అంతేనట. నాన్నమాట నమ్మిఅమ్మ మూడుసార్లు పట్టుచీర కట్టుకొచ్చింది గుడిదగ్గరకి. ‘పెళ్ళంటే తంతే కదా, ఎప్పుడు జరిగితే ఏముందీ?’ అంటూవచ్చాడు నాన్న. నాలుగోసారి వాయిదా వేస్తే తంతానన్నది అమ్మ. అంతే. గంట ముందొచ్చి కూర్చున్నాడు. కొంప మునిగిపోతుందంటే కానీ, ఏ కార్యమూ చెయ్యడు. అప్పుడు మాత్రం ఉరుకులూ పరుగులే. అందుకే నాన్నకు పెద్దగా వ్యాయమంతో పనివుండేది కాదు.  రైలుకదులుతున్నప్పుడే ప్లాట్ ఫాం మీదకు రావటమూ, పరీక్షా కేంద్రం గేటు వేస్తున్నప్పుడే ఆటో దిగటమూ, వైన్ షాపు షట్టర్ మూసేసటప్పుడే, మెట్లెక్కి బీరు బాటిల్ కొనటమూ… ఎలా చూసినా రోజుకీ పదికిలోమీటర్ల పరుగు వుంటుంది. అంటే 10కె రన్ అన్నమాట. అందుకే తన ఆరోగ్యానికి ఢోకా వుండదనుకున్నాడు. ఆ కారణంగా హెల్త్ చెకప్  ను కూడా వాయిదా వేశాడు.  ఈ మధ్య ఒక రోజు ఇలాగే పరుగెత్తి పరుగెత్తి రైల్లో కూర్చున్నాక కుప్పకూలిపోయాడు. చైన్ పుల్లింగ్ చేసి, సహప్రయాణీకులు అంబులెన్స్ లో ఆసుపత్రికి చేర్చారు. గుండెలో మూడు బ్లాకులున్నాయన్నారు. మూడు వారాల్లో స్టెంట్లు వెయ్యించుకోవాలన్నారు. ఆ మాత్రం గడువు చాలు నాన్నకి. మూడోవారం చూసేశాడు. కానీ నాన్న సంగతి తెలీక మృత్యువే తొందర పడింది. తీసుకుపోయింది నాన్నను.

నాన్నకు పూర్తి విరుధ్ధం అమ్మ. ‘ఆలస్యం’ అనేది వచ్చి ‘తొందర’ మెడలో తాళి కట్టిందేమో అని అనిపించేది వాళ్ళిద్దర్నీ చూస్తున్నప్పుడు. అమ్మ దేనికీ అరక్షణం ఆగదు. అందుకే నాన్న అలా నిశ్చలంగా నేల మీద పడుకుని వుండటం చూడలేనంటే, చూడలేనన్నది అమ్మ. ‘ఎవరూ రానక్కర్లేదు, చెయ్యాల్సింది చూడు.’ అనేసింది. ఏం చేస్తాడు కొడుకు ఆకాశ్ నాయుడు? ఫ్రెండ్స్ ను పిలుచుకుని, గంటలో తండ్రి బాడీని విద్యుత్ దహనవాటిక (ఎలక్ట్రికల్ క్రెమటరోరియం) కు చేర్చేశాడు. ‘యాషెస్ కావాలా?’ అనిఅడిగారక్కడ. ఇలా అడుగుతారని అమ్మ ముందే చెప్పింది. కానీ ‘నో’ చెప్పమంది. ‘నాన్న దేహాన్ని కదలకుండా వుంటేనే చూడలేని అమ్మ, బూడిద గా ఎలా చూస్తుంది?’ కారణం అర్థమయ్యింది. కానీ ఆకాష్ నాయుడే- దహనానికి బిల్లు కట్టే కౌంటర్ దగ్గర- తనకు తెలీకుండా ‘ఎస్’ చెప్పాడు. నాన్నే తనతో అలా చెప్పించాడేమో అనుకున్నప్పుడు ఆ రోజు ఆఖరి సారిగా తనకు కళ్ళు తడిశాయి. మరుసటి రోజు దహన వాటికకు వెళ్ళి నాన్న అస్థికలను ఈ ఇత్తడి పాత్రలో తెచ్చుకున్నారు. అమ్మకు తెలీకుండా అదే ఇంట్లో పాతకాలపు ఇనుప బీరువాలో పెట్టాడు. ఆ బీరువాకు అమ్మ పెట్టిన పేరు ‘దరిద్రం’. ‘లక్ష్మీదేవి చేతిలో చిప్ప పెట్టినట్లు, కళకళలాడే ఇంట్లో ఆ దరిద్రమేంటయ్యా?’ అని విసుక్కునేది. ‘తీసాస్తాన్లే’  అనే వాడు కానీ, ఆ పనిని కూడా వాయిదా వేసేవాడు నాన్న. ఆ ‘దరిద్రం’ వైపు కన్నెత్తి చూసినా తనకు ‘దరిద్రం’ అంటుకుంటుందని అనుకునేది అమ్మ. ఇప్పడు అమ్మకు కంటపడకుండా నాన్న బూడిదను దాయటానికి ‘దరిద్రమే’ సరయనది అని  భావించాడు ఆకాశ్ నాయుడు. నాలుగు అరలు దానికి. నాలుగు అరలకీ మళ్ళీ విడివిడిగా డోర్లు వున్నాయి కానీ, తాళాలు వేసి లేవు. దేనికి దానికి తాళం చెవులు వేలాడుతూనే వున్నాయి. బహుశా తాళాలు వేసే పనిని కూడా నాన్న వాయిదా వేసాడేమో! ధ్యానం కోసమని అమ్మ రామకృష్ణ మఠానికి వెళ్ళిపోయింది. ఇదే అదను అనుకున్నాడు.

‘దరిద్రం’ మొదటి అరను తెరిచాడు.

ఒకటి రెండూ ఫైళ్ళూ, పాతకాలపు ఫోటో ఆల్బమూ, ఆగిపోయిన చేతి వాచీ ఇలాంటివేవో వున్నాయి. వాటిని వెనక పెట్టేసి, తాళం వేసేసి, తాళం చెవి దాచేసుకున్నాడు ఆకాశ్ నాయుడు. ఎప్పుడూ? ఏడాది క్రితం. ఎప్పటికప్పుడు తెరుద్దామనుకున్నాడు. కానీ వాయిదా వేస్తూ వచ్చాడు. ‘ఎంతయినా ఆ తండ్రి కొడుకును కదా?’ అనుకుని తనలో తాను కొంచెం సేపు మురుసుకున్నాడు. కానీ ఇప్పుడు నాన్నలాగే చివరి నిమిషంలో పరుగులు తియ్యాలి. ఆగిన వాచీ వెనుక వున్న కలశాన్ని తీసి ఒక్కసారి గుండెలకు గట్టిగా అదిమి పట్టుకున్నాడు. ‘రేయ్ ఆకాశూ! అలాచెయ్యకు. గుండెల్లో నొప్పి వస్తుందిరా!’ నాన్నే అన్నట్టనిపించింది. ‘రాదులేరా!’ తనకు తెలీకుండా అనేశాడు. అవును. నాన్ననే! ‘రా’ అనే! నాన్నకు తన చేత అలా పిలిపించుకోవటం ఇష్టమయ్యేది. ‘సిగ్గులేదా, కొడుకు చేత రా- అనిపించుకుంటున్నావ్?’ అని అమ్మ అనేది. పట్టించుకునేవాడు కాదు నాన్న. నొప్పి రాకుండానే తిరిగి కలశాన్ని మొదటి అరలో పెట్టాడు. అందులోనుంచే అల్బమ్ ను తీశాడు. జాగ్రత్తగా నాన్న పడుకునే మంచం మీద బోర్లా పడుకుని, ముందు ఆల్బం పెట్టుకుని, మోచేతులాన్చుకుని, అరచేతుల్లో గడ్డాన్ని పెట్టుకుని పేజీలు తిప్పుతున్నాడు. యేళ్ళు దొర్లుతున్నట్టున్నపించింది.  ఫోటోల్లో చిన్నప్పటి నాన్న, ఎదుగుతూన్న నాన్న, గెడ్డం మీసాలతో నాన్న, నాటకంలో పంచె కట్టుకున్న నాన్. క్రిస్మస్ ట్రీ పక్కన నాన్న. తాతయ్య నానమ్మతో పాటు ఓ యాభయి మంది కుటుంబ సభ్యులతో నాన్న. నలుపు తెలుపుల్లో వున్న తన రక్తబంధువులను తేరిపార చూసుకున్నాడు ఆకాశ్ నాయుడు . మగవాళ్ళలో సరే. ఆడవాళ్లలో ఎవరి ముఖానా బొట్టు లేదు. దిగులుగా అనిపించింది ఆకాశ్ నాయుడికి. శక్తి కూడ దీసుకుని లేచి, డైరీని మూసి, మొదటి అరలో పెట్టేశాడు.

దరిద్రం’ రెండో అరను తెరిచాడు.

శుభలేఖ ప్రతులు కట్ట! ప్రింట్ చేయించి, పంచటం మరచిపోయినట్లున్నాడు నాన్న. ‘సురేఖ వెడ్స్ శ్యామ్ నాయుడు.’ నాన్న పేరు చివరి వున్న కులనామం నాన్నది కాదు. అమ్మదే. నాన్న పేరు సాంసన్. అమ్మను చేసుకునే ముందే శ్యామ్ నాయుడయ్యాడు. తప్పలేదు. ఈ పెళ్ళిలో త్యాగం వుంది. అది అమ్మదా? నాన్నదా? ఇప్పటికీ ఆకాశ్ నాయుడికి తెలీదు. ఎందుకంటే నాన్న అమ్మ జీవితంలోకి రాక ముందు, ఆమెకు ఒక పెళ్ళయ్యింది. పెద్దలు కుదిర్చిందే. కానీ అతడు వట్టి అనుమానస్తుడు. ఎన్నిసార్లు అమ్మను అనుమానించాడో ఆధారాలున్నాయి. అవన్నీ అమె వొంటి మీదే. అనుమానం వచ్చిన ప్రతీ సారీ కాల్చిన సిగరెట్టుతో ‘గోరింటాకు’ పెట్టేవాడు. మచ్చలన్నీ అవే. చిట్టచివరి పెట్టిన మచ్చ ఆమె కడుపు మీద. నిప్పుతో కాదు, కత్తితో. అనుమానంతో బలవంతాన ఆమెకు అబార్షన్ చెయ్యించాడు. ఆ తర్వాతేముంది? విడాకులిచ్చేసి  అనుమాన రోగం నుంచి తాత్కాలికంగా స్వస్తత పొందాడు. కానీ అమ్మకే కొత్తరోగాన్ని తగిలించాడు: ఏవగింపు! మనుషుల్లో సగం మంది మీద వ్యతిరేకతను మిగిల్చిపోయాడు. వాళ్ళే మగాళ్ళు. అప్పట్నుంచీ తాను తలచుకునే అతీతశక్తిని ‘దైవం’ అంటుంది కానీ ‘దేవుడు’ అనలేదు.

కానీ బ్యాంకులో పనిచేసే అమ్మకు, కేవలం ఒకానొక కస్టమర్ గా పరిచయమయిన నాన్నలో  మాత్రం ‘దేవుణ్ణి’ చూసేసింది. సరిగా క్యాష్ కౌంటర్ మూసేసే ముందు, పాత సంచీలోని నోట్ల కట్టల్ని పైకి తీసేవాడు నాన్న.  డిపాజిట్టు చెయ్యటానికే. అన్నీ పదులూ, ఇరవయిల కట్టలే. మర్యాద తప్పకుండా, చీవాట్లు పెట్టేది అమ్మ. ఎంత తిట్టినా నాన్న ముఖంలో కృతజ్ఞతే కనిపించేది అమ్మకు. అసలు తిట్టించుకోవటం కోసమే నాన్న వస్తున్నాడేమో అనే అనుమానం కూడా కలిగేది.  చిల్లరంతా పోగుచేసి సాయింత్రం లెక్కించినట్లు, విసుగంతా మూటకట్టి నాన్న మీద వెళ్ళకక్కేది అమ్మ. అయినా నాన్న ముఖం మీద చిరునవ్వు చెరిగేది కాదు. ఒక రోజు పని పూర్తయ్యాక, తలనొచ్చుతోందని, అమ్మ తన క్యాష్ కౌంటర్ కే కాఫీ తెప్పించుకుని, పెదవుల మీద పెట్టుకుందంతే. నాన్న వచ్చి పాత సంచీలోంచి అవే పదుల, ఇరవయిల కట్టలు తీశాడు. కప్పుని నాన్నముఖం మీద విసరబోయి, తమాయించుకుని, ఆ చర్యను విరమించుకుంది. కానీ అప్పటికే ఆ కాఫీ తన చీర మీద పడిపోయింది. ఆమె నీళ్ళతో చీర మీది మరకల్ని తుడుచుకుని, పైకి చూసేసరికి ఎదురుగా కౌంటర్లో పొగలు కక్కుతూ కాఫీ! నాన్నే తెచ్చిపెట్టారు. అమ్మ నవ్వేసింది. ఓ రోజు అమ్మే నాన్నను క్యాంటీన్ కు తీసుకువెళ్ళింది. అక్కడ ఎందుకో, తన గతమంతా చెప్పేసింది. చేతుల మీద తన మాజీ భర్త పెట్టిన మచ్చల్ని చూపింది.  అలా చూపిస్తున్నంత సేపూ ఆమె నోటి నుంచి తిట్లే తిట్లు. రావాల్సినవి కళ్ళ నుంచి నీటు బొట్లు కదా? అవి రాకే ఆ తిట్లు. తన మాజీ భర్త ఇంటిలోని సామాను ఖాళీ చేసినట్లు, కంటిలోని నీరును ఖాళీ చేశాడు. నాన్న మాత్రం ఏడ్చేశాడు. అంతలోనే నాన్నకు ఏదో గుర్తు వచ్చి, కర్చీఫ్ తీసి  తుడిచేసుకుని, నవ్వు నటించాడు.

‘మీకసలు మైండ్ వుందా? ఏడుపొస్తే ఏడ్వచ్చుకదా? ఎందుకు తుడిచేసుకున్నారు?’ అని తిట్టింది అమ్మ.

‘నమ్మరేమోననీ.. ఏడ్చే మగవాణ్ణి నమ్మకూడదంటారు కదా?’ నసిగాడు నాన్న.

‘నేనయితే ఏ మగవాణ్ణీ నమ్మను. ఏడ్వని వాణ్ణయితే అస్సలు నమ్మను. మీరు ఏడ్చారు కాబట్టి నమ్మాలనిపిస్తోంది. అంతేకాదు.  ఏడుపొస్తే ఏడ్వగలిగిన వాడే దేవుడేమో అనిపిస్తుంది.  ఆ తర్వాత, ఆపని చెయ్యగలిగింది పసివాడే. తరగని కన్నీళ్ళు వాళ్ళకే వుంటాయి, ’ అంది అమ్మ.

అలా అమ్మ పని చేసే బ్యాంకుకు ప్రతీ రోజూ వచ్చే లాస్ట్ కస్టమరే, జీవితంలో ఫస్ట్ లవర్ అయ్యాడు. (మరి మొదట చేసుకున్నవాడో? వాడు భర్తే కాడు, ప్రియుడెలా అవుతాడు?) కానీ అలా వచ్చిన దేవుడికి ఆమె పెట్టే అనుదిన నైవేద్యం తిట్లే! అందుకే కదా, నాన్న చనిపోయినప్పడు అమ్మ ఏడ్వలేదు?! లోలోపల ఎంత తిట్టుకుందో? (అంటే, రాని కన్నీరును ఎంత కార్చిందో?) కానీ ఆరోజు స్నానాలు అన్నీఅయ్యాక మాత్రం, అమ్మ నాన్నను తిట్టిన చివరి తిట్టు, ‘పని దొంగ’ అని. ‘పని దొంగ కాబట్టే, నీకు పెళ్ళి చేసే పెద్ద పని నా మీద పెట్టి పోయాడు?’ అంది.

‘దరిద్రం’ మూడో అరను తెరిచాడు.

అది బీహార్ వెళ్ళే రైలు జనరల్ బోగీలాగా కిటకిట లాడుతోంది. ఫోటోలతో క్రిక్కిరిసి పోయింది. ఒకటి తీస్తే పది కింద పడుతున్నాయి. అన్నింటిలోనూ ఇద్దరు: నాన్నా, నాన్న బిజినెస్ పార్టనర్ వెంకటరెడ్డి అంకుల్. పెళ్ళి విందుల్లో, గుడిమెట్ల సందుల్లో;  రంగులరాట్నాల మీదా, పాట్నా వీధులపైనా; తాజ్ మహల్ ముందూ, ఇండియా గేట్ వెనుకా. ఒక్కసారిగా అనుమానం వచ్చింది. నాన్నకు పెళ్ళి అమ్మతో అయ్యిందా? వెంకటరెడ్డి అంకుల్తో అయ్యిందా?

గోదావరి మొబైల్ మారింది. అని దాని పక్కన నెంబరు రాసివుంది. వెంటనే కాల్ చేసెయ్యాలనిపించింది ఆకాశ్ నాయుడికి. కానీ, తటపటాయించాడు. అదే నెంబరును వాట్సాప్ లో చెక్ చేశాడు. ‘మహి’ అన్న పేరుతో వుంది. ‘మహి’ అంటే ‘మహి’ కాకపోవచ్చు. ఇంకా వుండి వుంటుంది. ‘మహిమ?’. మరీ నాన్నవాళ్ళకాలంలో ఆడపిల్లలకు అంత స్టయిలిష్ పేర్లు ఎందుకు పెడతారు? బహుశా ‘మహేశ్వరి’ అయి వుండాలి. ఉండాలి ఏమిటి?  అయ్యే వుంటుంది.  స్టాటస్ లోని ఫోటో చూశాడు. అందంగానే వుందావిడ. వయసు యాభయి వరకూ వుండొచ్చు.

వాగర్థ. వాళ్ళు నడిపే గిఫ్ట్ స్టోర్ పేరు. అంకుల్ వాక్కు అయితే, నాన్న అర్థ. నిజం కూడా అంతే. వెంకటరెడ్డి అంకుల్ మార్కెటింగ్ చేస్తాడు. కాస్త పెద్ద క్లయింట్లనే పడతాడు. కంపెనీల్లో, కార్పోరేట్ ఆఫీసుల్లో పండగలకీ, పబ్బాలకీ గిఫ్టులిస్తారు. ఉద్యోగులకూ, కస్టమర్లకూను. వెంకటరెడ్డి అంకుల్ ఎక్కడికి వెళ్ళినా బీరకాయపీచు బంధుత్వం కలిపేస్తాడు. నాన్న క్రియేటివ్. కస్టమర్ అభిరుచికి తగ్గట్టు గిఫ్ట్ లు కస్టమైజ్ చేస్తాడు. పెట్టుబడీ పెడతాడు. సారమనే ‘అర్థా’నికే కాదు, పైసలనే ‘అర్ధా’నికి కూడా ప్రతీక నాన్నే. ఇద్దరిదీ ఫిఫ్టీఫిప్టీ షేరు. నాన్న వెళ్ళిపోయినప్పుడు తనలో సగం మాయమయ్యినట్టే ఫీలయ్యాడు వెంకటరెడ్డి అంకుల్.

‘శ్యామూ, నువ్వుకాదు, నవ్వులేకుంటే నేనే శవాన్ని. నా జీవానివయ్యా నువ్వూ’ అంటూ తరలించటానికి సిధ్ధం చేస్తున్న నాన్న దేహం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది వెంకటరెడ్డి అంకులే. ఆ సమయంలో వచ్చినవాళ్ళు అమ్మనీ, అంకుల్ నీ మార్చి మార్చి చూశారో ఏమో, కాస్సేపు ఎవరు ‘లైఫ్ పార్టనరో’ ఎవరు ‘బిజినెస్ పార్టనరో’ తేల్చుకోలేక పోయారు. ఆ మేరకు చెవులు కొరుక్కున్నారు కూడా. ఎందుకంటే ‘గోవిందా!’ అంటూ నాన్న శవాన్ని పైకెత్తేశాక కూడా అమ్మ కంట చుక్క నీరు రాలేదు. కారణం కొడుగ్గా తనకు తెలుసు కానీ, వాళ్ళకి తెలీదుగా. ఇలా అనుకుంటుంటే తన కళ్ళు చెమ్మగిల్లాయి.

దరిద్రం’ నాలుగో అరను తెరిచాడు.

సరిగ్గా అప్పుడే షర్ట్ పాకెట్ లో వున్న మొబైల్ ఫోను చుంచులా కదిలింది. గుండె అదిరింది. వైబ్రంట్ మోడ్ లో పెట్టుకున్నసంగతి గుర్తు తెచ్చుకుని, నిమ్మళపడి, ఆన్సర్ చేశాడు:

‘పంతులుగారితో మాట్లాడాను. మీ నాన్నగారి అస్థికల్ని మంచిర్యాల దగ్గర కలపొచ్చు. గోదావరిలోనే.’ అన్నాడు తన కొలీగ్ కార్తికేయ.

‘ఇంకా నయం. నాసిక్ లోనో, నర్సాపురంలోనో కలపొచ్చు అనలేదు. నాన్న పుట్టిపెరిగింది. కొవ్వూరు. వెస్ట్ గోదావరి. తెలుసుకదా!’ బదులిచ్చాడు ఆకాశ్ నాయుడు చనువులోంచి వచ్చిన విసుగుతో.

‘రేయ్. అంత సరదాగావుంటే వెళ్ళి, నది పుట్టిన చోటు నాసిక్ దగ్గర కలుపు. మీ నాన్న కొవ్వూరు దాకా ఫ్లో అవుతాడు. కానీ నర్సాపురం దగ్గర కలప కూడదు. అది ఆ కొస. మీ నాన్నకోసం నీళ్ళు వెనక్కి రావు. మంచిగా వుంటుంది. నా మాట విని మంచిర్యాల్లోనే కలుపు.’ దాదాపు గోదావరి నదీ ప్రవాహం మీద జాగ్రఫీ పాఠం చెప్పాడు కార్తికేయ. ఆకాశ్ నాయుడు విని తీరాల్సిందే. ఎందుకంటే తాను హైదరాబాద్ లో కనీకనిపించని మూసీనది తప్ప వేరే నదిని చూడలేదు.

‘సరేలే. మంచిర్యాలలో కలిపితే, అదే గోదావరిలో కొవ్వూరు వరకూ వెళ్తాడుగా నాన్న. అది చాలు. థ్యాంక్స్ రా.’ అని  ఎడమ చేత్తో కాల్ కట్ చేశాడు.

గోదావరి!

డైరీ. ‘వాగర్థ’ గిఫ్ట్ సెంటర్ దే. నాలుగో అర తెరవగానే కనిపించింది. దానిపైన స్కెచ్ పెన్ తో రాసి వుంది. నాన్న చేతిరాతతో. ఎప్పటిదో 2014 నాటి డైరీ. తీసి పేజీలు తిప్పుతుంటే, ఒక ఏడాది డైరీని పదేళ్ళు రాసినట్టున్నాడు. ఆయన చనిపోయేవరకూ. వాయిదాల మనిషి కదా! ఏ రోజుకారోజు రాద్దామనుకుని, ఏదో ఒక రోజు రాసిన డైరీ. ‘అన్నట్టు, మరొకరి డైరీ చదవొచ్చా?’ మధ్యలో ధర్మసందేహం రావటమూ, ‘నాన్నదే కదా! పైపెచ్చు ఆయన చనిపోయాడు.’ అన్న ఆపధ్ధర్మ సమాధానం దొరకటమూ ఏకకాలంలో జరిగిపోయాయి. దాంతో చదవాలనే నిర్ణయించుకున్నాడు ఆకాశ్ నాయుడు. డైరీ పేజీల్లోని తేదీలతోనూ, నెలలతోనూ, సంవత్సరాలతోనూ సంబంధంలేకుండా, రాసినచోటెల్లా తేదీని వేసినట్టున్నాడు నాన్న. ఎందుకో వెనక నుంచి, మరీ ముఖ్యంగా చనిపోవటానికి ముందురోజుల్లో ఏం రాశాడో చూద్దామనిపించింది.

‘డియర్, వయసయిపోయిందుటున్నావ్? నాకయితే అప్పుడెలా వున్నావో, ఇప్పుడూ అలాగే వున్నావ్. వీడియో కాల్లో చూశాగా..’  ఇది చనిపోవటానికి మూడు రోజులు ముందు రాసింది.

‘అలిగావట కదా! ఒక వేళ వస్తే మాట్లాడనన్నావట కదా! నీ గదిలోకి నన్ను రానివ్వనన్నావట కదా! కాదూ కూడదూ అని వస్తే బయిటకు తోసేస్తానన్నావట కదా! ఇంతకు ముందు ఎన్నిసార్లు అనలేదూ? ప్రేమన్నాక ఇలాంటివి మామూలే లే!’ ఇది రెండువారాల ముందటిది.

‘దొరికేశాడు నాన్న!’ అనుకుని కొంచెం కోపం, కొంచెం నవ్వూ, కొంచెం దిగులూ కలిపి తెచ్చుకున్నాడు. అన్ని ఉద్వేగాలు అరక్షణంలో ఎలా మిక్స్ అయ్యాయో తనకే బోధపడలేదు.

‘సో.. గోదావరి అన్నది కవర్. ఒక అడ్డు. నాన్న తన గాళ్ ఫ్రెండుకు ఈ పేరు పెట్టుకున్నాడు.’ అన్నమాట. ఇంకా కొన్ని పేజీలు ముందుకు- తిప్పాడు. ఇక ముందుకి పోబుధ్ధి కాలేదు. ఎంతయినా నాన్న లవ్ ఎఫయిర్ కదా! ఇబ్బందిగా అనిపించింది ఆకాశ్ నాయుడికి.

ఆ డైరీని చేతిలో వుంచుకునే పక్కనేవున్న నాన్న మంచం మీద వెల్లికిలా కూలబడ్డాడు.

అందుకేనా.. నాన్న ఊరు వెళ్ళొచ్చినప్పుడెల్లా అమ్మ గొడవ పెట్టేదీ? రాత్రి రాత్రంతా పంచాయితీయే. ఎంత వినకూడదనుకున్నా, వేసిన తలుపులు దాటి మాటలు బయిటకొచ్చేసేవి: ‘అది వుండగానే నాతో పెళ్ళికి రెడీ అయిపోయావా..? ఇంక నేనెందుకూ…? ఇంకోసారి దాంతో వుండొచ్చినట్టు తెలిస్తే.. ఇదిగో ఇక్కడే ఉరేసుకుని చచ్చిపోతా.’

ఇన్నాళ్ళూ అమ్మ, నాన్న మీద లేని పోని అనుమానాలు పడిందనే అనుకునే ఆకాశ్ నాయుడికి, ఇదంతా చదివాక అమ్మమీద జాలి వేసింది. అమ్మకు మొదటి పెళ్ళి అలా విడాకులయితే, రెండో పెళ్ళి ఇలా పెటాకులయిందా? నిజమే. నాన్న ఎప్పుడూ అమ్మను తీసుకుని ఎక్కడికీ వెళ్ళేవాడు కాడు. అలాంటి వాడు అమ్మను వెంటబడి, తిట్లుపడి, ఎందుకు చేసుకోవాలి?

అలా అనుకుంటూనే డైరీలో ఖాళీగా వున్న ఆఖరి పేజీ చిట్ట చివర్న చిన్నఅక్షరాలతో ఒక లైన్ ను చూసేశాడు:

గోదావరి మొబైల్ మారింది. అని దాని పక్కన నెంబరు రాసివుంది. వెంటనే కాల్ చేసెయ్యాలనిపించింది ఆకాశ్ నాయుడికి. కానీ, తటపటాయించాడు. అదే నెంబరును వాట్సాప్ లో చెక్ చేశాడు. ‘మహి’ అన్న పేరుతో వుంది. ‘మహి’ అంటే ‘మహి’ కాకపోవచ్చు. ఇంకా వుండి వుంటుంది. ‘మహిమ?’. మరీ నాన్నవాళ్ళకాలంలో ఆడపిల్లలకు అంత స్టయిలిష్ పేర్లు ఎందుకు పెడతారు? బహుశా ‘మహేశ్వరి’ అయి వుండాలి. ఉండాలి ఏమిటి?  అయ్యే వుంటుంది.  స్టాటస్ లోని ఫోటో చూశాడు. అందంగానే వుందావిడ. వయసు యాభయి వరకూ వుండొచ్చు. ‘ఇది అసలు అందమా? ‘ఏఐ’ తో కూర్చిన అందమా?’  రెండోదే కావచ్చనుకున్నాడు. అంటే, కనిపిస్తున్న ఫోటోకన్నా, ఇంకా ముసలావిడయి వుండొచ్చు. నాన్నకు గాళ్ ఫ్రెండ్ అంటే అంతేగా! గాళ్ గా నే వుండిపోదుగా! కానీ ఈయనకి మాత్రం ఇప్పటికీ ‘పడుచు అందమే’ కనిపిస్తోంది.

తుళ్ళిపడి లేచి కూర్చుని, ధైర్యం చేసి కాల్ చేసేశాడు. కాల్ లిఫ్ట్ చెయ్యలేదు. మళ్ళీ చేశాడు. కాల్ కట్టయింది. కానీ వెంటనే బీప్ సౌండ్ వచ్చింది. టెక్స్ట్ మెస్సేజ్: విల్ కాల్ యూ. ఇన్ మీటింగ్.

‘ఈవిడింకా ఉద్యోగం వెలగబెడుతోందా? అంటే అరవయి లోపే.’ అనుకున్నాడు. ఈలోపుగా అమ్మ ‘దరిద్రం’ నాలుగు అరలనూ ఎగాదిగా చూశాడు. పై మూడు అరలూ, నాన్నను ఆకాశానికెత్తాశాయి. ఈ నాలుగో అరే నాన్నను పాతాళానికి తొక్కేసింది. అమ్మ పోల్చుకున్న ‘దరిద్రం’ అంతా ఈ అరలోనే వుంది.

ఇలా అనుకునేలోగానే కాల్ మోగింది. ఆకాశ్ నాయుడి ఎత్తుకున్నాడు,

అవతల నుంచి ‘ఊఁ చెప్పండీ..?’ అన్నారు.

ఆడ గొంతులా లేదు. మగ గొంతే. దానిదేముంది? కొందరి మగాళ్ళ స్వరాలు ఆడ స్వరాల్లా వుండవూ? ఈవిడది మగ స్వరంలా వుండి వుండవచ్చు.

‘నేను ఆకాశ్ నాయుడు. హైదరాబాదే..’ గొంతు సవరించుకుంటూ అన్నాడు.

‘..ఆకాశ్..!?’

‘శ్యామ్ నాయుడి గారి అబ్బాయిని. ఆకాశ్ నాయుడిని’

‘ఓ.. ఆ..ఆకాశ్ వా! చెప్పేవాడులే మా సాంసన్ నీగురించి.. ఎలా వున్నావ్ బాబూ?’  అదే కరకు మగ గొంతునుంచి కుశల ప్రశ్న.

‘మీరూ..?’ ఉండబట్టలేక బయోడేటా అడగబోయాడు ఆకాశ్ నాయుడు.

అటువైపు నుంచి పెద్దగా నవ్వి, ‘మహిని.. మహేశ్వర్రావుని.. నాదీ మీనాన్న వూరే. కొవ్వూరు. మీ నాన్న చెప్పివుండడులే.’ అని తన మొత్తం సందేహాన్ని నివృత్తి చేసేశాడు ఆయన. కానీ తర్వాత ఆకాశ్ నాయుడికి మాట లేదు. టెన్షన్ మొత్తం ఒక్క సారి దిగినా సమస్యే! నీరసమనిపించింది.

‘అంకుల్.. చె.. చెప్పలేదంకుల్.’

‘ఆ.. చెప్పు నాన్నా ఆకాశ్! కాల్ చేశావ్. నాతో ఏమన్నా పని వుందా?’ పెద్దరికానికి చనువు పెదవుల మీద వుంటుంది. అందుకే ముందు ‘బాబూ’ అన్న మహేశ్వర్రావే  తర్వాత ‘నాన్నా’ అనేశాడు. ఇక ‘ఏరా’ అనటమే తరువాయి.

‘పనంటే .. పనికాదు కానీ..’ కాస్సేపు నసిగి, ఆగి ‘పనే అంకుల్.. నాన్నదే.. ఆయన పోయి ఏడాది అయిపోతోంది. కానీ ఆయన అస్థికలు ఎందులోనూ కలప లేదు. అలాగే వున్నాయి…’ అని చెప్పేశాడు ఆకాశ్ నాయుడు.

‘అస్థికలా?! ఏంటీ?  మా శాంసన్ ని దహనం చేశారా? చంపేశావ్ కదా రా ఆకాశూ..!’ వచ్చేసింది. మహేశ్వార్రావు నుంచి చనువుకు చివరి రూపం వచ్చేసింది. ‘రా’ అనేశాడు.

‘మా వాడు అన్నిటికీ దూరమే.. వాడి బాడీని ఏ మెడికల్ కాలేజీకో ఇచ్చేసి వుంటారనుకున్నానే. వాడి కోరిక అదే. వాడిదే కాదు. మా ఫ్రెండ్స్ సర్కిల్లో అందరిదీ అదే నిర్ణయం.’

‘మీరు పొరపడుతున్నారంకుల్. నాన్న సంప్రదాయాల్ని గౌరవించేమనిషి. అలాంటి ఆలోచనలు ఆయనకు లేవు..’ అని ఇంకా ఏవేవో చెప్పబోతున్నాడు.

‘కరెక్టేలే.  అలాంటి ఆలోచనలు అక్కడ వుండవు. సరే, చెప్పరా ఆకాశూ.. సారీ ఆకాశ్ నాయుడూ! ఇప్పుడు మీ నాన్న అస్థికలు ఎక్కడో అక్కడ కలిపేస్తానంటావ్? అంతేగా. అందుకు నేనేం చెయ్యాలీ?’ పాయింటుకొచ్చేశాడు మహేశ్వర్రావు.

‘ఎక్కడో అక్కడ కాదంకుల్. వాటిని గోదావరిలోనే కలపాలి. నాకేమో.. కొవ్వూరు దగ్గర గోదావరిలో కలపాలని వుంది. కానీ మా ఫ్రెండంటాడూ… గోదావరే కదా, మంచిర్యాలలో కలిపినా ఫర్వాలేదూ అంటాడు. మీరేమంటారు అంకుల్?’  అని మహేశ్వర్రావు కు పారమార్థిక ప్రశ్న వేసాడు ఆకాశ్ నాయుడు.

‘ఏమంటానూ…?’ అని, ఆగి,  ‘అస్థికలు కదా? మెడికల్ కాలేజికి ఇవ్వలేం. ఇచ్చినా వాళ్ళు తీసుకోరు. ఓ పన్జెయ్యిరా ఆకాశూ. నువ్విప్పుడెక్కడున్నావ్?’ అడిగాడు మహేశ్వర్రావు.

‘ఇంటి దగ్గరే. బాగ్ లింగంపల్లిలో.’

‘అలాగా.. నేను. ఏజీ ఆఫీసులో వున్నాను.’

‘ఏంటీ? మీరు కొవ్వూరులో లేరా? హైదరాబాద్ లో వున్నారా!’

ఇందుకోసమే, తనని తాను ఎప్పటికీ కలవని నాలుగు ముక్కలు చేసుకున్నాడు. కాదు, కాదు సమాజమే నాలుగు ముక్కలుగా మా వాణ్ణి ఖండించింది. కడకు తాను శ్యాం నాయుడుగానే వెళ్ళిపోయాడు. తనను కడసారి చూసేందుకు కూడా తన వాళ్ళు రాకూడదనే అనుకున్నాడు. మీ అమ్మ కూడా అదే పాటించినట్టుంది. శ్యాం నాయుడిగానే వాడు పోతే తప్ప, ఆకాశ్ నాయుడిగా నీకు భవిష్యత్తు వుండదు. చూశావా?

‘అవున్రా. ఎప్పుడో స్టేట్ డివిజన్ కాక ముందు రిటయరయ్యాను. గ్రాట్యుటీ, పాడూ అలాంటివి వుంటాయి కాదా? అవన్నీ ఇక్కడే వుండిపోయాయి. నేను ఉద్యోగం వెలగబెట్టింది కూడా వరంగల్ లోనే. పైపెచ్చు నా ఫైలు మీ నాన్న లాంటి ఆఫీసరు దగ్గర చిక్కుపడి పోయింది. వాయిదాలే వాయిదాలు. అవి వదిలెయ్ కానీ, నా కిక్కడ పనయిపోయింది. నువ్వు రాగలవా? ఏం లేదు. నిన్నుచూసినట్టుంటుంది. నిజం చెప్పనా? నీలోని మీ నాన్నను చూసినట్టుంటుంది. బయిల్దేరి రా.. ఈ ఆఫీసు పక్కనే ఓ రెస్టారెంటు వుంది.. దాని పేరూ…?’

‘..కామత్’

‘ఆఁ అక్కడికొచ్చెయ్. ఓకేనా?’ అని కాల్ ఎండ్ చేశాడు మహేశ్వర్రావు.

అంతే ఆకాశ్ నాయుడు అర క్షణం ఆలస్యం చెయ్యలేదు. తానీమధ్య కారు కొనుక్కున్నా, దానిని తీయలేదు. కలిసేది నాన్న ఫ్రెండును కదా! నాన్న బండి మీద వెళ్తేనే బాగుంటుందని తీశాడు. భారీ సౌండుతో, హారన్ మోగించే పనిలేకుండా వెళ్ళింది.

రెస్టారెంట్ బయిట నెరసిన జుట్టుతో, తెల్లని బట్టలతో ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. ఎందుకయినా మంచిదని బండి దిగిన వెంటనే కాల్ చేస్తే, ఆయనే లిఫ్ట్ చేశాడు. ‘నేనే. నువ్వు నన్ను గుర్తుపట్టక పోయినా, నేను నిన్ను గుర్తుపట్టేశాను. మా సాంసన్ లాగే నడుస్తున్నావు నువ్వు కూడా. రా.’ అన్నాడు. అప్పుడే ఆకాశ్ నాయుడు  గమనించాడు ఆయన కుడిచేతికి ‘ఎల్బోసపోర్ట్ వున్న వాకింగ్ స్టిక్’ వున్నట్లు. మెల్లగా కాస్త కుంటుతూ నడుస్తున్నాడయాన. ఆకాశ్ ఆడక్కుండానే కారణం చెప్పేశాడు:

‘తుంటె ఎముక చిట్లింది. అతుక్కునే వయసు కాదు కదా, కొవ్వూరులోనే. మీ నాన్న వుండగానే. నిలబడి టీ తాగుతుండగానే నవ్వబోయి వెనక్కి పడ్డాను. వెనక మునిసిపాలిటీ వాళ్ళు గొయ్యిని తవ్వి పెట్టినట్టు నాకేం తెలుసు? మీ నాన్నే మెల్లగా దిగి పైకి తీశాడు. అప్పుడు కొవ్వూరు వచ్చాడులే.’ అంటూ లోనికి వచ్చి టేబుల్ చూసుకుని కూర్చుని దోశలు ఆర్డర్ చేశాడు మహేశ్వర్రావు.

నాన్న డైరీలో ‘గోదావరి’ , ‘మహి’ అయి, ’మహేశ్వర్రావు’గా ముందు కూర్చున్నా, ఇంకా ఆకాశ్ నాయుడి మనసులో చిన్న సందేహ శకలం వుండిపోయింది. దానిని నివృత్తి చేసుకోవటం కోసం అడిగేశాడు:

‘నాన్నకు గోదావరి అనే గాళ్ ఫ్రెండు వుందా అంకుల్?’

‘గోదావరి మీ నాన్నకే కాదు, నాకూ గాళ్ ఫ్రెండే. నాకే కాదు. మా సర్కిల్లో వున్నవాళ్ళందరికీ గాళ్ ఫ్రెండే.’ అని మహేశ్వర్రావు తన తెల్ల మీసాలను సవరించుకుంటూ చెప్పాడు.

‘అంకుల్. నేనడిగేది నది గురించి కాదు. గోదావరిని కొందరు కవులు రొమాంటిగ్గా చూస్తారు. అది వేరు.  నేనడిగేదీ.. ఒకావిడ వుంటుందీ… పేరు గోదావరీ… ఒక గది తీసుకుని వుంటుందీ…!?’

‘నేను చెప్పే గోదావరీ అదే. నది కాదు. గదే!  మా ఇంటి మేడగదే. గోదావరి ఫ్రెండ్స్ సర్కిల్ ది ఆ గది. మా సర్కిల్ చిన్నది, అరడజను మందిమి. అందరూ బతికే వున్నారు. మీ నాన్నే తొందరపడ్డాడు. ఎవరు కొవ్వూరు వచ్చినా, ఆ గదిలో వుండాల్సిందే. మా కాలేజి రోజులూ, మా కలలూ, మా పార్టీలూ, మా చర్చలూ అన్నీ అందులోనే. ఆ గది మీ నాన్నకే కాదు. మా అందరికీ ప్రేయసే…’  అని చెప్పుకుపోతున్న మహేశ్వర్రావు ఒక్కసారి ఆగాడు. అందుకు కారణం ఆకాశ్ నాయుడే. అతడి చెక్కిలి తళుక్కుమంది. కారణం నీటి చుక్కలు. కన్నీటి చుక్కలు.

‘అనవసరంగా నాన్నను అనుమానించా.’ అన్నాడు ఆకాశ్ నాయుడు.

‘అంతేనా? లేక…ఉందనుకున్న పిన్ని లేకుండా పోయిందని ఫీలయ్యావా?’ అని తన వాకింగ్ స్టిక్ తో ఎదురు సీట్లో కూర్చున్న ఆకాశ్ నాయుడి మోకాలు మీద చిన్నగా తాకాడు. నవ్వేశాడు ఆకాశ్ నాయుడు.

‘మీ నాన్న అనుమానించదగ్గ వ్యక్తే. ఒక్కోచోట ఒక్కోవేషం. వేషమంటే వేషం కాదు. నిజమే. ఒక్కోచోట ఒక్కోమనిషి. మా దగ్గర హేతువాది. మీ దగ్గర సంప్రదాయ వాది. తన బంధువుల దగ్గర క్రైస్తవుడు. మీ బంధువుల ముందు హిందువు. బిజినెస్ పార్టనర్ దగ్గర ‘హనీ’ ఫేస్. లైఫ్ పార్టనర్ దగ్గర ఆముదం తాగిన ముఖం. ప్రెండ్స్ ముందు ఒకలాగ. కొడుకు ముందు ఇంకొక లాగ. వీడేరా బాబు.. నీ బాబు…. వింటున్నావా?’ ఆకాశ్ నాయుడి ముఖం చూసి, మధ్యలో ఆగాడు మహేశ్వర్రావు.

నిజంగానే ఆకాశ్ నాయుడి ముఖ కవళికలు మారాయి. ‘ఇతనేమిటీ? నాన్న ఫ్రెండునంటున్నాడు. ముందు మంచిగా చెప్పి నిందలు వేస్తున్నాడు? అయినా.. మంచిర్యాల కార్తికేయ గాడు చెబుతూనే వున్నాడు. అస్థికలు అలా పెట్టుకుంటే.. ఆయన తాలూకు అశాంతి నన్ను వేధిస్తూనే వుంటుందని. విన్నానా? అందుకే ఇది.  అస్థికలు కలపాల్సిందే. ఈ ముసిలాడు సహకరిస్తే కొవ్వూరులో.. లేక పోతే మంచిర్యాలలో.. వామ్మో..! ఇక ఆగ కూడదు.’ అని లోపల అనుకుని, పైకి మాత్రం ‘వింటున్నానంకుల్. వింటున్నాను. మా నాన్నని నటుడని అంటున్నారు. నిజమే.’ అని కవర్ చేసుకున్నాడు.

‘నటుడంటే నటుడు కాదు. ఒక వ్యక్తిలోనే పలువురు వ్యక్తులుంటారు. అలాంటి వారిమీద సినిమాలు కూడా వచ్చాయి. ఆ మానసిక రుగ్మతనేమంటారూ..?’ అని ఆగాడు మహేశ్వర్రావు.

‘మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్..ఒకే వ్యక్తిలో నలుగురు వ్యక్తులుండొచ్చు. ఆ నలుగురూ ఒకరికొకరు తెలియరు.’

‘మీ నాన్నలోనూ నలుగురున్నారు. నాలుగు అరల్లాగా. కానీ వారు ఒకరికొకరు తెలుసు. కానీ ఆ విషయం ప్రపంచానికే తెలియనివ్వడు.’ అని చెబుతూ మళ్ళీ ఆగాడు మహేశ్వర్రావు. కారణం ఆకాశ్ నాయుడి ముఖమే. మళ్ళీ మారింది.

‘నాన్నను ఇందాక నటుణ్ణి చేశాడు, ఇప్పుడు పిచ్చోణ్ణి చేస్తాడా ఏమి?’ అని ఆకాశ్ నాయుడు లోపల అనుకుంటూ, పైకి మాత్రం, ‘అవునంకుల్. మెంటల్ డిజార్డరేనేమో..!’ అని పైకి అన్నాడు.

‘కాదు. సోషల్ డిసార్డర్. సామాజిక రుగ్మత. అదే అతణ్ణి అలా మార్చింది. సాంసన్ కు మల్టిపుల్ పర్సనాలిటీస్ కావు. మల్టిపుల్ టాలెంట్స్ వుండేవి. మాంచి స్టేజ్ డైరెక్టర్. కాలేజీ రోజుల్లోనే కాదు. తర్వాత కూడా నాటకాలు వేయించాడు. సినిమాల్లోకి వెళ్దామనుకున్నాడు. వెళ్ళలేక పోయాడు. వాడు ఒరేషియస్ రీడర్. పుస్తకాలూ, పత్రికలూ తెగ చదివేవాడు. ఒక పేద్ద పబ్లిషింగ్ హౌస్ పెట్టాలని ప్రయత్నించాడు. కనీసం పుస్తకాల షాపు కూడా పెట్టలేక పోయాడు. రాత సరేసరి. ఎప్పుడూ ఏదో ఒకటి రాసేవాడు. పెద్ద రచయిత అవుదామనుకున్నాడు. ఆరోగ్యమంటే మహా శ్రధ్ధ. ఒక దశలో డాక్టరు కూడా అవుదామనుకున్నాడు. కాలేక పోయాడు.’ అన్నాడు మహేశ్వర్రావు.

‘దెన్ హి వాజ్ ఎ లూజర్.’ అని ఆకాశ్ నాయుడు పైకి అనేసి, నాలుక కరుచుకుని, ‘ఇదేమిటి? ఈ సారి నాన్నను అతడు తిట్టకుండా నా చేతే తిట్టించేస్తున్నాడు?’ అని లోపల కుమిలాడు.

‘లూజర్ లా సాంసన్ ఎప్పుడూ భావించలేదు. తన అనుకున్నది తన మిత్రుడు సాధిస్తే మురిసి పోయేవాడు.  ప్రసాదరాజు గాడు మంచి డైరెక్టర్ అయ్యాడు. అవార్డులుకూడా వచ్చాయి. వాడు మా ఆరుగురులో ఒకడు. మీ నాన్న పొంగి పోయాడు. ఇక సుబ్బారాయుడు గాడయితే పేద్ద పబ్లిషరే అయిపోయాడు. అప్పడు మీ నాన్న ఎగిరి గెంతేశాడు. మా రామశర్మగాడయితే సినిమాకు పాటలు రాస్తూ పాపులర్ అయాడు. ఇంకొకడున్నాడు కృష్ణారెడ్డి అని. వాడు డాక్టర్ అవ్వటమే కాదు. మల్టీస్పెషాలిటీస్  హాస్పటలే పెట్టేశాడు రాజమండ్రిలోనే. దాని ఇనాగరేషన్ కొచ్చినప్పుడు మీ నాన్న ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఎటొచ్చీ నా గురించే పెద్దగా ఆనంద పడలేదు. రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో సాదాసీదా క్లర్క్ నయి, సూపరింటెండెంట్ గా రిటయరయ్యాను. వీళ్ళే మా ‘గోదావరి ఫ్రెండ్స్ సర్కిల్. ఏ ఇద్దరు కలసి వచ్చినా మా మేడగదిలో సందడే సందడి.’ అని ఆపాడు మహేశ్వర్రావు.

‘తాను కాలేకపోయింది, ఇతరులయితే జెలసీ ఫీలవ్వాలి కదా?’ అడిగాడు ఆకాశ్ నాయడు.

‘కరక్టే. తాను కావలసింది ఎవడో అయితే జెలసీ. కానీ తన ఫ్రెండే అయితే? తానయినట్లే గా! అలగే భావించేవాడు మీనాన్న. అంటే మాలోని ప్రతీ ఫ్రెండూ మీనాన్న కు ఆల్టర్ ఇగో అన్నమాట.’ మహేశ్వర్రావు సమాధానం నివృత్తి.

‘ఈ విజయాల్లో  ఏ ఒక్కటీ మా నాన్న  స్వయంగా అందుకోలేక పోయాడు కదా!’ దిగులుగా అడిగాడు ఆకాశ్ నాయుడు.

‘సింపుల్. మీ నాన్నకు కులం లేదు. ఊరువెలుపలి వాడు. సమాజం ఎందుకు అందుకోనిస్తుంది? ఈ స్థితి తన తాత నుంచి తన తండ్రికి వచ్చింది. తన తండ్రి నుంచి తనకు వచ్చింది. కానీ తన నుంచి తన తర్వాత సంతానానికి రాకూడదనుకున్నాడు. అందుకే మీ అమ్మను చేసుకున్నాడు. నువ్వే చెప్పు?  ఆమె డివోర్సీ కాకుండా వుంటే మా సాంసన్ని చేసుకునేదా? మీ నాన్న తన పేరు చివర -నాయుడు- అని పెట్టుకున్నది, తనకు కలగబోయే సంతానం కోసం. అంటే నీ కోసం. తన కులాన్ని తనతోనే తుడిచెయ్యాలనుకున్నాడు. మీ అమ్మ కులాన్నే తన కులం చేసుకున్నాడు.  వ్యాపారంలోకి వెంకటరెడ్డిని తెచ్చుకున్నాడు. అలాగని ఊరువెలుపలి తన బంధువుల్నీ వదలుకోలేదు. కులాన్ని తడమకుండా గుండెకు హత్తుకున్న మా గోదావరి ఫ్రెండ్స్ సర్కిల్ నూ వదలుకోలేదు. ఇందుకోసమే, తనని తాను ఎప్పటికీ కలవని నాలుగు ముక్కలు చేసుకున్నాడు. కాదు, కాదు సమాజమే నాలుగు ముక్కలుగా మా వాణ్ణి ఖండించింది. కడకు తాను శ్యాం నాయుడుగానే వెళ్ళిపోయాడు. తనను కడసారి చూసేందుకు కూడా తన వాళ్ళు రాకూడదనే అనుకున్నాడు. మీ అమ్మ కూడా అదే పాటించినట్టుంది. శ్యాం నాయుడిగానే వాడు పోతే తప్ప, ఆకాశ్ నాయుడిగా నీకు భవిష్యత్తు వుండదు. చూశావా? తనకు లేని కులాన్ని నీకిచ్చి పోయాడు. మీ అమ్మ కులంలోనుంచే నీకు పిల్లని చూడవచ్చు. అర్థమవుతుందా?  నా ఫ్రెండ్ సాంసన్ ఎంత గొప్పవాడో? తాను బూడిదయి నీకు వెలుగు నిచ్చాడు?’ అని మహేశ్వర్రావు  నిజంగా గోదావరిలాగానే ప్రవహించాడు.

అప్పుడు జేబులోంచి తన వాలెట్ తెరిచాడు ఆకాశ్ నాయడు. బిల్లు చెల్లించటానికనుకుని ‘నో’ అన్నాడు మహేశ్వర్రావు.

కానీ తెరిచింది అందుక్కాదు. ఏడ్వటానికి. ‘ఐ లవ్య్యూ నాన్నా!’ అని భోరుమనటానికి. ఎందుంటే తన వ్యాలెట్ పైనే  నాన్న ఫోటో వుంటుంది. పరిసరాలు పట్టించుకోకుండా, అంత పనీ చేసేశాడు ఆకాశ్ నాయుడు.

‘వెలుగు నువ్వు తీసుకున్నావుగా. మరి బూడిద నాకిచ్చేస్తావా?’ అన్నాడు మహేశ్వర్రావు.

‘అంకుల్! తప్పకుండా అంకుల్. కొవ్వూరు గోదావరిలో కలిపేస్తారా మరి?’

‘కలపను. గోదావరిలో నిలిపేస్తాను. కొవ్వూరు గోదావరిలోనే. నదిలో కాదు. గోదావరి ఫ్రెండ్స్ సర్కిల్ గదిలో. మాతోనే వుంటాడయ్యా మావాడూ.. నువ్వు లే! గోదావరికి టైమ్ అయింది. అదేలే గోదావరి ఎక్స్ ప్రెస్ కు. నాన్న కలశం తీసుకుని నువ్వు వచ్చెయ్. నేను ఇటు నుంచి ఇలాగే క్యాబ్ పట్టుకుని స్టేషన్ కు వెళ్లిపోతాను. ఎస్-4 బోగీ నెంబరు. సీటు నెంబరు 36 లో వుంటాను.’ అని బిల్లు పే చేసి, మహేశ్వర్రావు లేచాడు.

ఆకాశ్ నాయుడు నిర్ణయించుకున్నాడు. మంచిర్యాల కార్తికేయ చెప్పింది మొత్తం మనసులోంచి తుడిచేశాడు. ఉరుములు ఉరిమే నాన్నబండి మీదే ఇంటికి వెళ్ళి, తన ల్యాప్ టాప్ బ్యాగ్ లో నాన్న కలశాన్ని పెట్టుకుని స్టేషన్ దగ్గరకు వెళ్ళాడు. సకాలంలో చేరిస్తే, అది నాన్న బండి ఎందుకవుతుందీ? స్టేషన్ లో గోదావరి బయిలుదేర లేదు, కానీ, ‘బయిలుదేరుటకు సిధ్ధముగానున్నది’ అన్న అనౌన్స్ మెంట్ మాత్రం మోగి పోతోంది.

నాన్నకలశాన్ని ఎత్తుకొని.. కాదు.. గుండెకు హత్తుకుని స్టేషన్లో పరుగులు తీస్తున్నాడు ఆకాశ్. ‘రేయ్. నెమ్మదిగా పరుగెత్తరా.. ఆయాసం వస్తుందీ.. పడిపోతావ్. అందుకే -జిమ్ముకు వెళ్ళరా -అంటాను.’  అవి నాన్నమాటలే. తనకు మాత్రమే వినిపిస్తున్నాయి. ‘అలాగే రా నాన్నా.. జిమ్ముకు వెళ్ళతా.. స్లిమ్మయిపోతా..’  ఇవి తన మాటలు.

రైలు కదులుతోంది. ఎస్-4 దగ్గరకు చేరుకున్నాడు. డోర్ దగ్గరే వున్న మహేశ్వర్రావు అంకుల్ చేతుల్లో నాన్నను భద్రంగా పెట్టేశాడు. నాన్న ఎప్పటిలాగే చివరి నిమిషంలో కదిలే రైలు ఎక్కేశాడు.

5 thoughts on “చతుర్ముఖుడు

  • అమలాపురపు దుర్గా ప్రసాద్

    కథ చదవడం మొదలు పెట్టినప్పుడు చిన్న కథేలే త్వరగా చదివేద్దాం అనుకున్నాను.. కానీ రాసింది శ్రీ సతీష్ చందర్ గారు…. మొదలుపెట్టడం మన వంతు అయితే.. చదివించుకోవడం సార్ వంతే.. చివరివరకు చదివించేసుకున్నారు..

    ఎప్పటిలాగానే ప్రతి లైన్లో క్లైమాక్స్ ఉంది…. నవ్వుతూ మొదలు పెట్టి, కళ్లు చెమ్మగిల్లిన తరువాత తుడుచుకుని క్లైమాక్స్ చదివాను..

    విచిత్రంగా అనిపించే ప్రేమ, అర్థంకాని పెళ్లి, కనిపించే కులం, కనపడని త్యాగం, ఇలా అన్ని కనిపించాయి..

    Reply
  • Pattupogula Pavan Kumar B.tech

    కథ కళ్ళముందు జరుగుతున్నట్టు ఉంది చదువుతుంటే,కళ్ళు చెమ్మగిల్లాయి సర్,ఇది కథ కాదు సార్ మన దేశంలో కోట్ల మంది పడుతున్న ఆవేదన,అవమానం,నిస్సహాయతను మీరు కథ రూపంలో వివరించారు,అందరికీ ఆకాష్ నాయుడుకి వచ్చిన అవకాశం రాదు,కానీ ఆకాష్ నాయుడు కథ ద్వారా అందరిని ఆలోచింపచేశారు,మనిషిని మనిషిగా చూడాలి,మనసుతో చూడాలి,మందిలో మెలగనివ్వాలి,ఎన్నో తరాలు పడిన అవమానాలు,బాధలు ప్రస్తుత తరం వారైన పడకుండా చేయాలి అనే మీ ఆలోచన చాలా అద్భుతంగా కనపడుతుంది సార్,మీ కథలు ఎప్పుడూ చదివిన సామాజిక అంశాలు చాలా బాగా ఉంటాయి సార్,నాకు చదవడం పైన ఇష్టం పెరిగింది అంటే ఆది కేవలం మీ వల్లే అని తెలియచేస్తున్నాను,మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సతీష్ చందర్ సార్.

    Reply
  • S. Naveen goud

    మా నాన్నగారు చనిపోయి 2025 మార్చ్ 24 కి 25 సంవత్సరాలు. సార్ రాసిన ఈ కథతో నేను మా నాన్నగారితో గడిపిన రోజులు గుర్తుకు తెచ్చుకున్నాను. కన్నీటి చుక్కలు మర్చిపోయిన నా కంటి నుండి కన్నీరు తెప్పించిది మీ కథ. నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను సార్ మీకు. కథలో సురేఖ గారి కారెక్టర్ భర్త చనిపోయినపుడు కన్నీరు కార్చలేదు. నిజానికి తన మనసులో దాచుకున్న కన్నీరు సముద్రమే. ఇక సురేఖమ్మ తన కంటి నీరు ఎలా కారుస్తుంది..! Really I love to read this story sir…

    Reply
  • Haneef Syed

    “హనీ”ఫేస్. బాగుంది కథ సర్

    Reply
  • A. Chandra sekhar

    సార్ ఒక్కక్క అక్షరం గుండుల్లో గుచ్చు కుంటున్నట్టు అనిపించి కన్నీళ్లు వచ్చాయి. ఈ పుస్తకం లో తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, ఫ్రెండ్స్ గురుంచి, ఆ తరువాత రాసిన గోదావరి ప్రేయసి గురుంచి చదివిన ప్రతిసారి కన్నీళ్లు వచ్చాయి.సార్ ఆ నలుగురు సినిమాను గుర్తు చేసారు అనిపించింది. కానీ ఇది సినిమా కధ కాదు జీవిత కధ అని అర్థమయ్యింది..
    ……. గోదావరి ఆస్థికలు……..

    Reply

Leave a Reply to S. Naveen goud Cancel reply

Your email address will not be published. Required fields are marked *