మేయర్ల పిల్లలు మునిసిపల్ స్కూళ్ళలో చదువుతారా?
మెట్లే. గుడి మెట్లు కాదు, బడి మెట్లే. మునిసిల్ బడి మెట్లు. ఒకటి, రెండు, మూడు.. ఇలా ఎనిమిది వరకూ బాగానే ఎక్కుతున్నారు. తొమ్మది దగ్గర తడబడుతున్నారు. పదో మెట్టు కొందరే ఎక్కుతున్నారు. ఎక్కిన వాళ్ళు కూడా పరీక్షల్లో జారిపోతున్నారు. ఈ బడులన్నీ ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలలోనివే. ఎవరి పాలనలో అన అడక్కండి. జగనా? బాబా? దొందూ దొందే. అసలీ బడుల్లో చదివేదే బడుగులు. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు. చదువులు(ఐటీ) ‘చిప్పులు’ దాటేసినా, బడుగుల చేతులకు ‘చిప్పలే’ ఇస్తున్నారు,
ఆంధ్రప్రదేశ్ పట్టణాల్లోని మునిసిపల్ పాఠశాలల పరిస్థితి గురించి మాట్లాడేటప్పుడు వైసీపీ, కూటమిలు ఎవరి గొప్పలు వారు చెప్పుకున్నాయి. కానీ నిజాలు వేరు. తొమ్మిదో తరగతి, పదో తరగతి దశకు వచ్చేసరికి డ్రాపవుట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. కనీసం 15 నుంచి 16 శాతం మంది విద్యార్థులు మధ్యలోనే చదువును విడిచిపెడుతున్నారు. వైసీపీ పాలనలోనూ ఇదే పరిస్థితి, కూటమి పాలనలోనూ ఇదే పరిస్థితి. పదో తరగతి ఉత్తీర్ణత శాతం కూడా 72 శాతం దాటడం లేదు. అంటే ప్రతి పది మంది విద్యార్థుల్లో నలుగురు లేదా ఐదుగురు హైస్కూలు విద్యను పూర్తిచేయకుండానే ఇంటి ముఖం పడుతున్నారు. ఇది కేవలం విద్యా గణాంకం కాదు. సమాజం భవిష్యత్తులో ఏర్పడబోయే అసమానతల సంకేతం.
ఇలా చదువుకు నోచుకోలేకపోతున్న వారిలో అత్యధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారే. మునిసిపల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో దాదాపు 90 శాతం మంది ఈ సామాజిక వర్గాల నుంచే వస్తున్నారు. అగ్రవర్ణాలకు చెందిన పేద కుటుంబాల పిల్లలు కూడా ఉంటారు, కానీ వారి వాటా సుమారు 10 శాతానికి మించదు. ఒక్క బీసీ విద్యార్థులే సగానికి పైగా ఉంటారు. అందువల్ల మునిసిపల్ బడిలో మధ్యలోనే ఆగిపోయే ప్రతి చదువు, వాస్తవానికి సామాజిక న్యాయం అనే రాజ్యాంగ వాగ్దానానికే ఎదురుదెబ్బ.
ఈ పిల్లలు ఎవరు? వీరు పట్టణాల్లోకి వలస వచ్చిన బీసీ కుటుంబాల పిల్లలు. ఒకప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కులవృత్తుల ద్వారా జీవించిన కుటుంబాలు ఇవి. కానీ వ్యవసాయం క్షీణించింది. దానికి అనుసంధానంగా ఉన్న వృత్తులు కూలిపోయాయి. గ్రామాల్లో ఉపాధి తగ్గిపోయింది. ఫలితంగా లక్షల కుటుంబాలు పట్టణాలు, నగరాలకు వలస వచ్చాయి. మునిసిపల్ పాఠశాలల్లో కూర్చున్న విద్యార్థుల్లో చాలా మంది ఈ వలస కుటుంబాల వారసులే. వారి తల్లిదండ్రులు జీవనోపాధి కోసం పోరాడుతుంటే, వారి పిల్లలు విద్య కోసం పోరాడుతున్నారు.

కానీ ఆ పోరాటం తరచూ మధ్యలోనే ఆగిపోతోంది. అర్థాంతరంగా నిలిచిపోయిన చదువులు వారిని మంచి కొలువుల వైపు పంపటంలేదు. దిక్కుమాలిన ఉద్యోగాలవైపు నెడుతోంది. వారిలో అనేకులు రోజు కూలీలు, డెలివరీ బాయ్‌లు, గిగ్ వర్కర్లు, తాత్కాలిక ఉపాధి చేసుకునే యువకులుగా మారుతున్నారు. కొందరికి కష్టపడి సంపాదించే మార్గం కూడా అందుబాటులో ఉండదు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆకర్షణ వారిని నేరాల వైపు నడిపిస్తుంది.
ఇలాంటి సమయంలో రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు జరుగుతున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్ పదవుల కోసం కూటమి, వైసీపీ పార్టీలు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాయి. కానీ ఒక చిన్న ప్రశ్న అడగాల్సిన అవసరం ఉంది. ఈ అభ్యర్థుల పిల్లల్లో ఎవరైనా మునిసిపల్ పాఠశాలలో చదువుతున్నారా? అధికార, ప్రధాన పక్షాల వారే కాదు, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థుల పిల్లలైనా ఈ పాఠశాలల్లో ఉన్నారా? ప్రజా విద్య గురించి సభల్లో ప్రసంగించడం ఒకటి. స్వంత పిల్లలను అదే విద్యా వ్యవస్థకు అప్పగించడం మరోటి. రెండోది చేయలేని వారు మొదటిదానికి ఎంత నైతిక అర్హత కలిగి ఉన్నారు?
ప్రజా బడులను నమ్మని రాజకీయ నాయకుడు, ప్రజా పాఠశాలల్ని ఎలా బాగు చేస్తాడు? ప్రభుత్వాసుపత్రికి వెళ్లని నాయకుడు ప్రజారోగ్యాన్ని ఎలా కాపాడతాడు? తన కుటుంబాన్ని ప్రజా వ్యవస్థల నుంచి దూరంగా ఉంచి, పేదల పిల్లలను మాత్రం వాటికే పరిమితం చేసే రాజకీయానికి ప్రజలు ఇంకెంతకాలం మద్దతు ఇవ్వాలి?
అందుకే ఒక కఠినమైన ప్రశ్న ఎదుట నిలుస్తుంది. మునిసిపల్ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించని అభ్యర్థులు గెలవాలా? ప్రజా విద్యపై వారికి విశ్వాసం లేకపోతే, ప్రజలు వారిపై ఎందుకు విశ్వాసం పెట్టాలి? అలాంటి పరిస్థితిలో ఓటరు నిరసనను వ్యక్తపరచడానికి మిగిలే ప్రజాస్వామ్య ఆయుధం ఏది?
బహుశా సమాధానం ఒకటే కావచ్చు.
NOTA. ప్రజా విద్యను నిర్లక్ష్యం చేసిన రాజకీయ వ్యవస్థకు ఓటరు చూపగల అత్యంత స్పష్టమైన అద్దం అదే. పురపాలక పాఠశాల మెట్లపై జారిపడుతున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు అదే అసలు దారి. Vote For NOTA.
-సర్
22 అక్టోబరు 2026
